దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న పశ్చిమబెంగాల్, తమిళనాడులో ఎంఐఎం బరిలోకి దిగింది. పశ్చిమబెంగాల్‌లో ప్రధాన పార్టీలతో పొత్తు కోసం యత్నించినా కుదరకపోవడంతో కొన్ని వర్గాలతో కలసి ఎంఐఎం పోటీ చేస్తోంది. ఇక తమిళనాడులో టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర ఖజగం (ఏఎంఎంకే)తో ఎంఐఎం పార్టీ జట్టు కట్టింది. వనియంబడి, కృష్ణగిరి, సంకరపురం నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది.
తాజాగా మూడు స్థానాల్లో పోటీ..
2016లో వనియంబడిలో ఎంఐఎం ఒంటరిగా పోటీ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షకీల్ అహ్మద్ పోటీ చేయగా 10వేల ఓట్లు వచ్చాయి. తాజాగా మూడు స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ పొత్తుపై ఒవైసీ స్పందిస్తూ.. తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందని, ఏఎంఎంకే, ఏఐఎంఐఎం కూటమి ఆ లోటును భర్తీ చేస్తుందని వ్యాఖ్యానించారు. దళితులు, ఓబీసీలు, మైనార్టీలకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తొలుత డీఎంకేతో పొత్తు కోసం యత్నించిన ఎంఐఎంకి అక్కడ ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, మనితనేయ మక్కళ్ కచ్చి వంటి పార్టీలు ఇందుకు విముఖత చూపాయి. దీంతో డీఎంకేతో పొత్తు కుదరలేదని తెలుస్తోంది.
రాజకీయాల నుంచి శశికళ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. దీంతో మజ్లిస్ వ్యూహం మార్చింది. తమిళనాడు నుంచి 20 స్థానాలు, పుదుచ్చేరిలో 2 సీట్లకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ దినకరన్ పార్టీతో చర్చలు జరిపింది. మూడు స్థానాల్లో పోటీ చేసే అంశంపై క్లారిటీ వచ్చింది. దీంతోపాటు తమిళనాడులో వెల్లూరు, రాణిపేట్, తిరుపత్తూర్, కృష్ణగిరి, త్రిచీ, తిరునెల్వేలి జిల్లాల్లోని దాదాపు 30 నియోజకవర్గాల్లో మైనార్టీలు క్రియాశీలక ప్రభావం చూపనున్నారు. ఇది తమకు కలసివస్తుందని ఏఎంఎంకే చెబుతోంది. ఇవి కాకుండా చెన్నైనగరంలోని నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలోని దాదాపు 45నియోజకవర్గాల్లో మైనార్టీల ఓట్లను బీజేపీ కూటమి నుంచి, డీఎంకే కూటమి నుంచి చీల్చుతుందని అంచనా వేస్తున్నారు. కమలహాసన్‌కు చెందిన ఎంఎన్ఎం పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది.
Must Read ;- బెంగాల్‌లో రోజుకోతీరున రాజకీయం.. జైశ్రీరాం vs హరే కృష్ణ, ఓవైసీ Vs ఉర్దూ
తరువాతి టార్గెట్ యూపీ..
కాగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండానే ఎంఐఎం పార్టీ యూపీలోనూ అడుగుపెట్టనుంది. 1992తరువాత సాధారణ ఎన్నికల్లో డైరెక్ట్ గా పోటీచేసిన సందర్భాలు తక్కువే అని చెప్పవచ్చు. కొన్నిసార్లు సమాజ్ వాదీ పార్టీకి, మరికొన్ని సార్లు బీఎస్పీకి మద్దతు ప్రకటించింది. 2017లో ఆ పార్టీ 38చోట్ల పోటీ చేసింది. మొత్తం మీద 2.05లక్షల ఓట్లు వచ్చాయి. అయితే చాలాచోట్ల సమాజ్ వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఓట్లను చీల్చిందన్న అంచనాలున్నాయి. సంబల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ నుంచి జియవుర్ రహమాన్ పోటీ చేయగా 60వేల ఓట్లు సాధించారు. అయితే ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఇక్బాల్ మహ్మద్ 18వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, సీపీఐ, లోక్ దళ్, బహుజన్ ముక్తి పార్టీలతో పోల్చితే ఎంఐఎం ఎక్కువ ఓట్లు రాబట్టింది. ఎంఐఎం పోటీ చేసిన చోట్ల సమాజ్ వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు గెలిచిన సీట్ల కంటే.. బీజేపీ గెలిచిన సీట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం.
పొత్తుకు రెఢీ..
2022లో జరగనున్న ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీలోనే కీలకంగా ఉండి అఖిలేష్ యాదవ్‌తో విభేదాల కారణంగా బయటకు వచ్చిన శివపాల్ సింగ్ యాదవ్‌తో ఎంఐఎం ఇప్పటికే జట్టుకట్టనుంది. అందులో భాగంగా తొలిసారిగా పార్టీ విద్యార్థి విభాగాన్ని యూపీలో ఏర్పాటు చేసింది. ప్రతిష్టాత్మక అలహాబాద్ యూనివర్సిటీ(ఏయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎంఐఎం విద్యార్థి విభాగం బరిలో నిలబడనుంది. ఏయూ విద్యార్థి మొహ్మద్ ఆమిర్‌ను బరిలోకి దింపింది. ప్రయాగ్ రాజ్‌లో పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. గతంలో యూపీలో జరిగిన రెండు ఎన్నికల్లో ఇంటింటి ప్రచారాన్ని కూడా మొదలు పెట్టింది. ప్రగతి శీల్ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ శివపాల్ సింగ్ యాదవ్‌తో మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ భేటీ కావడం చర్చనీయాంశమైంది. దీంతోపాటు కర్ణాటకలో నైజాం పాలిత ప్రాంతాల్లోనూ పార్టీ విభాగాలను ఏర్పాటు చేయనుంది.
Also Read ;- హైదరాబాద్‌పై అసద్ ‘యూటీ’ స్కెచ్.. ఏ పార్టీకి ఉపయోగం











