ABN-ఆంధ్రజ్యోతి సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ మరో సంచలనానికి తెరలేపారు. వీకెండ్ కామెంట్- కొత్త పలుకులో ఆర్కే చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలనే షాక్ గురి చేశాయి. ఈ వీకెండ్ కామెంట్లో 124ఎ సెక్షన్‌ని అడ్డుపెట్టుకుని వేధింపు, రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిడంతో పాటు జగన్ జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటనే చర్చకు తెర లేపారు. తమిళనాడు తరహాలో రాజకీయం నడుస్తుందేమోనని అంచనా వేశారు. వైఎస్ జగన్ జైలుకి వెళ్తే వైఎస్ భారతిని సీఎం చేయాలని జగన్ భావిస్తుండవచ్చని, అయితే ధిల్లీ పెద్దల ఆలోచన వేరుగా ఉందని, వైఎస్ షర్మిలను సీఎం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆలోచనలు ఒకలా ఉండగా ధిల్లీ పెద్దల ఆలోచనలు వేరుగా ఉన్నాయని చెప్పారు. రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో కచ్చితంగా చెప్పడం ఎంత అనుభవం ఉన్నవారికైనా సాధ్యం కాదు. అయితే అంచనా వేయవచ్చు. కాని ఇక్కడ ఆర్కే చేసిన తన వీకెండ్ కామెంట్ అంచనా ప్రకారం రాసిందా లేక ధిల్లీ నుంచి తనకు ఉన్న విశ్వసనీయ వ్యక్తుల ద్వారా ఏమైనా లీకులు అందాయా అనే చర్చ కూడా నడుస్తోంది. అదే సందర్భంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఓ కామెంట్ చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావుడి చేసి నవ్వుల పాలయ్యారని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ వీకెండ్ కామెంట్‌లో చేసిన కొన్ని అంశాలను పరిశీలిస్తే కొన్ని హెచ్చరికలు, కొన్ని అంచనాలు ఉన్నాయని చెప్పవచ్చు.
జగన్ బెయిల్ రద్దుపై రఘురామరాజు ప్రభావం..
ఈ వీకెండ్ కామెంట్‌లో చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు అంశంపై రఘురామకృష్ణరాజు అరెస్టు, ఆయనపై వేధింపుల వ్యవహారం ప్రభావం చూపుతుంది. జగన్మోహన్‌రెడ్డి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నందున ఆయనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తెలియడంతో పాటు ఆయనను ఆ కారణంతోనే కొట్టించారనే అభిప్రాయాన్ని పలువురు ఎంపీలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. రఘురామరాజుకు మరో ఆయుధం దొరికినట్టైంది. జగన్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో రఘురామరాజు తనపై దాడి అంశాన్ని ప్రస్తావించవచ్చు. వాస్తవానికి రఘురామరాజు దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో ఆయన విమర్శలు మొదలు పెట్టిన విషయం వాస్తవం కాదా. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక కొందరు అధికారులపై వేధింపులకు సంబంధించిన సమాచారంతో న్యాయవాదులు కూడా సిద్ధంగానే ఉన్నారు. అదే సమయంలో ఏబీఎన్ –TV5లపై 124ఏ ప్రకారం దేశద్రోహం కేసు విచారణ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మీడియాను అణచివేసే ఆలోచనలున్న వారికి ఎదురు దెబ్బ. ప్రస్తుతానికి ఈ కేసు ఇంకా కొట్టేయకపోయినా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు గమనించవచ్చు. సెక్షన్ 124–ఏను వివిధ ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయన్న అభిప్రాయం అందరిలో ఉన్న సమయంలో జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం మరో అడుగు ముందుకేసి ఈ రాజద్రోహం కేసుల నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఉంటుందని చెప్పడం అంటే మీడియా సంస్థలను, జర్నలిస్టులను లొంగదీసుకోవాలనుకునే ప్రభుత్వాలకు ముకుతాడు వేసినట్టయింది. ఇందిరా గాంధీ తరువాత దేశంలో, ఏపీ, తెలంగాణలో వ్యక్తి ఆరాధన ఛాయలు కనిపిస్తున్నాయి. బీజేపీని మోదీ ప్రాంతీయ పార్టీగా మార్చేసి అధికారాన్ని కేంద్రీకృతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. మెజార్టీ ఉందనే అభిప్రాయం ఉన్నంత మాత్రాన అబద్దం నిజం కాదు. అయితే తాము ఏం చేసినా నడుస్తుందని కేసీఆర్, జగన్‌రెడ్డి భావించి ప్రశ్నించే వారిని, విమర్శించే వారిని పగబడుతున్నారు. ఈ విషయంలో జగన్‌రెడ్డికి వేరెవరూ సాటి రారు.
Must Read ;- RRR లీగల్ వార్.. టీవీ9,సాక్షి టీవీ ప్రతినిధులకు నోటీసులు
‘మాపై పెట్టిన కేసులను వదలబోం’..
స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో ఆంధ్రా ప్రాంతంలో అప్పట్లో బలంగా ఉన్న వామపక్షాల వారిపై మలబార్ పోలీసుల చిత్రహింసలతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీ పోలీసులు వేధింపులను పోల్చవచ్చు. అయితే ఇక్కడ మరో విషయం. సీఐడీ నమోదు చేసిన కేసులతో సీఎం జగన్మోహన్‌రెడ్డికి సంబంధం ఏంటని చెబుతున్నారు. అయితే ‘మాపై పెట్టిన కేసులను వదలబోం. మాపై తప్పుడు కేసు పెట్టిన ప్రతి అధికారిని వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తూ మేము కూడా కేసులు పెడతాం. న్యాయస్థానం ముందు నిందితులుగా నిలబెడతాం. చట్టంలో కల్పించిన వెసులుబాటును నేను ఉపయోగించుకోబోతున్నాను. పై నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పి ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెట్టి వేధించే అధికారులకు ఈ చర్య ఒక గుణపాఠం’ కావాలి. దీంతో అయినా అమాయకులపై కేసులు పెట్టి వేధించే పనులకు ముగింపు వస్తుందని భావిస్తున్నాం. ఇక దేశద్రోహం కేసుకు సంబంధించి సుప్రీం తీర్పులు దేశ వ్యాప్తంగా ప్రముఖంగా ప్రచురితమయ్యాయి ఒక్క నీలి మీడియాలో తప్ప. పైగా వారు ఇతర మీడియాను ‘ఎల్లో’ అనడం దెయ్యాలు వేదాలు వల్లించడమే. ప్రస్తుత పరిస్థితుల్లో ధిల్లీ పెద్దలు అవకాశం కోసం చూస్తున్నారు. గతంలో చేసిన పనుల కారణంగా తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు జాతీయస్థాయిలో పలుచన అయ్యారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదిరించడం కోసం ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశవ్యాప్తంగా తిరిగిన కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దీంతో నవ్వులపాలయ్యారు. ఇక జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న కేసుల కారణంగా జాతీయస్థాయి నాయకుల్లో ఇప్పటికే సదభిప్రాయం లేకపోగా ఆ మధ్య జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని మోదీని విమర్శిస్తే, దాన్ని తప్పుబట్టడానికి ప్రయత్నించి జగన్మోహన్‌రెడ్డి నవ్వుల పాలయ్యారు. అయితే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారంలో సీబీఐ అధికారులు తటస్థ వైఖరి తీసుకోవడానికి వేరే కారణం ఉండి ఉండవచ్చు.
జగన్‌రెడ్డి భారతిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనుకుంటున్నా..
కాని ఒకప్పుడు సోనియాగాంధీని విమర్శించే సాహసం చేయని జగన్‌రెడ్డి, ఇప్పుడు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను విమర్శించే సాహసం చేయలేకపోతున్నారంటే కారణం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ధిల్లీ పెద్దలు అవకాశం కోసం చూస్తుండడంతో పాటు ఇంటాబయట జగన్మోహన్ రెడ్డికి శత్రువులు పెరిగారు. ఒక వేళ బెయిల్ రద్దయినా, జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడినా తమిళనాడు తరహా ప్రయోగాన్ని అమలు చేయాలన్న ఆలోచనతో కమలనాథులు ఉన్నారని చెబుతున్నారు. తన భార్య వైఎస్ భారతిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని జగన్ రెడ్డి తన భావిస్తున్నా ధిల్లీ పెద్దల ఆలోచన మరో రకంగా ఉందంటున్నారు. అన్నాడీఎంకేను శశికళ చేతుల్లోంచి తప్పించినట్లుగా ఇక్కడ కూడా వ్యూహాలు అమలు చేయవచ్చు. మొత్తం మీద ఇవ్వాళ కాకున్నా రేపైనా పరిస్థితులు వికటించవచ్చు.గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా ఎదురు తిరుగుతుంది. అలాంటిది వేధింపులు, నియంతృత్వ పోకడలు పెరిగితే వేరే కుంపట్లకు అంకురార్పణ జరుగుతుంది. రఘురామకృష్ణరాజును ఇప్పుడు హింసించామని సంతోషించడంతో పాటు రేపు మరొకరి వంతు కావచ్చు. అయితే ఇవాళ కాకపోయినా రేపైనా అందరి లెక్కలూ సెటిలవుతాయి. జగన్ అండ్ కో ఇందుకు సిద్ధంగా ఉంటుందా?’ అని ఏబీఎన్ ఆర్కే తన వ్యాఖ్యల్లో పేర్కొన్నారు.
Also Read ;- అధికారంతో చెలరేగుతున్నారు.. నీలి మూక అని ఏకేసిన ఆర్కే