సినిమా ట్రైలర్ కావచ్చు, పాటలు కావచ్చు ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ సినిమా మీద ఒకవిధమైన హైప్ క్రియేట్ అయ్యింది. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన కిరణ్ అబ్బవరం హీరోగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఈరోజో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కళ్యాణ మండపం నిర్వహణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ ఎస్.ఆర్. కళ్యాణమండపం నిర్వహించడానికి ధర్మ (సాయికుమార్) సతమతమవుతుంటారు. దీని నిర్వహణ అతనికి కష్టసాధ్యంగా ఉంటుంది. ఎవరైనా బుక్ చేసుకుని చివరి నిమిషంలో రద్దు చేసుకోవడం లాంటి ఘటనలతో దాని నిర్వహణ భారంగా మారుతుంది. చివరకు మద్యానికి బానిసవుతాడు. అతని కుమారుడు కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) నగరంలో ఇంజినీరింగ్ చదువుతుంటాడు. అదే కాలేజీలో చదివే తన ఊరి అమ్మాయి సిందు (ప్రియాంక జవాల్కర్) తో ప్రేమలో పడతాడు.
ఒకవిధంగా చెప్పాలంటే ఇది వన్ సైడ్ లవ్. ఆమె నుంచి అతనికి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాదు. మరో పక్క అతని తండ్రి ధర్మ ఆర్థికస్థితిగతులు దారుణంగా ఉంటాయి. అప్పులు ఎక్కువవుతాయి. తాకట్టులో ఉన్న కళ్యాణమండపం కోల్పోయే దశలో కళ్యాణ్ వస్తాడు. ఆ కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యత తీసుకుంటాడు. ఓ పక్క అతని ప్రేమ, ఇంకో పక్క కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలు.. ఈ రెండు అంశాలతో దర్శకుడు ఈ కథను నడిపించాడు. సాధారణంగా ఇలాంటి కథలన్నీ చివరికి సుఖాంతమవుతూనే ఉంటాయి. కాకపోతే ఎలా సుఖాంతమవుతుందన్న అంశమే ఆసక్తి కలిగిస్తుంది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. నటుడిగా తనలోని సత్తా ఏమిటో మొదటి సినిమాలోనే చూపించాడు. ఈ సినిమా మీద హైప్ రావడానికి అది కూడా ఒక కారణం. కళ్యాణమండపం పేరుతోనే సినిమా రూపొందింది కాబట్టి కథను కూడా దాని చుట్టూనే తిప్పాల్సి ఉంటుంది. సినిమా థియేటర్లు, కళ్యాణమండపాల నిర్వహణ భారంగా మారడం నేడు జరుగుతోంది. షాపింగ్ కాంప్లెక్సులుగా అవి మారుతున్నాయి. పాత సినిమా థియేటర్ మల్టీప్లెక్స్ లుగా మారితేనే జనం వస్తున్నారు.
కళ్యాణ మండపాలకు కూడా ఆదరణ రావాలంటే ఏవో మార్పులు చేయాల్సిందే. ఈ విషయంలో హీరో ఏంచేశాడు అన్నది ఇందులోని మరో ఆసక్తికర అంశం. సినిమా యూత్ ఫుల్ గా ఉండాలి కాబట్టి దర్శకుడు ఆ చర్యలన్నీ తీసుకున్నాడు. కాకపోతే ఎమోషన్స్ పండించడంలో విఫలమయ్యాడు. కథలో చాలా లాజిక్ లు మిస్సయ్యాయి. ఉదాహరణకు కళ్యాణ మండపంలో ఒక్క పెళ్లి జరిగితే దాని దశ తిరిగిపోతుందా? పాత కథలనే తిప్పి చెప్పడం ఎందుకో అర్థం కాదు. కొత్త ఆలోచిస్తే సినిమా కూడా కొత్తగానే ఉంటుంది. కొన్ని సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి.
ఈ సినిమా మీద అంచనాలతోనే జనం థియేటర్ లకు వెళ్లారు. వారి ఊహకు తగ్గట్టుగా సినిమా లేదు. తండ్రీకొడుకుల మధ్య వైరం, హీరోయిన్ విలన్ కూతురు కావడం.. లాంటివన్నీ పాత చింతకాయ పచ్చడి సన్నివేశాలు. మంచి ఈజ్ ఉన్న నటుడిగా కిరణ్ అబ్బవరం మరోసారి నిరూపించుకున్నాడు. సరదా సన్నివేశాల్లోనూ, డ్యాన్స్, ఫైట్స్ విషయంలోనూ చలాకీతనాన్ని ప్రదర్శించాడు. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ లో ప్రత్యేకత ఏమీ లేదు. డ్యాన్స్ బాగా చేసింది. సాయికుమార్, తులసి పాత్రలు మెప్పిస్తాయి.
విలన్ గా శ్రీకాంత్ అయ్యంగార్ తనదైన ప్రత్యేకతను మాత్రం ఈ సినిమాలో మిస్సయ్యారు. సంగీతం, సాహిత్యం.. రెండూ ఆకట్టుకున్నాయి. రెండు పాటలకు మంచి క్రేజ్ వచ్చింది. వాటి చిత్రీకరణ కూడా బాగుంది. నవీన్ పోలిశెట్టి మాదిరిగానే కిరణ్ అబ్బవరం కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రాబోయే రోజుల్లో అతనికి భవిష్యత్తుకు ఈ సినిమాతో పాటు అతని రాబోయే సినిమాలు కూడా దోహదపడతాయని భావించవచ్చు.
నటీనటులు: కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్, సాయికుమార్, తులసి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అనిల్ జీలా, అరుణ్ కుమార్, కశ్యప్ శ్రీనివాస్, ఎ. రాజశేఖర్ తదితరులు
సాంకేతికవర్గం: సంగీతం – చేతన్ భరద్వాజ, డీవోపీ – విశ్వాస్ డేనియల్
నిర్మాతలు: రాజు, ప్రమోద్
దర్శకుడు: శ్రీధర్ గాదే
విడుదల: 06-08-2021
ఒక్క మాటలో: పండని సెంటిమెంట్
రేటింగ్: 2.5 / 5











