ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకున్నది సాధించారు. ఏపీకి తాను సీఎం కాగానే… తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనకు, తన అనుయాయులకు ఇతోధికంగా లబ్ధి చేకూర్చిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని ఏపీకి తెచ్చుకునేందుకు జగన్ విశ్వ ప్రయత్నమే చేశారు. అయితే ఏడాదిన్నర పాటు కేంద్రం ఇందుకు ససేమిరా అంటూ వస్తోంది. అయితే ఎంత కాలం గడిచినా జగన్ పట్టు విడవకుండా శ్రీలక్ష్మీ కోసం పైరవీలు చేస్తూనే ఉండటంతో ఎట్టకేలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఆమెను ఏపీ కేడర్ కు బదిలీ చేసేందుకు అంగీకరించింది. దీంతో కేంద్రం నుంచి అటు అనుమతి వచ్చిందో లేదో.. ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీలక్ష్మీ తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ అయిపోవడం, ఏపీ కేడర్ లో జాయిన్ కావడం, ఏపీ జీఏడీలో రిపోర్ట్ చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కంపెనీకి ఓబుళాపురం గనులను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన వైనంపై వైఎస్ మరణం తర్వాత విచారణ ప్రారంభం కావడం, గాలితో పాటు నాడు గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్న వీడీ రాజగోపాల్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగిన శ్రీలక్ష్మి కూడా అరెస్ట్ కావడం తెలిసిందే. జైల్లో ఉండగానే… తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీలక్ష్మి బెయిల్‌పై రిలీజయ్యే నాటికి చక్రాల కుర్చీలో బయటకు రావడం అందరినీ కలచివేసింది.
Must Read ;- సుప్రీంలో సంచలన పిటిషన్.. జగన్ బెయిల్ రద్దేనా?
సరే… కేసులు నడుస్తూనే ఉంటాయి అధికారులకు పోస్టింగులు ఇవ్వాల్సిందే కదా. ఈ క్రమంలోనే శ్రీలక్ష్మీపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేసిన తెలంగాణ సర్కారు.. ఆమెకు ఏదో అప్రాధాన్య పోస్టును ఇచ్చేసింది.
ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా.. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో వైసీపీ విజయం సాధించడం, జగన్ సీఎం కావడంతో శ్రీలక్ష్మిలో ఆశలు మళ్లీ చిగురించాయి. జగన్ సీఎం కుర్చీలో కూర్చోక ముందే ఆమె జగన్ ఇంటివద్ద వాలిపోయారు. తనను ఏపీ కేడర్‌లో చేర్చుకోవాలని, అందుకు కేంద్రాన్ని ఒప్పించాలని ఆమె జగన్ ను కోరారు. తన తండ్రి హయాంలో తమకు ఇతోధికంగా లబ్ధి చేకూర్చిన శ్రీలక్ష్మి లాంటి అధికారులు తాను అధికారంలోకి వచ్చాక తన వద్దకు వస్తానంటే జగన్ ఎందుకు వద్దంటారు. వెంటనే ఢిల్లీలో ల్యాండైన జగన్.. శ్రీలక్ష్మీని వెంటబెట్టుకుని మరీ పైరవీలు మొదలెట్టేశారు.
అయితే తెలంగాణ కేడర్ లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి అయిన శ్రీలక్ష్మిని ఏపీ కేడర్ కు మార్చడం కుదరదని కేంద్రం తేల్చిచెప్పింది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడికి మల్లే ఓ వైపు జగన్, మరోవైపు శ్రీలక్ష్మి కేంద్రం గడప తొక్కుతూనే ఉన్నారు. అసలు తనను ఏపీకి బదిలీ చేసేదాకా ఢిల్లీని వదిలి వెళ్లేది లేదన్న రీతిలో శ్రీలక్ష్మి రోజుల తరబడి అక్కడే ఉండిపోయిన వైనం కూడా ఆసక్తి రేకెత్తించింది.
ఏడాదిన్నరగా అడుగుతున్నారు కదా.. అందులోనూ మనం చెప్పినట్లు నడుచుకుంటున్నారు కదా.. వారడిగింది చేసేద్దామన్న భావనతో శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కోసమే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న శ్రీలక్ష్మి వెనువెంటనే తెలంగాణ కేడర్ కు రిలీవింగ్ లెటర్ ఇచ్చేసి ఆ వెంటనే ఏపీకి వచ్చేశారు. శుక్రవారం అమరావతికి వచ్చిన ఆమె జీఏడీలో రిపోర్ట్ చేశారు. జగన్ ఏరికోరి తెచ్చుకున్న శ్రీలక్ష్మికి ఇప్పుడు ఎలాంటి కీలక పదవి దక్కుతుందోనన్న చర్చ ఇప్పుడు ప్రారంభమవుతోంది.
Also Read ;- ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!











