జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం నమోదు చేసింది. అధికార పీఠం టీఆర్ఎస్ కైవసం చేసుకున్నా.. బీజేపీ మాత్రం టీఆర్ఎస్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. రానున్న కాలంలో టీఆర్ఎస్ ను బీజేపీ మరింత ఇరుకునపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇక బీజేపీపై ఆర్ఎస్‌ఎస్ ప్రభావం, వీహెచ్‌పీ జోక్యం, కొన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ కుట్రలు చేస్తుందని విమర్శలు ఉన్నా.. ఓటర్లు మాత్రం బీజేపీని ఆదరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఇప్పటికే ఉంది. దాదాపు 20 రాష్ట్రాల్లో బీజేపీ, మిత్ర పక్షాలే పాలన చేస్తున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ విషయానికి వస్తే..ఆ పార్టీ విస్తరణలో చాలా సంచలనాలు నమోదయ్యాయి.
తొలిసారి ఓటమి..
1967 ఎన్నికల్లో తొలిసారిగా హైదరాబాద్‌లోని గగన్‌మహల్, యాకూత్‌పురా, చార్మినార్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేఎస్ (బీజేపీ పాత విభాగం) ఓటమిని చవి చూసింది. అప్పటికే బద్దం బాల్‌రెడ్డి, ఆలె నరేంద్ర, బండారు దత్తాత్రేయ తదితరులు నగరంలో RSS కార్యకర్తలుగా పని చేస్తున్నారు. 1972లోనూ యాకుత్‌పురా నుంచి సల్లావుద్దీన్ ఓవైసీపై పోటీ చేసి బీజేఎస్ అభ్యర్థి ఆర్. అంజయ్య ఓటమి చెందినా..పార్టీలో ఉత్సాహం పెంపొందించారు. 1978 ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి నగరంలో పలు స్థానాల్లో పోటీ చేసినా సికింద్రాబాద్‌లో మాత్రమే గెలిచింది. ఆ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి ఆలె నరేందర్ పోటీ చేసి ఓడారు. జనసంఘ్ నుంచి బీజేపీగా అవతరించాక బీజేపీ నగర అధ్యక్షురాలిగా మాజీ మేయర్ రాణి కుముదిని, రెండేళ్ల తరువాత బద్దం బాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అప్పుడే బీజేపీకి కార్యాలయం ఏర్పాటైంది.
1983 సాధారణ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాల్లో పోటీ చేయగా, మూడు స్థానాల్లో గెలుపొందారు. మలక్‌పేట్‌లో పోటీ చేసిన ఇంద్రసేనారెడ్డి గెలుపుతో బీజేపీ నగరంలో తొలి బోణీ కొట్టింది. మరుసటి ఏడాది హిమాయత్‌నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పర్వతనేని ఉపేంద్రపై బీజేపీ నాయకుడు ఆలె నరేంద్ర విజయం సాధించాడు. తరువాత బీజేపీ ఎత్తు పల్లాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1985 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి కట్టాయి. అయితే అప్పట్లో కార్వాన్‌లో బద్దం బాల్ రెడ్డి, హిమాయత్ నగర్ నుంచి ఆలె నరేంద్ర ఓడిపోగా, మలక్‌పేట నుంచి నాదెండ్ల భాస్కరరావుపై ఇంద్రసేనారెడ్డి రికార్డు స్థాయిలో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లోనే బండారు దత్తాత్రేయ పోటీ చేసి ఓటమి చవి చూశారు. అప్పట్లో జరిగిన హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 12చోట్ల బీజేపీ గెలిచింది. తరువాత జరిగిన 1989 ఎన్నికల్లో కార్వాన్ నుంచి బద్దం బాలరెడ్డి గెలిచారు.
Also Read ;- కూకట్‌పల్లిలో టీఆర్ఎస్‌కే పట్టంకట్టిన ఆంధ్రోళ్లు!
సింగిల్‌గా పోటీ చేసినా..
తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది. ఉమ్మడి ఏపీలో 1994లో 279 స్థానాల్లో పోటి చేసిన బీజేపీ.. మూడు చోట్ల మాత్రమే గెలిచింది. ఇక 1999లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ రెండు సీట్లు గెలవగా, 2004లోనూ పొత్తు కొనసాగింది. అప్పుడు హిమాయత్ నగర్ నుంచి కిషన్‌రెడ్డి ఒక్కరే గెలిచారు. అనంతరం 2009లో బీజేపీ ఉమ్మడి ఏపీలో 271 చోట్ల పోటీ చేసినా రెండుచోట్ల మాత్రమే గెలిచింది.
2014లో రికార్డు..
2014లో బీజేపీ , టీడీపీ మళ్లీ పొత్తు పెట్టుకున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్‌లో ఐదుచోట్ల గెలిచింది. ఆ పార్టీ చరిత్రలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గెలుపొందింది ఈ ఎన్నికల్లోనే. ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, గోషామహల్, ఉప్పల్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే 2018 ఎన్నికల్లో పార్టీ మళ్లీ ఓటమి పాలైంది. గోషమహల్‌లో మాత్రమే రాజాసింగ్ గెలుపొందగా, కిషన్‌రెడ్డి అంబర్‌పేట నుంచి ఓడిపోయారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి గెలుపొందారు. తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లాంటి కీలక స్థానాల్లోనూ విజయం సాధించింది. తాజాగా జీహెచ్ఎంసీలో 49 స్థానాలు గెలిచింది. మొత్తం మీద నాలుగు దశాబ్దాల తరువాత జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ ఇన్ని స్థానాలు గెలిచిందని చెప్పవచ్చు.
Must Read ;- నాగార్జునసాగర్‌పై బీజేపీ కన్ను.. పట్టున్న నాయకుడిని పట్టే ఆలోచన