రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే నటించనున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’. బాలివుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. ఇక రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పుడు ఈ సినిమాలోని తారాగణం పై ఒక వివాదం చెలరేగింది. సినిమాలోని తన పాత్ర గురించి సైఫ్ అలీఖాన్ ముంబై మిర్రర్ పత్రికతో కొన్ని విషయాలను పంచుకున్నాడు.
‘ఆదిపురుష్’ సినిమాలో రావణుడిలోని ఒక గొప్ప మానవీయ కోణాన్ని చూపిస్తున్నట్లు తెలిపాడు. అనగా, రావణుడు ఓ రాక్షసుడిగా కాకుండా మనిషిగా చిత్రీకరించడమే కాకుండా, సీతమ్మను ఎత్తుకుపోవడాన్ని కూడా అతని కోణంలో కరెక్ట్ అనే విధంగా చూపించనున్నట్లు సైఫ్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. హిందుత్వవాదులు, రామ భక్తులు సినిమాపై తీవ్ర విమర్శలు చేశారు. సినిమాను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. మేము పూజించే రాముడిని తక్కువగా చూపిస్తే ఎట్టిపరిస్థితిల్లోని ఒప్పుకోమని తెలిపారు.
ఈ హెచ్చరికలపై సైఫ్ అలీఖాన్ స్పందించాడు. నేను ప్రతీ ఒక్కరిని క్షమించమని కోరుతున్నాను. రావణుడిపై చేసిన నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. రాముడిని నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తాను. ఆయన నాకు ధర్మానికి మరియు వీరత్వానికి చిహ్నంగా ఉంటారు అని సైఫ్ వివాదానికి ముగింపు పలికాడు. మరి ఆయన వ్యాఖ్యలతో హిందూ వాదులు శాంతిస్తారో లేదో చూడాలి. ఇక సినిమాలో సీత పాత్రలో కృతి సనోన్ నటిస్తోంది. ఈ భారీ పాన్ ఇండియా సినిమాను 3డి టెక్నాలజీలో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Must Read ;- ప్రభాస్ వెర్సెస్ పవన్.. బాక్సాఫీస్ ను షేక్ చేసేది ఎవరు..?