పై ఫొటోలో పోలీసు అధికారుల ముందు నేలపై మోకాళ్ల మీద కూర్చున్న యువకుడు మామూలోడు కాదు. మహా జాదూగాడు. వయసు 19 ఏళ్లు మాత్రమే. తన వికృత చేష్టలకు తగ్గట్టే అతడి పేరు కూడా మహావీర్. జాదూగాడంటే.. ఏ చదవూ సంధ్యా లేకుండా జులాయిగా తిరిగే వాడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. ఇతగాడు దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలుగా పేరొందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. వాటిలోనూ నెంబర్ వన్‌గా నిలిచిన ఐఐటీ ఖరగ్‌పూర్ లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఐఐటీలో సీటు సంపాదించడమే గగనం అనుకుంటే.. ఐఐటీల్లోనే అగ్రగామి అయిన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇతడు సీటు సంసాదించాడు. ఇంజినీరింగ్ లో ఇతడు ఎంచుకున్న సబ్జెక్ట్ కూడా వినూత్నమైనదే. అందరూ కంప్యూటర్ సైన్స్ ఎంచుకుంటే.. ఇతడు మాత్రం మెటలర్జీ అండ్ మెటీరియల్స్‌ను ఎంచుకున్నారు. ఈ ఎంపికతో అందరికంటే తాను ప్రత్యేకమని చాటుకున్న మహావీర్.. వికృతంలోనూ తనను మించిన వాడు లేడని కూడా నిరూపించుకున్నాడు. అయితే ఢిల్లీ పోలీసులు సాగించిన వేటకు ఇతడు వెంటనే దొరికిపోయాడు కాబట్టి సరిపోయింది గానీ.. లేదంటే ఇతడు ఇంకెన్నీ దారుణాలకు పాల్పడేవాడోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇతడి కథ చదివాక., మన చుట్టూ ఇలాంటి జాదూగాళ్లు చాలా మందే ఉన్నారని, వారి బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మరింత మేర జాగ్రత్త తీసుకోక తప్పదని చెప్పాలి.
ఈ జాదూగాడు ఎం చేశాడంటే..?
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మహావీర్.. పలు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన మైన్ విద్యార్థినీలు, లేడీ టీచర్లకు చెందిన మార్ఫింగ్ నగ్న, అర్థ నగ్న చిత్రాలు, వీడియోలను నెట్ పెట్టేశాడు. ఆయా స్కూళ్లతో ఇతగాడికి పరిచయం లేకున్నా.. ఇంజినీరింగ్ విద్యార్థి కదా.. తనకు తెలిసిన టెక్నిక్‌లతో ఆయా స్కూళ్ల ఆన్ లైన్ క్లాసుల్లోకి చొరబడిపోయారు. ఆయా వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్ పర్మిషన్ లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఇతగాడు.. ఆ గ్రూప్స్‌లోని విద్యార్థినీలతో మాట కలిపాడు. అసభ్యంగా మాట్లాడటంతో పాటుగా వారి స్నేహితులు, లేడీ టీచర్ల నెంబర్లు ఇవ్వాలని బెదిరించాడట. ఇతగాడి బెదిరింపులకు భయపడ్డ కొందరు మైనర్ బాలికలు వారి మిత్రులతో పాటు కొందరు టీచర్ల నెంబర్లను కూడా అతడికి ఇచ్చారట. ఇదే అదనుగా అతడు రెచ్చిపోయాడు. విద్యార్థినీలతో పాటు టీచర్లకు కూడా కాల్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడట. అంతేకాకుండా వాట్సాప్ గ్రూపుల్లో వారి ఫొటోలను లాగేసి.. వాటితో వారి అర్థ నగ్న, నగ్న చిత్రాలను క్రియేట్ చేసేవాడు. అంతేకాకుండా అవే ఫొటోలతో ఏకంగా అశ్లీల వీడియోలను కూడా క్రియేట్ చేశాడు. ఈ చిత్రాలు, ఫొటోలను అతడు నెట్ లో పెట్టేసి రాక్షసానందం పొందాడు. బాధితులకు కాల్స్ చేసే సమయంలో తనను గుర్తు పట్టకుండా ఉండేలా నకిలీ ఫోన్ నెంబర్లు, యూజర్ ఐడీలు, ఫేక్ ఐడెంటిటీలను ఇతగాడు వినియోగించాడు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఇతడి చేతిలో 50 మందికిపైగా బాధితులు నరక యాతన అనుభవించారట.
ఇలా పట్టుబడ్డాడు
దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ పాఠశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. కష్టమైనా గానీ ఇతగాడిని త్వరగానే పట్టేశారు. అయితే ఇతగాడిని పట్టుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారట. ఎందుకంటే.. ఇతడి బాధితులను విచారించిన సందర్భంగా ఒక్కో బాధితురాలితో అతడు ఒక్కో నెంబరుతో మాట్లాడాడట. ఈ నెంబర్లలో కొన్ని దేశీయ నెంబర్లు కాగా.. మరికొన్ని ఏకంగా అంతర్జాతీయ నెంబర్లు ఉన్నాయట. వాట్సాప్ గ్రూపుల్లో ఒక్కో చాట్ కు అతడు ఒక్కో నెంబరుతో ఎంటర్ అయ్యాడట. ఎన్నెన్ని నెంబర్లు వాడినా.. వాట్సాప్ గ్రూపుల లింకులతో నేరస్తులను ఇట్టే పట్టేయడం ఇప్పటి మన పోలీసులు సత్తా చాటుతున్నారు కదా. ఈ క్రమంలోనే బాధితుల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలుఅప్‌లోడ్ అయిన ల్యాప్ టాప్, ఇంటర్నెట్ కనెక్టివిటీల ఆధారంగా మహావీర్ ను పోలీసులు ఇట్టే పట్టేశారు. అతడి నుంచి ఓ మొబైల్ ఫోన్, ఓ ల్యాప్ టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంటే.. ఇతగాడు చేసిన ఇన్ని వికృత చేష్టలకు ఈ రెండే ఆధారమన్న మాట. అయినా ఇతగాడు ఈ వికృత చేష్టలకు పాల్పడటానికి గల కారణాలేమిటని ఆరా తీస్తే.. మూడేళ్ల క్రితం ఓ మైనర్ బాలికతో ఇంటర్నెట్ లో పరిచయం కాగా.. ఆ పరిచయాన్ని ఇతగాడు ప్రేమగా భావించి ఆ మైకంలో పడిపోయాడట. చివరకు ఆ బాలిక ఇతడిని ఛీకొట్టేసరికి.. ఇలా ఇతర మైనర్ బాలికలతో పాటు వారి టీచర్లను కూడా వేధించడం మొదలెట్టాటడ. ఏదైతేనేం ఢిల్లీ స్కూల్ ఫిర్యాదుతో ఇతగాడి ఆటకు అడ్డుకట్ట పడింది. ఈ కథంతా విన్నాక.. కరోనా నేపథ్యంలో దాదాపుగా అన్ని స్కూళ్లూ ఆన్ లైన్ క్లాసులను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఇటు తల్లిదండ్రులతో పాటు అటు పాఠశాలల యాజమాన్యాలు కూడా ఆన్‌లైన్ క్లాసులను మరింత పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పాలి. మన పిల్లల భద్రత కోసం మనం మరింత జాగకూరతతో వ్యవహరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.
Must Read ;- అత్యాచారాంధ్రగా ఏపీ.. గుంటూరులో మరో దారుణం











