అన్నదాతలు దీనారావాలు చేయడంలేదు. ప్రభుత్వం తప్పు చేస్తున్నదని చాలా గట్టిగానే తమ గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం చెవుల తుప్పు వదిలేలా నినదిస్తున్నారు. మడమ తిప్పకుండా పోరాడుతున్నారు. ప్రభుత్వం వారిని బుజ్జగించడానికి అయిదారు రోజులుగా నానా పాట్లు పడుతోంది. నాలుగో విడత చర్చలు కూడా విఫలం అయ్యాయి. ప్రభుత్వం మాటకారితనానికి రైతులు లొంగలేదు. నలభై మంది రైతు సంఘాల ప్రతినిధులతో, ఇద్దరు కేంద్రమంత్రులు మరికొందరు కలిసి జరిపిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. సమావేశం జరిగిన హాలు నుంచి రైతులు నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చారు. చర్చలు- నిర్ణయాలుగా మారకపోతే గనుక వాటిని బహిష్కరిస్తాం అని రైతులు ప్రకటించారు.
రైతుల పట్టుదలకు నమోనమః
మొన్నటి రోజున సుమారు 8 గంటలపాటు రైతులతో ప్రభుత్వ ప్రతినిధుల మంత్రుల చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రైతులు కనీసం టీ కాదు కదా, ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన భోజనాలు కూడా చేయలేదు. చర్చల్లో పాల్గొన్న నలభై మందికి తోటి రైతులు భోజనాలు పంపారు. సమావేశస్థలం వద్దనే.. వారు తెప్పించుకున్న భోజనాలను తిని.. ఆ తర్వాత మళ్లీ చర్చల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం సిగ్గు పడాల్సిన విషయం ఇది. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ప్రభుత్వం పెట్టే అన్నం వద్దనుకున్నారు.
సాధారణంగా ఉద్యమాలు చేసేసంఘాల ప్రతినిధుల్ని చర్చలకు పిలవడం అంటే.. ఆ ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలతో భేటీ కాబోతున్న సందర్భాన్ని తమ వ్యక్తిగత మైలేజీలకు వాడుకోవడం, తమకు తాము కితాబుగా భావించుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి. కానీ.. రైతు నాయకులు ఆ బాపతు కింద కనిపించడం లేదు. చాలా దృఢచిత్తంతోనే తమ నిరసనలను, డిమాండ్లను వినిపిస్తున్నారు.
రైతుల నిరసనల ఎఫెక్ట్ ప్రభుత్వం మీద పనిచేస్తోంది. స్వయంగా నరేంద్రమోడీ కూడా జోక్యం చేసుకుని.. శనివారం ఉదయం కీలక మంత్రులతో ఈ విషయంలో ఓ భేటీ నిర్వహించారు. రైతులతో అయిదో విడత చర్చలు జరుగుతున్నాయి. అన్నదాతలకు కూడా అన్నం పెట్టలేని ప్రభుత్వంగా అపకీర్తి మూటగట్టుకోకుండా, ఈసారి మోడీ సర్కారు ముందు జాగ్రత్తతో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం షెడ్యూలు చేసింది.
Must Read ;- మోడీకి లిట్మస్ టెస్ట్ పెట్టేసిన అన్నదాతల ఆక్రోశం..
తీరుమారనంత వరకు ఇంతే..
రైతుల పట్టుదల ఎంత గట్టిగా ఉన్నదంటే.. ప్రభుత్వం తీరు మారనంత వరకు ఈ పీటముడి సడలేలా లేదు. రైతులతో, కేంద్రమంత్రులు సాగిస్తున్న చర్చల గురించిన వార్తలు చదివినప్పుడు చాలా చిత్రంగా అనిపిస్తుంది. వీరి లోని భయాలు, డిమాండ్ల విషయంలో ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వ పెద్దలు పూర్తి సానుకూలంగా ఒక్క జవాబు కూడా ఇవ్వలేదు. ‘ఆ విషయం ఆలోచిద్దాం’.. ‘తప్పకుండా పరిష్కరిస్తాం’.. ‘ఈ విషయం చర్చిద్దాం..’ వంటి డొంకతిరుగుడు సమాధానాలు మాత్రమే వారినుంచి వస్తున్నాయి. ఇలాంటి నయవంచనతో కూడిన, నిర్ణయాత్మకంగా లేని చర్చలు ఏ పరిష్కారాలకు దారితీస్తాయి. మంత్రులు తీరు మార్చుకోకుండా.. ప్రభుత్వం మెట్టు దిగకుండా రైతుల ఆందోళనలు పరిష్కారం దిశగా నడిచే అవకాశమే కనిపించడం లేదు.
ప్రభుత్వానికి అహంకారం తగదు..
ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తుంటుంది? రైతుల మేలుకోసమే మేం కొత్త చట్టాలు తెచ్చాం అని ప్రభుత్వం అంటుంది. ఈ చట్టాలు మాకు చేటు చేస్తాయి. ఇవి వద్దు అని రైతులు అంటున్నారు. మరి ఎవరి బాగుకోసం పనిచేస్తున్నట్లుగా ప్రభుత్వం బిల్డప్పులు ఇస్తున్నదో.. ఆ రైతులే తిరస్కరిస్తున్నప్పుడు.. ప్రభుత్వం ఇంత మంకుపట్టు ఎందుకు పడుతున్నట్లు? ఎవరిని ఉద్ధరించడానికి? ప్రభుత్వాలకు అహంకారం పనికి రాదు. ఆ విషయాన్ని పాలకులు గుర్తించినప్పుడు తప్ప.. ఈ సమస్యకు పరిష్కారం లేదు.
Also Read ;- పంటల బీమాపై దిగొచ్చిన ప్రభుత్వం.. టీడీపీ వ్యూహంతో వైసీపీ కలవరం











