తెలుగు జర్నలిస్టు వర్గాల్లో కె.రామచంద్రమూర్తికి ఒక స్థాయి, ఒక పేరు ఉన్నాయి. వివిధ పత్రికల్లో ఢిల్లీలో రిపోర్టరుగా, సంపాదకుడిగా ఆయన పనిచేశారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంపాదకుడిగా చేశారు. తర్వాత హెచ్ఎంటీవీకి సారథ్యం వహించారు. సాక్షి దినపత్రికకు కూడా సంపాదకుడిగా ఉన్నారు. ఆంధ్రజ్యోతి- సాక్షి వంటి భావ వైరుధ్యం పుష్కలంగా ఉండే రెండు దినపత్రికలకూ సంపాదక స్థాయిలో కీలక బాధ్యతలు మోయగలగడం ఒకే వ్యక్తికి ఎలా సాధ్యమైంది అనే అనుమానం అప్పట్లోనే చాలా మందికి కలిగింది. కానీ.. ఉదరపోషణార్థం బహుకృతవేషం అన్నట్లుగా.. ప్రభువు మనసెరిగి నడుచుకోవడం అనేది ఉద్యోగధర్మం అయినప్పుడు.. ఎవరైనా ఎంతటి విరుద్ధ భావజాలాలు ఉండే సంస్థల్లోనైనా ఇట్టే ఇమిడిపోగలరని కూడా.. ఇలాంటి అనుమానాలు పుట్టినవారు సరిపెట్టుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అదివరలో సాక్షి సంపాదకత్వ బాధ్యతలు నెరపిన కె.రామచంద్రమూర్తికి.. ప్రభుత్వ సలహాదారుగా కీలక పదవి లభించింది. ఇంచుమించు మూడు లక్షల రూపాయల వేతనం, ఆఫీసు, కేబినెట్ ర్యాంకు పదవి, హంగూ ఆర్భాటం అన్నీ కలిసి వచ్చాయి. ఆ పదవిలో ఆయన సుమారు ఏడాదికి పైగా కొనసాగారు. తర్వాత ఉరుములేని పిడుగులాగ ఆయన ఉన్నపళంగా ఆ పదవికి రాజీనామా చేసేశారు. సలహాదారుగా ఏడాది కొలువు చేసినా.. ముఖ్యమంత్రికి ఒక్క సలహా కూడా ఇవ్వలేదని, ఆయన అడగలేదని అలిగి కేఆర్ రాజీనామా చేసినట్లుగా అప్పట్లో కర్ణాకర్ణిగా వినిపించింది. ఆయనకు జగన్ తో సంబంధాలు చెడ్డాయని కూడా కొందరు ప్రచారం చేశారు.
ఇక వర్తమానంలోకి వస్తే..
కేఆర్ జర్నలిస్టు వర్గాల్లో గుర్తింపు ఉన్న రామచంద్రమూర్తి.. ప్రస్తుతం సకలం పేరుతో వెబ్‌సైట్ నడుపుతున్నారు. సుదీర్ఘ పాత్రికేయ అనుభవంతో తనవంటి కొందరు సహచరులతో వ్యాసాలు రాయిస్తుంటారు. ఆ వెబ్ సైట్ కోసం ఆయన ఇటీవల వివాదాస్పదుడైన వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామక్రిష్ణ రాజును ఇంటర్వ్యూ చేశారు. యూట్యూబ్ ఛానెల్ లో అది పబ్లిష్ చేశారు. సదరు ఇంటర్వ్యూలో రఘురామక్రిష్ణరాజును ఆయన ప్రశ్నించిన తీరు చూస్తే.. ఎవరికైనా సరే ఆయన ఇంకా జగన్ కోటరీలోనే పనిచేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతుంది.
జర్నలిస్టుగా ఒక వాదనకు కట్టుబడి- ఆ దిశగా ప్రశ్నలు సంధించి ఇంటర్వ్యూ చేసే నాయకుడి నుంచి వివరాలు రాబట్టడం ఒక పద్ధతి. కానీ నాయకుడు ఏ వాదనకు కట్టుబడి ఉంటాడో.. ఏ వాదనకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాడో.. దానిని తప్పుబట్టడమే కర్తవ్యంగా ప్రశ్నలు అడగడం ఇంకో పద్ధతి. రెండో పద్ధతి రామచంద్రమూర్తి వంటి పెద్దలకు తగదు.
అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనే వాదనను రఘురామక్రిష్ణరాజు ప్రధానంగా నెత్తికెత్తుకున్నారు.అందుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కనుక ఇంటర్వ్యూలో మూడు రాజధానులను సమర్థించడమే లక్ష్యం అనుకున్నారో.. లేదా, కేఆర్ మూడు రాజధానులతో మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరుగుతుందని మనసా వాచా నమ్ముతున్నారో అర్థం కాని రీతిలో ఆ ఇంటర్వ్యూ సాగింది. ఆయన అలా నమ్మితే దానిని కూడా సమర్థించవచ్చు. కానీ ప్రశ్నల్లోని వాదన కూడా పలచబడిపోయింది. అనంతపురం నుంచి విశాఖకు ఆరుగంటల్లో వెళ్లిపోయే రోడ్డు వేస్తుంది ఈ ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పని సంగతులకు కేఆర్ వకాలతు పుచ్చుకుని ప్రశ్నించారు. అనంతపురం నుంచి కర్నూలు– నెల్లూరు– అని ఒకసారి, అనంతపురం నుంచి కర్నూలు- ప్రకాశం మీదుగా అని మరోసారి.. ఎలాగైనా సరే.. ఆరుగంటల్లో విశాఖకు చేర్చేస్తాం అని ఆయన హామీ ఇచ్చేశారు. రోడ్ల మీద ప్రయాణం గురించే ఊహించారో లేదా.. ఎలివేటెడ్ మార్గాలేమైనా మదిలో అనుకున్నారో తెలియదు. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైపర్‌లూప్ ట్రైన్ పేరిట ఒక విఫల ప్రయోగం మీద చాలా కసరత్తు చేశారు. అలాంటివి కేఆర్ మదిలో ఉన్నాయో తెలియదు. అలాంటి ఆరుగంటల్లో విశాఖ చేర్చే ప్రశ్నలు అడిగారు. అనంతపురానికి దూరం గణించిన ఆయన కుప్పం ను ఎందుకు వదిలేశారో తెలియదు.
మూడు రాజధానులతో చాలా మంచి జరుగుతుంది- అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగొద్దా తరహాలో ప్రశ్నించడం చూస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ వాదనను తన భుజస్కంధాల మీద మోయడానికే ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది. సీనియర్ జర్నలిస్టుగా కే రామచంద్రమూర్తి గురించి కొంత తెలిసిన వారు మాత్రం.. ఇలాంటి ఇంటర్వ్యూ చూసి నివ్వెరపోయారంటే అతిశయోక్తి కాదు.