Senior Actress Jayanthi Passes Away :
తెలుగు చిత్ర పరిశ్రమ మరో మంచి నటిని కోల్పోయింది. ఒకప్పటి కథానాయిక, నటి జయంతి (76) అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, మరాఠీ చిత్రాలతో కలిపి దాదాపు 500 చిత్రాల్లో ఆమె నటించారు. గత కొంతకాలంగా ఆమె శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ఆమె కన్నుమూశారు. ఆమె స్వస్థలం బళ్లారి. తండ్రి ఉద్యోగరీత్యా ఆ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. ఆమె సినిమా ప్రయత్నాలు కూడా కన్నడ చిత్ర పరిశ్రమలోనే ప్రారంభమయ్యాయి.
హీరోయిన్ మొదలుకుని బామ్మ పాత్ర వరకూ ఆమె పోషించారు. ఆమె బెంగళూరులో స్థిరపడ్దారు. తెలుగు చిత్ర పరిశ్రమతో ఆమెకు దాదాపు 60 ఏళ్ల అనుబంధం ఉంది. హీరోయిన్ గా కన్నడ సినిమా జేనుగూడుతో 1960లో ఆమె చిత్ర రంగ ప్రవేశం చేశారు. అంతకుముందు ‘యానై పాగన్’ అనే తమిళ సినిమాలో ఓ పాత్ర పోషించారు. ఆమె అసలు పేరు కమల కుమారి. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్, ఎంజీఆర్ లతో కలిసి దాదాపు 30 చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు. భార్యాభర్తలు, జగదేకవీరుని కథ, డాక్టర్ చక్రవర్తి, మాయదారి మల్లిగాడు, `స్వాతికిరణం`, `రాజా విక్రమార్క`, `కొదమ సింహం`, `దొంగమొగుడు`, `శాంతి నివాసం`, `శ్రీదత్త దర్శనం`, `జస్టిస్ చౌదరి`, `కొండవీటి సింహం`, `అల్లూరి సీతారామరాజు`, `శ్రీరామాంజనేయ యుద్ధం`, `శారద`, `దేవదాసు` తదితర చిత్రాల్లో నటించారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్, మోహన్‌బాబు, రజినీ కాంత్, రాజ్ కుమార్, మమ్ముట్టి తదితర అగ్రనటులందరి చిత్రాల్లోనూ ఆమె నటించారు. బెంగళూరులోని బనశంకరిలో ఆమె నివాసముంటున్నారు. చాలామంది ఆమె కన్నడ నటి అనే అనుకుంటారు. కన్నడంలో ఆమె చాలా చిత్రాల్లో నటించారు. ఆమె మాతృభాష తెలుగేనన్న సంగతి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. జయంతి మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటిని కోల్పోయింది.
Must Read ;- బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ కన్నుమూత











