ఏపీలో పేకాటరాయుళ్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాడేపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే పేకాట రాయుళ్లు అడ్డా ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణా నది లంకభూముల్లో నిత్యం 300 మంది పేకాటరాయుళ్లు ఉదయం నుంచి సాయంత్రందాకా పేకాట ఆడుతున్నారు. ఒక్కొక్కరు ఒక రోజు పేకాట ఆడాలంటే నిర్వాహకులకు రోజుకు రూ.2,500 ముందుగా చెల్లించాలి. అందుకు వారికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఉచిత భోజనంతోపాటు పడవలో లంకల్లోకి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తారు. విజయవాడ, తాడేపల్లి పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంతో ఇంత తతంగం జరుగుతున్నా పోలీసులు కన్నెత్తి చూడకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.
రోజుకు రూ.50 లక్షలు చేతులు మారుతున్నాయి
రాజధాని ప్రాంతానికి చెందిన ఓ ఎంపీ అండతో పేకాటరాయుళ్లు చెలరేగిపోతున్నారు. ఏలూరు, గుంటూరు, విజయవాడ, భీమవరం లాంటి ప్రాంతాల నుంచి రోజుకు 300 మంది పేకాటరాయుళ్లు ఉదయం నుంచి సాయంత్రందాకా పేకాట ఆడుతున్నారు. ఇటీవలే ఆన్ లైన్, ఆఫ్ లైన్ జూదాలను నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. అయినా వైసీపీ నేతల అనుచరులే దగ్గరుండి పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. పోలీసులతో ముందుగానే మాట్లాడుకుని శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఇంత జరుగుతున్నా మీడియాలో కథనాలు వస్తున్నా, పోలీసులు మాత్రం ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు. దీని వెనుక అధికార పార్టీకి చెందిన ఎంపీ ఉండటంతోపాటు, పోలీసులకు కూడా పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
Must Read ;- బుసలు కొడుతున్న ‘కాల్’నాగులు..
సెబ్ ఏం చేస్తోంది
రాష్ట్రంలో పేకాట శిబిరాలు ఎవరు నిర్వహించినా వదిలేది లేదని సాక్షాత్తూ హోం మంత్రి సుచరిత, సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం, ఆన్ లైన్, ఆఫ్ లైన్ గేములు అంటే పేకాటను నిషేధిస్తూ చట్టం కూడా చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అబ్కారీ శాఖలోని 80 శాతం మంది సిబ్బందిని సెబ్ లోకి మార్చారు. వీరంతా నిఘావేసి అక్రమాలను అడ్డుకోవాల్సి ఉంది. అక్రమమద్యం అడ్డుకునేందుకు దాడులు నిర్వహిస్తున్న సెబ్, పేకాట శిబిరాల వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. ఈ శాఖ పనితీరు అనేక విమర్శలు వస్తున్నాయి. అధికారపార్టీ నేతల అండతో అక్రమాలకు పాల్పడే వారి వైపు సెబ్ కన్నెత్తి చూడటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వారానికి రూ.20 లక్షలట
వారం రోజులు పేకాట శిబిరం నిర్వహించుకునేందుకు వైసీపీ నేతల అనుచరులు పోలీసులకు పెద్ద ఎత్తున ముడుపులు ఇస్తున్నారని తెలుస్తోంది. పేకాట ఆడటానికి వచ్చే ఒక్కో వ్యక్తి నుంచి రోజుకు రూ.2,500 వసూలు చేస్తున్నారు. ఇలా రోజుకు రూ.పది లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఇలా వారం రోజులు పేకాట శిబిరం నిర్వహించుకునేందుకు వారానికి పోలీసు అధికారులకు రూ.20 లక్షలకు బేరం మాట్లాడుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఎంత రచ్చ జరిగినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాక, పోలీసులు చివర్లో హడావుడి చేసి కొన్ని రోజులు పేకాట శిబిరాలను మూయిస్తారని, ఇదంతా ప్లాన్ ప్రకారం నడుస్తోందని తెలుస్తోంది. ఆ తరవాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి శిబిరాలను వేరే చోట పెట్టి అక్కడ కొనసాగిస్తుంటారు. ఇలా పేకాటరాయుళ్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతూ వేలాది కుటుంబాలను అప్పులపాలు చేస్తున్నారని ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా విజయవాడ పోలీసులు కళ్లు తెరచి కూతవేటు దూరంలో జరుగుతున్న పేకాట శిబిరాలను మూయించాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read ;- వైసీపీ నేతల దౌర్జన్యం.. తెదేపా నాయకులకు తీవ్ర గాయాలు