వివిధ కేసులు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు.. వాటి విషయాల్లో దోషులుగా తేలుతున్నారు. ఆపై కోర్టులు వారికి జైలు శిక్షలు కూడా ప్రకటిస్తున్నాయి. అయితే ఇలా జైలు శిక్ష ప్రకటించిన వెంటనే ఆయా నేతలకు అక్కడికక్కడే బెయిల్ మంజూరు అయిపోతోంది. ఈ తరహా ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ చోటుచేసుకుంటున్న వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇతర రాస్ట్రాల పరిస్థితి అలా పక్కనపెడితే.. తెలంగాణలో ఈ తరహా ఘటనలు వరుసగా మూడు చోటుచేసుకున్నాయి. ఈ మూడింటిలోనూ ఆయా కేసుల్లో ప్రజా ప్రతినిధులు దోషులుగా తేలారు. వారికి జైలు శిక్ష ప్రకటించిన కోర్టు.. ఆ వెంటనే వారికి బెయిల్ మంజూరు చేసింది. తాజాగా బుధవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ కుమార్ కూడా ఇలాగే జైలు శిక్షకు గురై కూడా ఎంచక్కా బెయిల్ తో జైలుకు వెళ్లకుండానే.. కోర్టు నుంచే నేరుగా ఇంటికెళ్లిపోయారు.
దానం, మాలోత్ లకు ఇలాగే..
ఇటీవల మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు కూడా ప్రజాప్రతినిధుల కోర్టు రూ.10వేలు జరిమానాతో పాటు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారన్న అభియోగాలు రుజువు కావడంతో కోర్టు ఎంపీ కవితకు శిక్ష విధించింది. కోర్టు విధించిన జరిమానాను చెల్లించిన కవిత… న్యాయస్థానం నుంచి బెయిల్ పొందారు. 2019 ఎన్నికల ప్రచారంలో మాలోతు కవిత డబ్బుల పంపిణీ చేశారన్న ఆరోపణలతో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటినుంచి దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవల తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం ఎంపీకి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది. కొద్దిరోజుల క్రితం మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కూడా జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్‌లో 2013లో నమోదైన కేసులో నాగేందర్‌ను దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు ఆయనకు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తిపై దాడి చేశారన్న అభియోగాలు రుజువు కావడంతో ఆయనకు శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు కోర్టు ఆయనకు నెల రోజుల గడువు ఇచ్చింది. అప్పటివరకూ ఆయన్ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలిచ్చింది.
దాస్యం కేసేమిటంటే..
ప్రస్తుతం వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న దాస్యం వినయ భాస్కర్ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు కాజీపేట జంక్షన్ వద్ద రైలు రోకో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పట్లో దీనిపై కేసు నమోదవగా విచారణ కొనసాగుతూ వచ్చింది. బుధవారం తుది తీర్పు వెల్లడించిన కోర్టు వినయ్ భాస్కర్‌కు జైలు శిక్ష విధించింది. వినయ్ భాస్కర్‌తో పాటు మరో 18 మందికి కోర్టు జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించింది. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాలోత్ కవితకు శిక్ష విధించి బెయిల్ మంజూరు చేసిన హైదరాబాద్ లోని ప్రజాప్రతినిధుల కోర్టే.. బుధవారం దాస్యంకు జైలు శిక్ష విధించి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులు అంత సీరియస్ కేసులు కాకపోయినా.. ఏదో అలా పోలీసులు కేసు నమోదు చేయడం, వాటిని కోర్టులు విచారించడం, సాక్షులను ప్రశ్నించడం, శిక్షలు విధించడం, ఆపై బెయిల్ మంజూరు చేస్తున్న వైనంపై ఇప్పుడు కొత్త చర్చకు తెర లేసింది.
Must Read ;- అక్కడ టీఆర్ఎస్ ఓడితే!.. దళిత బంధు ఆగినట్టే!











