హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు, కెరియర్ తొలినాళ్లలో యాక్షన్ తో కూడిన సినిమాలను ఎక్కువగా చేశాడు. ఆ తరువాత కాలంలో రొమాన్స్ కి అధిక ప్రాధాన్యతనిస్తూ ఇద్దరు హీరోయిన్లతో శోభన్ బాబు తరహా పాత్రల్లో మెప్పించాడు. ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఆయనకి వరుస పరాజయాలు ఎదురవుతూ వచ్చాయి. యువతరం కథానాయకుల నుంచి కూడా గట్టి పోటీ ఎదురుకావడంతో, ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఒకానొక దశలో కెరియర్ పరంగా ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయన విలన్ పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నారు.
విలన్ గా టర్న్ తీసుకున్న తరువాత ఆయన చేసిన ‘లెజెండ్’ భారీ విజయాన్ని చవిచూసింది. ఆ సినిమాలో విలన్ గా జగపతిబాబు విజృంభించాడు. అంతే అప్పటి నుంచి నేటివరకూ కెరియర్ పరంగా ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే, మరోవైపున బలమైన ప్రతినాయక పాత్రలను చేయడం మొదలుపెట్టాడు. అటు స్టైలీష్ లుక్ తో కూడిన విలన్ పాత్రలోను .. ఇటు మాస్ యాంగిల్ ను చూపించే విలన్ గాను ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘నాన్నకు ప్రేమతో‘లో చేసిన ‘కృష్ణమూర్తి’ పాత్రను .. ‘అరవింద సమేత‘లో చేసిన ‘బసిరెడ్డి’ పాత్రను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
Must Read ;- బాలయ్య సినిమాకి రెడీ అవుతోన్న బాలిరెడ్డి
ఇటీవల వచ్చిన ‘మిస్ ఇండియా‘ సినిమాలో కాఫీ కంపెనీ అధినేతగా కైలాశ్ శివకుమార్ పాత్రలోను జగపతిబాబు తన మార్కును చూపించాడు. ఇక ప్రస్తుతం తమిళంలో ఆయన ‘లాబం’ అనే సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, పారిశ్రామిక వేత్తగా జగపతిబాబు నటిస్తున్నాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ .. గెడ్డం .. మీసకట్టుతో ఈ పాత్రలో ఆయన కొత్తగా కనిపించనున్నాడు. ఆయన స్టైలీష్ లుక్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
స్వార్థపరుడైన ఒక పారిశ్రామిక వేత్తగా .. పవర్ఫుల్ విలన్ పాత్రను ఆయన ఈ సినిమాలో పోషిస్తున్నాడు. తాను విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ .. తనకి గల రాజకీయపరమైన అండదండలతో అక్రమాలకు పాల్పడుతుంటాడు. భూమిని నమ్ముకున్న వ్యవసాయదారులకు అన్యాయం చేస్తుంటాడు. అందుకు అడ్డుపడినవారిని అణగదొక్కడానికి అడ్డదారులు తొక్కుతుంటాడు. ఈ పాత్రలో విలన్ గా జగపతిబాబు విశ్వరూపాన్ని చూడవచ్చని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో వచ్చే ఈ సినిమా, విలన్ గా జగపతిబాబు కెరియర్ గ్రాఫ్ ను మరింత వేగంగా ముందుకు తీసుకు వెళుతుందనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.
Also Read ;- ‘మిస్ ఇండియా’ కీర్తి అమ్మడు.. రేపటి నుంచి టీ అమ్ముడే?