కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి మంచి పేరు ఉంది. తన సినిమాల్లో ఎక్కడా అసభ్యత అనేది ఉండదనీ, అన్నివర్గాల ప్రేక్షకులు తమ ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంటాయని చెప్పిన కృష్ణారెడ్డి, అదేమాటపై నిలబడ్డాడు. కుటుంబ బంధాలకు .. అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ 40 సినిమాలను ఆయన తెరకెక్కించాడు. వీటిలో విజయవంతమైన వాటి సంఖ్యే చాలా ఎక్కువ. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో చేయడానికి ఎంతో ఆసక్తిని చూపేవారు. అలా ఆయన దర్శకత్వంలో చేసిన కథానాయికలకు మంచి పేరు వచ్చేది.

ఒక సాధారణ ప్రేక్షకుడికి కూడా తాను చెప్పదలచుకున్న కథ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలనే విషయంపై కృష్ణారెడ్డి చాలా కసరత్తు చేసేవారు. అలాగే తన సినిమాకి తనే స్క్రీన్ ప్లే వేసుకునేవారు. అంతేకాదు .. సంగీతం కూడా ఆయనే అందించేవారు. కృష్ణారెడ్డి సినిమాల్లోని పాటలన్నీ సూపర్ హిట్. అందువలన ఆయన రచయితగాను .. దర్శకుడిగానే కాదు, సంగీత దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అప్పట్లో కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్లాలనుకుంటే, థియేటర్స్ లో కృష్ణారెడ్డి సినిమా ఉందేమోనని చూసేవారంటే అభిమానుల నమ్మకాన్ని ఆయన ఎంతగా సంపాదించుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన, మళ్లీ రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. “కెరియర్ పరంగా వెనుదిరిగి చూసుకుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. నేనేనా ఇన్ని సినిమాలు చేసింది అనే ఆశ్చర్యం కలుగుతోంది. నా సినిమాలకి నేనే కథలు రాసుకున్నాను .. సంగీతం అందించాను .. రెండు సినిమాల్లో హీరోగా చేశాను .. ఒక పాట కూడా పాడాను .. ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాను .. ఇదంతా చూస్తుంటే భగవంతుడు నాకు ఎంతో అదృష్టాన్ని ఇచ్చాడనే అనిపిస్తుంది.
“నేను దర్శకత్వం వహించిన సినిమాలకి చాలా వరకూ అచ్చిరెడ్డిగారు నిర్మాతగా ఉన్నారు. ఎప్పుడూ కూడా మా మధ్య ఎలాంటి మనస్పర్థలు రాలేదు. మేము సమస్యలను ఎప్పుడూ పంచుకోలేదు .. సరదాలను మాత్రమే పంచుకున్నాం. ఇది నాది అని నేను అనుకోలేదు .. ఇది నాది అని ఆయనా ఎప్పుడూ అనుకోలేదు .. ఇది మనది అనే ఇద్దరం భావించేవాళ్లం. అందుకనే ఇంతకాలం .. ఇంత దూరం ప్రయాణం చేయగలిగాము .. అదే మా సక్సెస్ సీక్రెట్” అని కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.
Must Read ;- సోలోగా వచ్చినా మెగా మేనల్లుడు కలెక్షన్ల కుమ్ముడే











