కరోనా కారణంగా థియేటర్లు ఇంకా తెరుచుకోకపోయినా తెలుగు సినీరంగంలో దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడిప్పుడే సందడి మొదలైంది. కరోనాకు ముందు ప్రారంభమైన చాలా సినిమాల ప్రచార పర్వం ఊపందుకుంటోంది.
కొందరు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదికగా విడుదల చేస్తుంటే..ఇంకొందరు థియేటర్లు ఓపెన్ కాగానే తమ సినిమాలను విడుదల చేసేందుకు ఎదురు చూస్తున్నారు. కాగా మొదలు కాబోతున్న, విడుదలకు ముస్తాబు అవుతున్న చిత్రాలకు సంబందించిన అనేక సినిమాల పోస్టర్లు, టీజర్లు, లిరికల్ వీడియో పాటలతో ఈ దీపావళి హోరెత్తింది. సాధారణంగా పండగల సెంటిమెంటుతో పోటాపోటీగా సినిమాలు, టీజర్లు విడుదల కావడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి దీపావళికి థియేటర్ల వద్ద సందడి లేకపోయినప్పటికీ, గతంలో ఎన్నడూ లేనంతగా తెలుగు డైరెక్ట్ చిత్రాలతో పాటు పలు అనువాద చిత్రాల టీజర్లు, లిరికల్ వీడియో పాటల విడుదలతో వాతావరణం సందడి సందడిగా మారిపోయింది.
రవితేజ కధానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘క్రాక్’ చిత్రం నుంచి ‘భూమ్ బద్దల్’ లిరికల్ వీడియో పాటను దీపావళి సందర్భంగా విడుదల చేయగా..తక్కువ సమయంలోనే 2 మిలియన్ ప్రేక్షకులు దానిని వీక్షించారు. ఇక అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం టీజర్ అంచనాలకు చేరువ కాగా దీపావళిని పురస్కరించుకుని విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తిని కలిగిస్తోంది. పూజాహెగ్డే చిచ్చుబుడ్డి కాలుస్తూ ఉంటే ప్రేమగా ఆమెను అనుసరిస్తూ అఖిల్ ఇందులో కనిపిస్తున్నారు. ఇదికూడా ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.
Also Read ;- లైవ్ టీవీల దిశగా ఓటీటీ దిగ్గజాల అడుగులు
నాగ శౌర్య, రీతువర్మ జంటగా తెరకెక్కుతున్నచిత్రానికి ‘వరుడు కావలెను‘ టైటిల్ నిర్ణయిస్తూ చాలా బాగా అలరింపజేసే వీడియో విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు ఆకట్టుకుంటుండటం విశేషం. త్వరలో విడుదల కాబోయే మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం నుంచి ‘సంధ్య’ అంటూ సాగే రొమాంటిక్ పాటను అమెజాన్ ప్రైమ్ సంస్థ విడుదల చేసింది ఈ పాట ప్రేక్షకులను అలరింపచేస్తోంది. ఇక పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ‘ఉప్పెన’ చిత్రం నుంచి దీపావళి కానుకగా విడుదలైన రంగులద్దిన పాట ఇప్పటికే 2.4 మిలియన్ల వ్యూస్ సాధించింది.
అలాగే శ్రియ శరన్ శివ కందుకూరి ప్రధాన పాత్రలలో రూపుదిద్దుకుంటున్న గమనం చిత్రం ట్రైలర్ కూడా దీపావళి సందర్భంగా తెలుగుతో పాటు ఐదు భాషలలో సందడి చేసింది. తనవైనా హొయలు, సొగసులతో ప్రేక్షకులను ఉర్రుతలూగించే శ్రియ శరన్ ఇందులో నటనకు బాగా అవకాశం ఉన్న బరువైన పాత్రను పోషించినట్లు కనిపిస్తోంది. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడైన శివ కందుకూరి ఈ ఎంట్రీతో తానేంటో చాటుకుంటాడేమో వేచిచూడాలి.
ఇక సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో రూపొందుతున్న ఎర్రచీర మేకింగ్ వీడియోను కూడా విడుదల చేసారు. ఇందులో బాగా పేరు తెచ్చిపెట్టే పాత్రను రాజేంద్రప్రసాద్ పోషించినట్లుగా అర్ధమౌతోంది. ఇంకా అనేక డైరెక్ట్ తెలుగు చిత్రాల టీజర్లు, లిరికల్ పాటలు, పోస్టర్లు విడుదలై ఆకట్టుకోగా.. కొన్ని అనువాద చిత్రాల టీజర్లు, పోస్టర్లు కూడా అలరించాయి. ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్రం నుంచి టీజర్ విడుదల కాగా మరో హీరో కార్తీ, రష్మిక జంటగా నటిస్తున్న సుల్తాన్ చిత్రం నుంచి పోస్టర్ విడుదలైంది. మొత్తం మీద దీపావళికి సందడి చేసిన ఈ టీజర్లు, పోస్టర్లు, పాటలు సినిమాల విడుదల తర్వాత ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Also Read ;- టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ‘దీపావళి’ తారా మణిహారం