TRS and BJP Leaders Joining Congress :
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయిందనే అంతా అనుకుంటున్నారు. అటు జాతీయ స్థాయితో పాటు ఇటు ఆయా రాష్ట్రాల్లోనూ పార్టీ అవసాన దశకు చేరిందనే భావన సర్వత్రా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలోకి ఇతర పార్టీల నేతలు రావడమంటే.. అయ్యే పనేనా? అనేది జనం భావన. అయితే జాతీయ స్థాయిలో, ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి గురించి పక్కనపెడితే.. తెలంగాణ విషయానికి వస్తే మాత్రం మార్పు మొదలైందన్న సంకేతాలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల నుంచి ఇద్దరు కీలక నేతలు హస్తం పార్టీలోకి చేరిపోతున్నారు. ఈ మేరకు వారు ఏకంగా మంగళవారం ప్రకటనలు కూడా చేశారు. టీ పీసీసీ ఛీప్ గా రేవంత్ రెడ్డి ఎంపికతో తెలంగాణ కాంగ్రెస్ లో మంచి జోష్ కనిపిస్తోంది. అదే సమయంలో ఇతర పార్టీల్లో వణుకు కూడా మొదలైంది. అంటే భవిష్యత్తు అంతా కాంగ్రెస్ దేనా అన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ వాదనల మేరకే టీఆర్ఎస్, బీజేపీకి చెందిన ఇద్దరు నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.
రేవంత్ తో ధర్మపురి సంజయ్, ఎర్ర శేఖర్ భేటీ
అయినా రేవంత్ కు కీలక పదవి దక్కి కనీసం పది రోజులు కూడా కాలేదు.. అప్పుడే హస్తం పార్టీలోకి చేరికలా? అంటూ నొసలు చిట్లించాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే.. టీఆర్ఎస్ కు మంచి పట్టున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త డి.శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు ధర్మపురి సంజయ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.. సోమవారం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేవంత్ తో భేటీ సందర్భంగా వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నట్లుగా సంచలన ప్రకటనలు చేశారు. రేవంత్ ఎంపికతో కాంగ్రెస్ లో కనిపిస్తున్న జోష్ తోనే ధర్మపురి సంజయ్, ఎర్ర శేఖర్ లాంటి నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ధర్మపురి సంజమ్ ఏమన్నారంటే..
రేవంత్ తో భేటీ సందర్భంగా ధర్మపురి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగానని, తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కోసమే టీఆర్ఎస్ లో చేరానని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ లోకి వస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని వివరించారు. మొత్తంగా ఇప్పుడు డీఎస్ ఇంటిలోని వారు ముచ్చటగా మూడు పార్టీల్లో ఉన్నట్లే లెక్క. తండ్రి టీఆర్ఎస్ లో ఉంటే.. అరవింద్ బీజేపీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగనున్నారు.
ఎర్ర శేఖర్ నేపథ్యం ఏంటంటే..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎర్ర చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు దేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఎర్ర శేఖర్.. జిల్లాలోని జడ్చర్ల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తనదైన శైలి దూకుడు రాజకీయాలతో అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించిన ఎర్ర శేఖర్ పై పలు కేసులు కూడా ఉన్నాయి. ఓ హత్య కేసు విషయంలో పోలీసులకెఉ సరెండర్ అయిన ఎర్ర శేఖర్.. ఆ కేసు నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కాస్తంత దూకుడు తగ్గించిన ఆయన 2018 తర్వాత బీజేపీలో చేరిపోయారు. బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అయితే బండి సంజయ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు దక్కిన తర్వాత కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఆ పదవిలోనే ఎర్ర శేఖర్ కొనసాగుతున్నారు. తాజాగా ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రకటించారు.
Must Read ;- కేటీఆర్‌పై రేవంత్ పైచేయి.. ఎలాగో తెలుసా?











