‘ఛలో, భీష్మ’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు వెంకీ కుడుముల. దీని తర్వాత అతడు ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే వరుణ్ తేజ తో వెంకీ మూడో సినిమాను ఖాయం చేసుకున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ‘భీష్మ’ మూవీ తర్వాత వెంకీ.. స్టార్ హీరోలతో సినిమా చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్సయ్యాడు. దానికి తగ్గ కథల్ని కూడా రెడీ చేసుకున్నాడు. అయితే ఎందుకోగానీ వర్కవుట్ కాలేదు.
‘భీష్మ’ వచ్చి ఏడాది దాటిపోయినా.. వెంకీ మూడో సినిమా ఇంకా ప్రారంభం కాకపోవడంతో .. పలు రూమర్స్ వినిపించాయి. దీంతో ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ తో ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే ఇందులో మరో విశేషమేంటంటే.. ఇందులో వరుణ్ సరసన మళ్ళీ సాయిపల్లవిని ఎంపికచేసినట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాతో ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో ఫిదా చేసిన ఈ జంటతో మళ్ళీ రొమాంటిక్ మ్యాజిక్ చేయించాలని వెంకీ ఆలోచనట.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ‘ఫిదా’ జంటను ఖాయం చేసే పనిలో ఉన్నారట. సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో రానా ‘విరాటపర్వం’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, నానీ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాల్లో నటిస్తోంది. ఈ మూడు సినిమాలకూ భారీ అంచనాలున్నాయి. ఇవన్నీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు ఆమె నాలుగో సినిమా వరుణ్ తేజ తో చేయబోతోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి.
Must Read ;- ఓటీటీలో విడుదల కాబోతున్న మెగా హీరో రెండో సినిమా?