తెలుగు దేశం పార్టీలో మొన్నామధ్య రేగిన అంసతృప్తి జ్వాల పూర్తిగా చల్లబడిపోయింది. పార్టీ అధిష్ఠానం తీరుపై తదనైన శైలి అసంతృప్తిని వ్యక్తం చేసిన సీనియర్ నేత, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎట్టకేలకు శాంతించారు. గురువారం నాడు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమరావతిలో జరిగిన ఈ భేటీలో తనకు ఎదురైన అనుభవాలను బుచ్చయ్య చెప్పగా.. సాంతం సావధానంగా విన్న చంద్రబాబు ఇకపై అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా చూస్తామంటూ హామీ ఇచ్చారు. వెరసి పార్టీలో రేగిన బుచ్చయ్య అంసతృప్తి జ్వాల పూర్తిగా చల్లారిపోయింది.
స్థానిక నేతలతోనే ఇబ్బంది
టీడీపీలో ఆది నుంచి కొనసాగుతున్న అతి కొద్ది మంది నేతల్లో గోరంట్ల ముఖ్యుడు. పార్టీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా.. పదవి దక్కినా, దక్కకపోయినా.. పార్టీని అంటిపెట్టుకుని కొనసాగుతున్న నేతల్లో గోరంట్ల ముందు వరుసలో ఉంటారు. 1982లో స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయనతో పాటు కలిసి నడిచిన వారిలో గోరంట్ల కూడా ఒకరు. నాటి నుంచి నేటి దాకా పార్టీలోనే కొనసాగుతూ వస్తున్న గోరంట్ల ఏనాడూ పదవి దక్కలేదన్న అసంతృప్తినే వ్యక్తం చేసి ఎరుగరు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తనకు రాజమహేంద్రవరం సిటీ స్థానాన్ని కేటాయించాలని బుచ్చయ్య కోరితే.. అధిష్ఠానం మాత్రం ఆయనకు రాజమహేంద్రవరం రూరల్ ను కేటాయించింది. తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా పట్టు కలిగిన గోరంట్ల రూరల్ స్థానంలోనూ సత్తా చాటి.. జగన్ వైపు వీచిన గాలికి ఎదురెళ్లి మరీ విజయం సాధించారు. అయితే ఇటీవలి కాలంలో సిటీ నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు బుచ్చయ్యను టార్గెట్ చేయగా.. ఆయన పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసే యత్నం చేశారు. అయితే కారణమేమిటో తెలియదు గానీ.. అధిష్ఠానం నుంచి ఆయన ఆశించిన మేర స్పందన రాలేదు.
పార్టీని బుచ్చయ్య వీడరుగా
ఈ క్రమంలో తనలోని అసంతృప్తిని తన సన్నిహితుల వద్దే వెళ్లగక్కిన బుచ్చయ్య.. పార్టీకి తాను రాజీనామా చేస్తానంటూ చెప్పారట. ఈ విషయం ఎలా లీక్ అయ్యిందో గానీ టీడీపీని తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. అయితే వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు.. బుచ్చయ్యతో మాట్లాడేందుకు ముగ్గురు కీలక నేతల బృందాన్ని రాజమహేంద్రవరం పంపారు. ఈ బృందం జరిపిన చర్చలతో మెత్తబడ్డ బుచ్చయ్య.. పార్టీని వీడనులే అంటూ శాంతించారు. ఈ క్రమంలో చంద్రబాబు నుంచి పిలుపును అందుకున్న గోరంట్ల గురువారం అమరావతికి వచ్చారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు. తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పారు. ఇక ముందు ఈ తరహా ఇబ్బందులు రాకుండా చూస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. వెరసి బుచ్చయ్యలోని అసంతృప్తి పూర్తిగా తొలగిపోయింది. అయితే పార్టీలో బుచ్చయ్య ప్రాముఖ్యత, పార్టీపై ఆయనకున్న అవినాభావ సంబంధాన్ని ప్రస్తావించిన ‘‘లియో న్యూస్’’ బుచ్చయ్య టీడీపీని వీడరంటూ ఓ కథనం రాసిన సంగతి తెలిసిందే. ఆ కథనం నిజమేనంటూ తాజా పరిణామాలు చెబుతున్నాయి.
Must Read ;- జగన్ ‘ఇన్‌సైడర్’ బొమ్మ అట్టర్ ప్లాఫ్