కరోనా విస్తృతి నేపథ్యంలో దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు అన్ని రకాల వార్షిక పరీక్షలను రద్దు చేశాయి. ఏపీ మాత్రం అందుకు మినహాయింపు. అయితే పొంచి ఉన్న ముప్పును పదే పదే గుర్తు చేస్తూ… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని వాదిస్తున్నారు. సీఎం జగన్ కు లేఖల మీద లేఖలు రాస్తున్నారు. అయితే కక్షపూరితంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారు.. లోకేశ్ మాటను పెడచెవిన పెడుతూనే వస్తోంది. ఫలితంగా మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జగన్ సర్కారు అక్షింతలు వేయించుకుంది. అలా కాకుండా విపక్షానికి చెందిన నేత అయినప్పటికీ లోకేశ్ డిమాండ్ చేస్తున్నట్లుగా పరీక్షలను రద్దు చేసి ఉంటే… సుప్రీం అక్షింతలు తప్పేవి కదా అన్న వాదనలు ఇప్పుడు కాస్తంత గట్టిగానే వినిపిస్తున్నాయి.
సీబీఎస్ఈ పరీక్షలు రద్దే కదా
కరోనా మహమ్మారి తొలి వేవ్ నేపథ్యంలో గతేడాది వార్షిక పరీక్షలన్నీ రద్దైపోయాయి. ఇక తొలి వేవ్ కంటే మరింత విజృంభించిన సెకండ్ వేవ్ ఏ రీతిన మృత్యు ఘంటికలు మోగిస్తుందో ప్రత్యక్షంగానే చూస్తున్నాం కదా. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లొద్దంటూ దేశంలోని ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు వార్షిక పరీక్షలను రద్దు చేశాయి. కేంద్ర విద్యా సంస్థలు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలు కూడా తమ వార్షిక పరీక్షలను రద్దు చేశాయి. ఈ క్రమంలో పరీక్షలు జరిగితే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే బాధ్యత ఎవరు వహిస్తారు? అన్ని రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం… కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలను స్పందనను కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు దాదాపుగా అన్ని రాష్ట్రాలు స్పందించాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తాము పరీక్షలను రద్దు చేసినట్లుగా ప్రకటించాయి.
లోకేశ్ అడిగారనే రద్దు చేయలేదా?
అయితే ఈ విషయంలో జగన్ సర్కారు మాత్రం ఇంకా తన మొండి వైఖరిని వీడలేదు. విపక్షానికి చెందిన లోకేశ్ అడుగుతున్నారు కదా… ఇప్పుడు పరీక్షలను రద్దు చేస్తే మైలేజీ మొత్తం ఆయన ఖాతాలోకి వెళ్లిపోతుంది కదా అన్న భావనతో జగన్ సర్కారు పరీక్షల రద్దుకు ససేమిరా అంటోంది. బయటకు ఈ మాట చెప్పకున్నా.. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చేస్తున్న వరుస వ్యా్‌ఖ్యలు వింటే… ఇదే భావనతో జగన్ సర్కారు ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో మంగళవారం ఈ పిటిషన్ పై మరోమారు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. తమ నోటీసులకు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు? అసలు అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ఏపీ సర్కారును నిలదీసింది. ఈ విషయంలో ఏపీ నుంచి ఇప్పటిదాకా స్పష్టత లేదని కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వేళ పరీక్షల నిర్వహణమే జగన్ సర్కారు కట్టుబడి ఉంటే… పరీక్షల్లో భాగంగా ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నా.. ఏపీ మాత్రం ఎందుకు నిర్ణయం తీసుకోలేదని కూడా నిలదీసింది. అసలు ఈ విషయంలో ఏపీని ఎందుకు మినహాయించాలో కూడా చెప్పాలంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
మొండిపట్టుతోనే సుప్రీం అక్షింతలు
మొత్తంగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నా… ఇప్పటిదాకా మొండిగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారు తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం సరైనదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా పరీక్షల రద్దుకు సంబంధించి అంత మొండిపట్టు ఎందుకు పట్టారన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. విద్యార్థులపై ఇతరుల కంటే తమకే ఎక్కువ బాధ్యత ఉందన్నట్లుగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారు… లోకేశ్ డిమాండ్ చేయకముందే పరీక్షలను రద్దు చేసి ఉంటే…ఆ క్రెడిట్ ఏదో జగన్ కే దక్కేది కదా అన్న మాటలూ ఒకింత గట్టిగానే వినిపిస్తున్నాయి. వెరసి లోకేశ్ అడిగారు కదా అన్న భావనతో పరీక్షల రద్దుపై ఇప్పటిదాకా నోరు తెరవని జగన్ సర్కారుకు సుప్రీం అక్షింతలు పడ్డాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. లోకేశ్ చెప్పినట్టుగా విని ఉంటే… ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్న హితోక్కులూ వైరల్ అవుతున్నాయి.
Must Read ;- లోకేష్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని.. పరీక్షలు రద్దు చేయని జగన్