‘ప్రస్థానం’ దర్శకుడు దేవా కట్టాకు ఆ సినిమా తర్వాత అంత పేరొచ్చే సినిమా ఏదీ తీయలేకపోయారు. తాజాగా సాయిధరమ్ తేజ హీరోగా రూపొందిస్తున్న సినిమా మీద మాత్రం మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇందులో లేడీ విలన్ గా రమ్యకృష్ణ నటించడమే. రమ్యకృష్ణ చేతికి ఓ పవర్ ఫుల్ పాత్ర వస్తే ఎలా ఉంటుందో మనం ఇంతకుముందు రజినీ కాంత్ ‘నరసింహ’లోనూ, ప్రభాస్ ‘బాహుబలి’లోనూ చూశాం.
మళ్లీ ఆ తరహా పాత్రలో దేవా కట్టా చూపబోతున్నారన్నది ఆమె లుక్ చూస్తేనే అర్థమవుతోంది. ఇందులో ఆమె పాత్ర తాలూకు ఆర్ట్ స్కెచ్ ను ఈరోజు విడుదల చేశారు. ఇందులో సాయిధరమ్ తేజ్ ఓ ఐఏఎస్ అధికారి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకి ‘రిపబ్లిక్’ అనే పేరు పెట్టారు. హీరో పరమైన టైటిల్ కాకుండా కథా పరమైన టైటిల్ కే దర్శకుడు ఓటేశారన్నది స్పష్టమవుతోంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.
వీరిద్దరికీ ఇది తొలి కాంబినేషన్. ఓ పవర్ ఫుల్ రాజకీయ నేత పాత్రను రమ్యకృష్ణ పోషిస్తున్నట్టు సమాచారం. ఆ పాత్ర పేరు విశాఖ వాణి. ‘తప్పు ఒప్పులు లేవు అధికారం మాత్రమే శాశ్వతం’ అనే నినాదంతో రమ్యకృష్ణ ఆర్ట్ స్కెచ్ ను విడుదల చేశారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ సినిమా జూన్ లో విడుదలవుతుంది. జెబీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై జె భగవాన్, పుల్లారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.