విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ఫకవిమానం’. దామోదర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈరోజు విడుదలైంది. ఇందులో ఆనంద్ కు జంటగా శాన్వి మేఘన నటించింది. గీతా సైని, నరేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లాం వెళ్లిపోయిన మగాడి కథ ఇది. సుందర్ (ఆనంద్ దేవరకొండ) ఓ స్కూలులో ఉపాధ్యాయుడు. పెళ్లాం వెళ్లిపోతే ఎలాంటి వారికైనా ఎలాంటి తిప్పలు వస్తాయన్నది వినోదాత్మకంగా చెప్పారు. సుందర్ మీనాక్షి(గీతా సైని)ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయిన మొదటిరోజు వీరిద్దరి మధ్యా మాటామాటా పెరుగుతుంది. దాంతో ఆమె మరో యువకుడితో లేచిపోతుంది.
ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేడు సుందర్. ఆమె లేదన్న విషయం బయటికి తెలియనివ్వకుండా ఎలా కవర్ చేశాడన్నదే ఇందులో ప్రధాన అంశం. ఆ తర్వాత మీనాక్షి హత్యకు గురవుతుంది. పోలీసులు సుందర్ ని అనుమానిస్తారు. ఆమె వెళ్లిపోయాక సుందర్ ఏంచేశాడు? పోలీసుల బారి నుంచి ఎలా బయటపడ్డాడు? మీనాక్షిని ఎవరు చంపారు అన్న ప్రధాన అంశాలతో ఈ కథ సాగుతుంది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
హీరోయిన్ పెళ్లిపీటలు ఎక్కకుండానే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. హీరో పెళ్లాం లేచిపోతే ఆ హీరో అభిమానులు ఒప్పుకోరు కాబట్టి ఎవరూ ఇలాంటి కథలను తెరకెక్కించే ప్రయత్నం చేయలేదు. కాకపోతే ఎస్వీకృష్ణారెడ్డి రూపొందించిన చిత్రంలో మాత్రం రమ్యకృష్ణ సినిమా నటి అవ్వాలన్న కోరికతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అలాగే చిరునవ్వుతో అనే చిత్రం కూడా ఈ తరహా కథాంశంతో వచ్చింది. పెళ్లాం వెళ్లి పోతే ఏ భర్త అయినా ఎలాంటి ఇబ్బందులు పడతాడో దాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నాన్ని దర్శకుడు ఇందులో చేశాడు. అయితే కథనం విషయంలో మాత్రం దర్శకుడు తడబడ్డాడు.
ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యారనే చెప్పాలి. కథ కొత్తగా ఉండొచ్చు కథనంలో ప్రత్యేకత చూపాలి కదా. అదే ఇందులో కొరవడింది. బలవంతంగా కామెడీ పండించే ప్రయత్నం జరిగినట్టు అనిపిస్తుంది. ఒక్క సారిగా ఈ కథ మర్డర్ మిస్టరీగా మలుపుతిరుగుతుంది. రొటీన్ డ్రామానే ఇందులో కూడా కనిపిస్తుంది. సుందర్ గా ఆనంద్ దేవరకొండ మెప్పించినా ఈ పాత్ర అతనికి తగ్గది కాదేమో అన్న భావన కలిగిస్తుంది.
మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి హిట్ తర్వాత ఆచితూచి సినిమాను ఎంచుకుంటే బాగుండేదేమో. హీరోహీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ కూడా కుదరలేదు. ఈ పుష్పకవిమానం నేల విడిచి చేసిన సాములా అనిపిస్తుంది. ఈ రోజు విడుదలైన రెండు సినిమాలూ పాత సినిమాల పేర్లతోనే ఉన్నాయి. పుష్పకవిమానం, రాజావిక్రమార్క.. రెండు పెద్ద సినిమాలు. హిట్ జోనర్ సినిమాలు. వాటిని ఊహించుకుని వీటిని చూడకపోవడం నయం.
నటీనటులు: విజయ్ దేవరకొండ, శాన్వి మేఘన, గీతా సైని, సునీల్, నరేష్, గిరి, కిరీటి తదితరులు
సంగీతం: రామ్ మిరియాల,సిద్దార్థ్ సదాశివుని, మార్క్ రాబిన్, అమిత్ దసాని
నేపథ్య సంగీతం: మార్క్ కె. రాబిన్
కెమెరా: హెస్టిన్ జోస్ జోసెఫ్
నిర్మాతలు: గోవర్ధనరావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి
రచన, దర్శకత్వం: దామోదర
విడుదల తేదీ: 12-11-21
ఒక్క మాటలో: లేదు కొలమానం
రేటింగ్: 2.25/5