సాయాజీ షిండే మంచి నటుడు .. ఆయన వాయిస్ లోని ప్రత్యేకతను ప్రేక్షకులు ఆదరించారు. మాతృభాష మరాఠీ అయినప్పటికీ ఏడు భాషల్లో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. విలన్ గాను .. కామెడీ టచ్ ఉన్న విలన్ గాను .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఆయన అనేక పాత్రలను పోషించారు. ప్రతిపాత్రపై తనదైన ముద్ర వేయడానికి ఆయన ప్రయత్నిస్తుంటారు. అల్లరి నరేశ్ ‘సీమటపాకాయ్’ సినిమాలో ఆయన పోషించిన పాత్రను అంత తొందరగా ఎవరూ మరిచిపోలేరు. తాను కోటీశ్వరుడై ఉండి, తన కొడుకు ప్రేమించిన అమ్మాయిని కోడలిగా చేసుకోవడం కోసం తోపుడు బండిపై ‘అరటిపండ్లు’ అమ్మే వ్యక్తి పాత్రలో ఆయన జీవిచాడు.
ఇక సాయాజీ షిండే పేరు చెప్పగానే గుర్తొచ్చే పాత్రల్లో ఆయన ధరించిన ‘యమధర్మరాజు’ పాత్ర ఒకటి. అల్లరి నరేశ్ హీరోగా చేసిన ‘యముడికి మొగుడు’ సినిమాలో సాయాజీ షిండే పోషించిన ఆ పాత్ర, అప్పటివరకూ వచ్చిన యమధర్మరాజు పాత్రలకు భిన్నంగా అనిపిస్తుంది. ఈ పాత్రను ఉద్దేశించే కొంతకాలం క్రితం కోట శ్రీనివాసరావు కామెంట్ చేశారు. తెలుగు తెరపై పరభాషా నటుల ప్రభావం గురించి కోట శ్రీనివాసరావు ఒక వేదికపై మాట్లాడుతూ, సాయాజీ షిండే పేరును ప్రస్తావిస్తూ ఆయన నటనను విమర్శించారు. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయం ప్రస్తావనకు రాగా, తనదైన శైలిలో ఆయన స్పందించారు.
నేను ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తినని అనుకోను. నేను భారతీయుడిని .. భారతీయులందరూ నా వాళ్లే. ఒక భాషకి చెందిన ఆర్టిస్టులు మరో భాషలో నటించకూడదనే భావన నాకు ఎప్పుడూ కలగలేదు. నటనకు భాష లేదు .. ఎవరు ఏ భాషలోనైనా నటించవచ్చు. ఇచ్చిన పాత్రకి న్యాయం చేయగలిగితే భాషతో పనిలేకుండా అందరూ ఆభిమానిస్తూనే ఉంటారు. వివిధ భాషల్లో నటించిన నాకు అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. బెస్ట్ యాక్టర్ గా వచ్చిన అవార్డులు నన్ను మరింత ప్రోత్సహించాయి. అందువల్లనే ఇంతవరకూ 500 సినిమాల వరకూ చేయగలిగాను. మెగాస్టార్ చిరంజీవి మొదలు పెద్ద పెద్ద హీరోలందరితోను కలిసి పనిచేశాను. వాళ్లంతా కూడా నాకు ఎంతో సహకరించారు. లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి ఇంటిపట్టునే ఉండిపోవలసి వచ్చింది. మళ్లీ ఇప్పుడిప్పుడే షూటింగులు మొదలవుతూ ఉండటం ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు.
Must Read ;- జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని పరామర్శించిన మెగాస్టార్