Raja Raja Chora Movie Review :
శ్రీవిష్ణు హీరోగా రూపొందిన ‘రాజరాజచోర’ సినిమా ఈరోజు విడుదలైంది. ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహించారు. కామెడీ ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
భాస్కర్(శ్రీవిష్ణు) ఓ చిరుద్యోగి. జిరాక్స్ షాపులో పనివాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం అని చెప్పి సంజన (మేఘా ఆకాష్)తో ప్రేమాయణం సాగిస్తాడు. అబ్దద్దాలు ఆడి విద్య (సునయన)ను పెళ్లి చేసుకుంటాడు. అతనికి ఓ కొడుకు పుడతాడు. మోసం చేసి తనను పెళ్లి చేసుకున్నందుకు విద్య తనను లాయర్ చదివించమని పట్టుబడుతుంది. చివరికి దొంగతనాలకు కూడా దిగాల్సి వస్తుంది. మనసు దోచుకోడానికి ప్రయత్నించిన ఈ చోరుడి భాగోతం సంజనకు తెలుస్తుంది.
ఓ పక్క భార్య, ఇంకో పక్క ప్రేయసి.. ఈ చోరుడు చివరికి ఏంచేశాడు? ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు అన్నదే ప్రధాన కథ. చిన్న చిన్న దొంగతనాలు కాకుండా ఒకేసారి పెద్ద దొంగతనం చేసి ప్రేయసితో పారిపోవాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో సీఐ విలియం రెడ్డి (రవిబాబు) కంట్లో పడతాడు. విలియం రెడ్డి కూడా తక్కువ తినలేదు. అతను కూడా ఓ తప్పు చేసి తప్పించుకు తిరిగే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ కథను పూర్తి వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నాన్ని దర్శకుడు చేశాడు.
ఎలా తీశారు? ఎలా చేశారు?
మంచి వాడిని కూడా పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తాయో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. మనిషి డబ్బు కోసం ఎలాంటి గడ్డి తింటారో దర్శకుడు అంతర్గతం చెప్పే ప్రయత్నం చేశాడు. మనిషి ఎమోషన్స్ ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం జరిగింది. డ్రామా బాగా పండించగలిగాడు దర్శకుడు. కథనం విషయంలోనూ తప్పటడుగులు వేయలేదు. పాత్రల స్వభావం అర్థం కావడానికి కాస్త సమయం పడుతుంది. ట్విస్టులు బాగున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లో కథనంలో వేగం తగ్గింది.
పాత్రలను మలిచిన విధానం బాగుంది. మనిషిలో ఇంకో మనిషి ఎలా ఉంటాడో ఈ పాత్రల్ని చూస్తే అర్థమవుతుంది. అందరూ మంచి వారు అని పొరపడకూడదని ఈ సినిమా ద్వారా అర్థమవుతుంది. డైలాగులు ఆకట్టుకున్నాయి. శ్రీవిష్ణు తన పాత్రకు న్యాయం చేశాడు. దొంగగా, సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా రెండు కోణాల్లో చక్కగా నటించాడు. మేఘా ఆకాష్, సునయన తమ పాత్రలకు న్యాయం చేశారు. నటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. క్లైమాక్స్ లో అజయ్ ఘోష్ కూడా ఆకట్టుకున్నాడు.
పోలీసు అధికారి పాత్రలో రవిబాబు తన దైన శైలిలో నటించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, తనికెళ్ల భరణి పోషించిన పాత్రలు కూడా బాగున్నాయి. కామెడీ టైమింగ్ బాగా కుదిరింది. దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆయన దర్శకత్వ ప్రతిభ కన్నా రచనా ప్రతిభ గొప్పగా ఉంది. రీరికార్డింగ్ కూడా ఈ సినిమాకి ప్రాణం పోసింది. సినిమా అనేది టీమ్ వర్క్ అనేది ఈ సినిమా మరో సారి నిరూపించింది. ఈ సినిమా విజయంలో భాగం నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా ప్రతి ఒక్కరికీ దక్కుతుంది. కంటెంట్ బాగుంటే కటౌట్ తో పనిలేదని ఈ సినిమా నిరూపిస్తుంది.
నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాష్, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, అజయ్ ఘోష్ తదితరులు.
సాంకేతిక వర్గం: సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: వేద రమణ్ శంకరన్, ఎడిటింగ్ విప్లవ్
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం: హసిత్ గోలి
విడుదల: 19-08-2021
ఒక్కమాటలో: మనసు దోచేస్తాడు
రేటింగ్: 3/5