కృష్ణా జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలు అన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అయితే, వరదకు పొలాల్లో మేట వేసిన ఇసుక తవ్వుకునేందుకు గనుల శాఖ రైతుల పేరుతో అనుమతులు మంజూరు చేస్తోంది. ఇసుకాసురులకు ఈ అంశం కలసి వచ్చింది. నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం గనిఆత్కూరులో కృష్ణా నది సమీపంలో 70 ఎకరాల్లో వరదలకు ఇసుక మేటలు వేశాయని, తవ్వుకునేందుకు అనుమతులు మంజూరు చేయాలని రాయలసీమకు చెందిన కొందరు వైసీపీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తు చేసిన 5 రోజుల్లోనే ఇసుక తవ్వుకుని అమ్ముకునేందుకు వారికి అనుమతులు వచ్చాయి. కనీసం గనుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతుల భూముల్లో ఇసుక ఉందా? లేదా? పరిశీలించకుండానే అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
రోజుకు రూ.2 కోట్ల విలువైన ఇసుక దోపిడీ
రైతుల పంట భూముల్లో వరదలకు చేరిన ఇసుక మేటలు తొలగించేందుకు కంచికచర్ల గనిఆత్కూరు గ్రామంలో 70 ఎకరాల్లో అనుమతులు తీసుకున్న ఇసుకాసురులు నదిలో ఇసుకను తవ్వేస్తున్నారు. ఇసుక తవ్వకాల్లో ఎక్కడా యంత్రాలను వినియోగించరాదని వాల్టా చట్టం చెబుతున్నా, అవేవీ అక్రమార్కులకు పట్టడం లేదు. రైతుల భూముల్లో ఇసుక తవ్వుతున్నట్టు నటిస్తూ పగలు, రాత్రి తేడా లేకుండా పొక్లెయినర్లు వినియోగించి రోజుకు 200 టిప్పర్ల ఇసుక తరలిస్తున్నారు. గనిఆత్కూరు గ్రామం జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో అక్రమార్కుల పని మరింత తేలికగా మారింది. ఒక్కో టిప్పరులో 18 టన్నుల ఇసుక నింపుకునేందుకు మాత్రమే రవాణా శాఖ అనుమతిస్తుంది. కానీ అక్రమార్కులు ఒక్కో టిప్పరులో 36 టన్నుల ఇసుక నింపి హైదరాబాద్, విజయవాడ తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ 200 టిప్పర్ల ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Must Read ;- ఇసుక దందా ఏ1.. మంత్రి గారికి చాలా క్లోజు!
అధికారులకు తెలియదా?
రైతుల భూముల్లో ఒక వేళ ఇసుక మేటలు వేసినా అడుగు మందం మించి మేటలు వేయవు. కానీ గనిఆత్కూరు గ్రామంలో అక్రమార్కులు నది సమీపంలో 20 అడుగుల వరకు ఇసుక తవ్వకాలు నిర్వహించారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా నిరంతరం కాపాలా ఉండేలా 20 మంది గూండాలను ఏర్పాట్లు చేసుకున్నారని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే ఇంత తతంగం జరుగుతున్నా గనుల శాఖ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అక్రమార్కులకు జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలు ఉన్నాయని తెలియడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇలా అక్రమార్కులు ఇప్పటికే రూ.30 కోట్ల విలువైన ఇసుకను తరలించారని గనిఆత్కూరు రైతులు చెబుతున్నారు.
అక్రమార్కులకు అడ్డుకట్ట పడేనా?
ఏపీలో ఇసుక తవ్వకాలు చాలా పారదర్శకంగా జరుగుతున్నాయని సీఎం జగన్మోహన్‌రెడ్డి వీలున్న ప్రతిచోటా చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక నాణ్యత లేక పోవడం, 18 టన్నులు బుక్ చేసుకున్న వారికి రాత్రి లోడు తీసుకువచ్చి 14 టన్నులు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఇసుక తెచ్చిన లారీ డ్రైవర్లకు, ఇసుక కొనుగోలు చేసుకున్న వారికి ప్రతి రోజూ గొడవలు జరుగుతున్నాయి. తమకు ఎంత లోడ్ చేస్తే అంత ఇసుక తెస్తామని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. ఖచ్చితంగా ఇసుక లోడ్ చేశామని డంపింగ్ పాయింట్ సిబ్బంది చెబుతున్నారు. మార్గ మధ్యంలోనే ఇసుక మాయం అవుతోందన్న ఆరోపణలున్నాయి. అసలే లారీ ఇసుక రూ.45 వేలు అమ్ముతున్నారు. అందులో కూడా ఇలా దోపిడీ చేస్తే ఎలా అని కొనుగోలుదారులు ప్రశ్నించినా పట్టించుకునే వారే లేరు. ఇక రవాణా ఛార్జీల రూపంలో బాధుడే..బాధుడు. ఇసుక కొనుగోలుకు రూ.8 వేలు ఖర్చయితే దాన్ని రవాణా చేయడానికి రూ.32 వేలు ఖర్చు అవుతోంది. ఇలా అధికారపార్టీ నేతలే వారి వాహనాలను ఇసుక తరలింపులో వాడుతున్నారని తెలుస్తోంది. ఇలా ఒకటిన్నర సంవత్సరంలో ఇసుకలో వేల కోట్ల దోపిడీ జరిగినా, ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అవకాశం ఉన్నప్పుడల్లా మంత్రులు ప్రకటిస్తూనే ఉన్నారు.
ఇక తాజాగా రైతుల భూమిలో ఇసుక మేటల తొలగింపు పేరుతో అనుమతులు తీసుకుని కొత్త దందా ప్రారంభించారు. అనుమతులు మాత్రం రైతుల భూముల్లో మేటలు తొలగించేందుకు ఉంటాయి. తవ్వేది మాత్రం నదిలోనే…ఈ విషయం అధికారులకు తెలసినా వారు నోరు మెదపడం లేదు. తవ్వేది అధికారపార్టీ నేతలు కాబట్టి. వారికి పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇక వారు ఎంత అరాచకాలకు దిగినా, 20 అడుగల మేర నదిలో తవ్వకాలు జరుపుతున్నా అధికారులు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారనే విమర్శలు వస్తున్నారు. కనీసం అటువైపు మీడియాను కూడా అనుమతించరు. ఇంత జరుగుతున్నా మీడియాలో కథనాలు వస్తున్నా ప్రజాప్రతినిధులు , అధికారులు నిద్ర నటిస్తున్నారని భావించాల్సి వస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. అధికారం చెలాయించే వారే అక్రమాలకు దిగుతుంటే, ఇక ఇసుకాసురులపై చర్యలు తీసుకుంటారని భావించలేం.
Also Read ;- దశా దిశా లేని దిశ చట్టం అస్తవ్యస్తమైన ఇసుక విధానం ఇవీ జగన్ నిర్ణయాలు