సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వీసీ సజ్జన్నార్ నిజంగానే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐసీఎస్‌గా విధుల్లో చేరిన నాటి నుంచి రెండు నెలల క్రితం దాకా లా అండ్ ఆర్డర్ విభాగంలోనే పనిచేసిన సజ్జన్నార్ పలు కీలక కేసులను చేధించడంలో సత్తా చాటారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే.. ఏదో సినిమాల్లోనే చూసి ఉంటాం గానీ.. మహిళలపై అకృత్యాలకు పాల్పడిన నిందితులను ఏరివేయడంలో తనదైన శైలి స్పీడును చూపిన సజ్జన్నార్ నిజ జీవితంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్టేనని జనం భావిస్తారు. అలాంటి సజ్జన్నార్.. ఇప్పుడు లాఠీ చేతబట్టే అవసరం లేని ఆర్టీసీ ఎండీ పదవిలో ఒదిగిపోయారు. ఆర్టీసీనీ ప్రక్షాళన చేసే కార్యక్రమానికి నడుం బిగించారు. లాఠీ పట్టి నేరస్తులను అదిలించిన నాడు ఏ చిక్కూ ఎదుర్కొనని సజ్జన్నార్.. ఇప్పుడు లాఠీ పట్టనవసరం లేని పదవిలో కూర్చున్న సందర్భంలో మాత్రం ఓ పెద్ద చిక్కునే ఎదుర్కొంటున్నారు. ఈ తరహా పరిస్థితిని ఫేస్ చేస్తున్న సజ్జన్నార్ వైపు జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రెండు ఎన్ కౌంటర్లు..
హైదరాబాద్ శివారులో రెండేళ్ల క్రితం నాడు నగరానికి చెందిన వెటర్నరీ డాక్టర్‌ను కొందరు దుండగులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై ఆమెను కాల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న సంగతీ తెలిసిందే. నాడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జన్నారే ఉన్నారు. దిశ హత్యాచారంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం కాగా.. నిందితుల కోసం వేట ప్రారంభించిన సజ్జన్నార్ గంటల వ్యవధిలోనే వారిని పట్టేశారు. అరెస్ట్ చేశాక.. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లగా నిందితులు తప్పించుకునే యత్నం చేశాకని, ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులూ చనిపోయారని సజ్జన్నార్ నాడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న సమయంలోనూ ఓ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసిన ముగ్గురు నిందితులను కూడా సజ్జన్నార్ ఎన్ కౌంటర్ చేసిన వైనాన్ని కూడా జనం గుర్తు చేసుకున్నారు. సజ్జన్నార్‌ను వేనోళ్ల కొనియాడుతూ రేపిస్ట్‌లకు సింహస్వప్పంలా సజ్జన్నార్‌ను అభివర్ణించారు. ఈ రెండు ఘటనలతో సజ్జన్నార్‌పై ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అనే ముద్ర పడిపోయింది. తాజాగా ఆయనను సైబరాబాద్ కమిషనర్ పదవి నుంచి తప్పించిన తెలంగాణ సర్కారు ఆర్టీసీ ఎండీగా నియమించింది. అయితే దిశ ఘటనపై విచారణ కోసమంటూ ప్రభుత్వం నియమించిన కమిటీ తన విచారణను చాలా కాలం క్రితమే ప్రారంభించినా.. ఇటీవలే దానిని ముమ్మరం చేసింది.
రోజుల తరబడి విచారణకు..
దిశ కమిషన్ విచారణకు ఇప్పటికే రోజుల తరబడి హాజరైన సజ్జన్నార్‌ను కమిటీ సభ్యులు ఇప్పటిదాకా పెద్దగా విచారించలేదనే చెప్పాలి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాలుపంచుకున్న ఇతర పోలీసు అధికారులను ప్రశ్నిస్తూ వస్తున్న కమిషన్.. సజ్జన్నార్‌ను మళ్లీ రమ్మంటూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం కూడా విచారణకు హాజరైన సజ్జన్నార్‌ను ఎట్టకేలకు కమిషన్ సభ్యులు విచారించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు సజ్జన్నార్‌ను పలు ప్రశ్నలు అడిగారట. జనం సజ్జన్నార్‌ను ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా చెప్పుకుంటున్నారు. మీరు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఒప్పుకుంటారా? అని కమిషన్ సభ్యులు ప్రశ్నించగా.. తాను ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ కాదన్న సజ్జన్నార్ బదులిచ్చారట. ఆ వెంటనే ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటి? అని కమిషన్ సభ్యులు అడగ్గా.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటో నాకు తెలియదన్న సజ్జన్నార్.. ఆ పదమే తనకు తెలియదన్నట్లుగా సమాధానం ఇచ్చారట. మొత్తంగా కమిషన్ విచారణ సందర్భంగా సజ్జన్నార్‌కు ఎదరైన ప్రశ్నలు, వాటికి సజ్జన్నార్ తనదైన రీతిలో ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
Must Read ;- తస్మాత్!.. చుట్టూ ఇలాంటి జాదూగాళ్లే!











