దక్షిణాదికి చెందిన నాజూకు భామలతో శ్రుతిహాసన్ ఒకరు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. హిందీలోను ఈ అందగత్తెకి మంచి గుర్తింపు ఉంది. ఆ మధ్య కెరియర్ ను కాస్త నిర్లక్ష్యం చేసిన ఈ సుందరి ఇటీవల ఆ పొరపాటును సరిదిద్దుకునే పనిలో పడింది. అందులో భాగంగానే ఈ అమ్మాయి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. అంతేకాదు వెబ్ సిరీస్ లు చేయడానికి కూడా ఉత్సాహాన్ని చూపుతోంది. ఆల్రెడీ ఒక హిందీ వెబ్ సిరీస్ లో ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగులో ఆమె బిజీగా ఉంది.
అమెజాన్ ప్రైమ్ సిరీస్ గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ను సిద్ధార్థ్ మల్హోత్రా నిర్మిస్తుండగా, ముకుల్ అభయంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆసక్తికరమైన .. అనూహ్యమైన మలుపులతో సాగే ఈ వెబ్ సిరీస్ .. రవి సుబ్రమణియన్ రాసిన ఒక నవల ఆధారంగా నిర్మితమవుతోంది. ఈ నవలల్లోని ప్రధానమైన పాత్రలను శ్రుతి హాసన్ – అర్జన్ బజ్వా పోషిస్తున్నారు. ఇక మిథున్ చక్రవర్తో ఒక కీలమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఆయన వెబ్ సిరీస్ లో చేయడం ఇదే మొదటిసారి. ఆయన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు.
శ్రుతి హాసన్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్, ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రసారం కానుంది. మరిన్ని వెబ్ సిరీస్ ల కోసం ఆమెను అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. వెబ్ సిరీస్ లా? అని తేలికగా తీసిపారేయకుండా కథలను వినడంలో ఆమె బిజీగానే ఉందట. తెలుగులో ఆమె చేసిన ‘క్రాక్’ సూపర్ హిట్ కావడంతో, ఏకంగా ‘సలార్‘ సినిమాలో ప్రభాస్ జోడీగా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో వెండితెరపై కూడా ఈ నాజూకు సుందరి తన జోరును కొనసాగిస్తుందేమో చూడాలి.
Must Read ;- ప్రభాస్ సలార్ జోరు మామూలుగా లేదు











