భూఆక్రమణ ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ మార్పు,కొత్త పార్టీ పెట్టే అంశంపై మళ్లీ చర్చ మొదలైంది.మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యాక ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు.దీంతో ఆ పార్టీకి చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు ముఖ్యంగా గంగుల కమలాకర్ లాంటివారు ప్రతివిమర్శలకు దిగారు. తాజాగా ఈటల కుమారుడిపై కూడా భూ ఆక్రమణ ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదులూ వచ్చాయి.ఇక తన కార్యాచరణను కొవిడ్ ప్రభావం తగ్గాక ప్రకటిస్తానని ఈటల ఇటీవల వ్యాఖ్యానించారు.అయితే తాజాగా ఈటల రాజేందర్ తన ట్విట్టర్ ప్రొఫైల్‌గా కొత్త ఫొటోలను పెట్టడంతో ఈ చర్చమొదలైంది.ఈ ఫొటోపై పలు కోణాల్లో చర్చ నడుస్తోంది.ఈటల కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధపడ్డారని ఓవైపు,బీజేపీలో చేరతారని మరోవైపు చర్చ నడుస్తోంది.మీడియాల్లోనూ ఇందుకు సంబంధించి పలు కథనాలు వస్తున్నాయి.
ఆచితూచి వ్యవహరిస్తూ..
కాగా ప్రస్తుతం ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగానే ఉన్నారు.సాంకేతికంగా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని చెప్పవచ్చు.అందులో భాగంగానే కేవలం మెడలో నీలి కండువాతో ఈటల రాజేందర్ ఫొటో,పక్కనే ప్రొఫెసర్ జయశంకర్ ఫొటో,డా.బీఆర్ అంబేద్కర్,జ్యోతిబా పూలెల ఫొటోలు ఓవైపు తెలంగాణ తల్లి,తెలంగాణ అమరవీరుల స్తూపం ఫొటో ఓవైపు,బిగించిన పిడికిలితో కూడిన తెలంగాణ మ్యాప్ కూడా ఫొటోలో ఉంది.పసుపు, కాషాయం రంగులతో తెలంగాణ మ్యాప్ ఉండడం చర్చకు కారణమైంది.అయితే క్రమశిక్షణ చర్యలకు అవకాశం లేకుండా ఎక్కడా వేరే నినాదం కాని,వ్యాఖ్యకాని లేదు.ఈ నేపథ్యంలో పార్టీయే బయటకు పంపించేంతవరకు వేచి చూస్తున్నారని చెప్పవచ్చు.
Also Read ;- ఈటలకు బీజేపీ గాలం : రహస్య చర్చలు, మంతనాలు
కొత్త పార్టీనా లేక బీజేపీలోకా..
కాగా ఈటల రాజేందర్ తెలంగాణలో కొత్త పార్టీ పెడతారనే చర్చ జోరుగా నడుస్తోంది.బీజేపీలోకి లేదా కాంగ్రెస్‌లోకి వెళ్తే పెద్దగా ప్రయోజనం ఉండదని,ఈటల రాజేందర్ లాంటివారు బీజేపీ లాంటి పార్టీలో సెట్ కారనే ప్రచారం కూడా నడుస్తోంది. ప్రతి అంశానికి హైకమాండ్ అనుమతి లేదా పార్టీలో సీనియర్ల అనుమతి అవసరం ఉంటుందనే అభిప్రాయం ఇందుకు కారణంగా చెప్పవచ్చు.తెలంగాణలో ఉన్న ముఖ్యమైన రాజకీయ నేతల్లో ఒకరిగా ఉన్న ఈటల..ఇతర పార్టీల్లో చేరి ఇతర పార్టీల నేతల్లో ఒకరిగా ఎంతవరకు అడ్జెస్ట్ అవుతారనే చర్చకూడా నడుస్తోంది.ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ వైపు అడుగులు వేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.అదే సమయంలో ఈటలతో బీజేపీ నాయకులు సమావేశం కావడంతో ఈటల బీజేపీలో చేరతారనే చర్చ నడుస్తోంది.పార్టీ జాతీయ స్థాయి నేత భూపేందర్ యాదవ్‌తో పాటు కేంద్ర మంత్రి,పార్టీ ఎంపీ కిషన్‌రెడ్డి కూడా ఈటలతో దాదాపు గంటరన్నరపాటు సమావేశమైనట్టు వార్తలు వస్తున్నాయి.మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యాక ఈటలను పలు పార్టీలకు చెందిన నాయకులు,తటస్థంగా ఉన్న నాయకులు కలిసిన విషయం తెలిసిందే.ఇటీవలే డీకే అరుణ,జితేందర్‌రెడ్డిలతో కూడ ఈటల భేటీ అయ్యారు.మొత్తం మీద ఈటల ప్రొఫైల్ ఫొటో మరోసారి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది.
Must Read ;- మరో కబ్జా ఉచ్చులో ఈటల ఫ్యామిలీ.. ఈ సారి ఆయన కుమారుడిపై











