తమిళ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్‘. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో మరో తమిళ్ స్టార్ హీరో నిజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో విజయ్ కాలేజీ లెక్చరర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా విడుదలకు కరోనా బ్రేకులేసింది. ఇటీవల షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన చిత్రం రిలీజ్ కానున్నదని సమాచారం.
ఈ విషయాన్ని తమిళనాడు థియేటర్ అసోసియేషన్ నాయకుడు తిరుప్పూర్ సుబ్రమణ్యం పొంగల్ సెలవులకు ముందు జనవరి 13న ‘మాస్టర్’ విడుదల కానున్నదని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎడప్పాడి పళనిస్వామిని కలుసుకున్నారని, థియేటర్లలో ప్రేక్షకుల సామర్థ్యాన్ని 100 శాతానికి పెంచడం ద్వారా థియేటర్ సామర్థ్యం యొక్క నిబంధనలను సడలించాలని ఆయనను అభ్యర్థించినట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ సమావేశంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
థియేటర్లు పనిచేసే వరకు వేచి ఉంటామని, సినిమాను థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వారు ఈ చిత్రానికి U / A సర్టిఫికెట్ ఇచ్చారు. ‘మాస్టర్’ సినిమాపై కోలీవుడ్ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. టాలీవుడ్ లో కూడా విజయ్ కు అభిమానులు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజున వసూళ్లు అదిరిపోతాయని అంటున్నారు. మరి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Must Read ;- హాలీడే ముగించుకుని హైదరాబాద్ వస్తోన్న మల్లూ బ్యూటీ