ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరిని నియమించాలనే విషయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోమారు తనదైన శైలి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏ ఒక్కరి అంచనాలకు అందనట్లుగానే జగన్ నిర్ణయం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు మరో మూడు నెలల పాటు సర్వీసు పొడిగించాలని జగన్ సర్కారు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికే మూడు నెలల పాటు ఎక్స్ టెన్షన్ పొందిన దాస్ కు మరోమారు పొడిగింపు అసాధ్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త సీఎస్ నియామకం తప్పదన్న భావనతో జగన్ సర్కారు శుక్రవారం నాడు సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మను రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న దాస్ సీఎస్ గా పదవీ విరమణ చేయనుండగా.. అక్టోబర్ 1న శర్మ కొత్త సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
నీలం అనుభవంతో అజయ్ వద్దన్నారా?
వాస్తవానికి సీఎస్ రేసులో అందరి కంటే ముందు అజయ్ సాహ్ని (1984 బ్యాచ్) ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఈయన ఏపీ మాజీ సీఎస్, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నిక కమిషనర్ గా ఉన్న నీలం సాహ్ని భర్త. గతంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలంను ఏరికోరి మరీ జగన్ సర్కారు రాష్ట్ర సర్వీసులకు పిలిపించి సీఎస్ పదవిని అప్పజెప్పింది. జగన్ అనుకున్నట్లుగానే నీలం కూడా జగన్ మాట జవదాటకుండానే పనిచేశారు. కోర్టు కేసులు ఎదుర్కొన్నారు కూడా. అందుకే కాబోలు.. సీఎస్ గా పదవీ విమరణ చేసిన మరుక్షణమే ఆమెకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా అవకాశం దక్కింది. ఈ లెక్కన వేరే ఎవరో కాకుండా.. తాను చెప్పినట్టుగా నడుచుకుంటుందని భావిస్తున్న నీలం ఫ్యామిలీకే సీఎస్ పదవి కట్టబెట్టాలి. ఇదే రీతిన ఆలోచించిన జగన్ సర్కారుకు అజయ్ సాహ్ని నుంచి షాక్ తగిలిందట. సీఎస్ గా ఉండగా నీలం ఎదుర్కొన్న రీతిలో ఇబ్బందులను ఓ సారి గుర్తు తెచ్చుకున్న అజయ్.. తాను ఏపీ సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టలేనని తేల్చేశారట. దీంతో ఆయన తర్వాత సీనియర్ అయిన సమీర్ కు జగన్ అవకాశం ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
శ్రీలక్ష్మిని వద్దనుకున్నారా?
ఎందరు సీనియర్లున్నా.. తెలంగాణ కేడర్ లో ఉన్న వై.శ్రీలక్ష్మిని ఏపీ కేడర్ కు మార్పించుకున్న జగన్.. ఈ సారి అందరినీ కాదని ఆమెకే సీఎస్ పదవిని అప్పగిస్తారని, ఎన్నికల చివరి దాకా ఆమెనే ఆ పదవిలో కొనసాగిస్తారని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడే తన సర్కారు పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించిన జగన్.. ఇప్పుడిప్పుడే శ్రీలక్ష్మికి సీఎస్ గా పదవి ఇచ్చి తాను మరింతగా కార్నర్ ఎందుకవ్వాలనుకున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన వారి విషయం గురించి అంతగా పట్టించుకోకున్నా.. అజయ్ వద్దనడం, శ్రీలక్ష్మి నియామకంపై విమర్శలు వస్తాయన్న భావనతోనే సమీర్ శర్మకు నూతన సీఎస్ గా జగన్ అవకాశం కల్పించారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- సినిమాని ‘బుక్’ చేసేసిన ఏపీ ప్రభుత్వం ‘షో’











