పేకాట రాయుళ్లు పోలీస్ ని చూస్తే భయంతో పరుగులు తీయడం సాధారణంగా జరుగుతుంది. కానీ, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వారికి ఆ భయం లేదు, పోలీసుల అండ ఉండటంతో హాయిగా… కాయ్ రాజా కాయ్ అంటూ ఆడుకుంటున్నారు. తమిళనాడు నుంచి కూడా నెల్లూరు వచ్చి లక్షల్లో పందేలు కాస్తున్నారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వరకూ వెళ్ళింది.
పేకాటకు ఫుల్ సపోర్టు…!
నెల్లూరు జిల్లాలోని కొడవలూరు ప్రాంతంలో జూదం బాగా జరగడానికి స్థానిక పోలీసులు సహకరిస్తున్నారు. దీనిపై వరుస ఫిర్యాదులు రావడంతో ఎస్పీ సిబ్బందిని హెచ్చరించి, పనితీరు మార్చుకోవాలని ఆదేశించారు. లక్షల్లో అందుతున్న నెల మామూళ్ళ మత్తులో ఉన్న అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో ఎస్పీ తానే స్వయంగా రంగంలోకి దిగారు. పోలీసు శిక్షణ కేంద్రం డీఎస్పీ ఆధ్వర్యంలో పేకాట డెన్ లపై దాడులు నిర్వహించారు. స్థానిక పోలీసులకు సమాచారం లేకుండా పక్కా ప్రణాళికతో తనిఖీలు నిర్వహించగా, విషయం తెరపైకి వచ్చింది. 23 మంది జూదరులతో పాటు నిర్వహకుడిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో అతనిని విచారించగా అసలు విషయం బహిర్గతమైంది. ఎవరెవరికి ఎంత ముట్టజెబుతున్నారు.. ప్రతినెల ఎంత? ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో తెలుసుకున్నారు. స్థానిక ఎస్సైతో పాటు స్పెషల్‌బ్రాంచి ఎస్సై ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కోవూరు సీఐ వాహన డ్రైవరుతో మరో కానిస్టేబుల్‌కు నెలనెలా మామూళ్లు ఇస్తున్నట్లు చెప్పడంతో నలుగురిపై చర్యలుతీసుకున్నారు.
ఇంటెలిజెన్స్ వ్యవస్థలోనూ అవినీతి..?
చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నిఘాఉంచి ఉన్నతాధికారులకు నివేదించడానికి ఎస్పీకి … ఎస్.బి. వ్యవస్థ ఉంటుంది. ప్రతి పోలీసు స్టేషన్, సర్కిల్, డివిజన్ పరిధిలో పార్టీలు ఉంటాయి. ఐడీ పార్టీ, స్పెషల్ బ్రాంచి విభాగాలు కూడా ఉంటాయి. వీళ్ళందరూ
చీకటి కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరు నిర్వహిస్తున్నారు? తదితర వివరాలన్నీ ఎస్పీకి అందజేయాలి. కానీ, కొడవలూరు పేకాట డెన్ లకి నిఘా వ్యవస్థలోని కొందరు అండగా నిలిచారు. దీంతో ఓ ఎస్.బి. ఎస్సైని సస్పెండ్ చేయడం జిల్లా పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.
సీఐ వి.ఆర్ కు, ఎస్. ఐ లు ఇంటికి…!
పేకాట రాయుళ్లకు అండగా నిలిచిన నలుగురు పోలీసులను గురువారం సస్పెండ్ చేస్తూ సౌత్ కోస్టల్ డీఐజీ త్రివిక్రమ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కొడవలూరు ఎస్సై షేక్ జిలానీ, స్పెషల్ బ్రాంచి ఎస్సై పి.వెంకట సాయి, కోవూరు పీఎస్ కానిస్టేబుల్ ఎ.శ్రీనివాసులు, ఏఆర్ పీసీ యు.శ్రీకాంత్ ఉన్నారు. వీరితో పాటు కోవూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.రామారావును వీఆర్‌కు పంపిస్తూ ఆదేశించారు
ఏపీ, తమిళనాడులోని ప్రభుత్వాలు ఆన్లైన్ పేకాటపై నిషేధం విధించడంతో జిల్లాలో పేకాట డెన్ లు పెరిగిపోయాయి. ఇప్పుడు కొడవలూరులో చర్యలు తీసుకున్నా.. చెన్నై-ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి డెన్ లు చాలానే ఉన్నాయని.., మరి వాటిని కూడా అధికారులు మూయిస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Must Read ;- మోడీజీ ఏపీలో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి!