గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లోదాదాపు ఒక స్పష్టత వచ్చేసింది. అయినా కానీ గ్రేటర్ ఫలితాలు ఉత్కంఠను రేపుతునే ఉన్నాయి. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలే తమ ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం చతికిలపడింది. సింగిల్ డిజిట్ స్థానానికే అది పరిమితమైంది.
గతంలో కంటే టీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గినా కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దూసుకుపోతుంది. పాతబస్తీలో ఎంఐఎం తన పట్టును అలానే కంటిన్యూ చేసింది. బీజేపీ మాత్రం ఎవ్వరూ ఊహించనంతగా దూసుకుపోయింది. కొన్ని డివిజన్లలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య నెక్ టు నెక్ పోటీ నెలకొంది. ఒకానొక దశలో పాతబస్తీలోనూ ఎంఐఎం పార్టీకి బీజేపీ గట్టిపోటీనిచ్చిందనే చెప్పాలి. మొదటి నుంచి అక్కడ కూడా బీజేపీ లీడింగ్‌లో ఉంటూ వస్తోంది. గోషామహాల్ నియోజకవర్గంలోని డివిజన్‌లపై ఎక్కువగా బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఆ దిశగానే అక్కడ ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. పార్టీల మధ్య ఆధిక్యాల సంఖ్య ఎలా ఉన్నప్పటికినీ ఇప్పటి వరకు 113 స్థానాల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లను ఎన్నికల అధికారులు ప్రకటించారు.
44 టీఆర్ఎస్, బీజేపీ 28, ఎంఐఎం 39, కాంగ్రెస్ 2 డివిజన్లలో విజయం సాధించాయి. అలాగే ఆధిక్యంలో టీఆర్ఎస్ పార్టీ 29, బీజేపీ 11 డివిజన్‌లో ఉన్నాయి. అధికార పార్టీకి గతంలో కంటే సీట్లు తగ్గినా మేయర్ పీఠానికి కావలసిన పూర్తి మెజార్టీవైపుగా దూసుకుపోతోంది. అయితే ఇంకా 37 స్థానాలకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 101 సీట్లు కావాల్సి ఉంది.
గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 150 వార్డులు ఉన్నాయి. దీంతోపాటు నగర పరిధిలో మొత్తం 52 ఎక్స్అఫిషియో ఓట్లు ఉన్నాయి. ఈ రెండు కలిపితే 202. అంటే మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 101 ఉండాలి. ఎక్స్ అఫిషియో ఓట్లు ఎక్కువగా 32 టీఆర్ఎస్ ఖాతాలోనే ఉండడంతో ఆ పార్టీకి ఇది కలిసొచ్చే అంశంగా కనబడుతోంది. ఒకవేళ అటు ఇటుగా ఫలితాలు ఏమైనా తారుమారై మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉంటేగనుక మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ సపోర్టును టీఆర్ఎస్ తీసుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. అయితే మేయర్ ఎన్నికకు సంబంధించి షెడ్యుల్ వెలువడిన తరువాతనే మేయర్ ఎన్నిక జరుగుతోంది. పూర్తి ఫలితాలొస్తే గానీ దీనిపై ఒక స్పష్టత రాదు.
Must Read ;- గ్రేటర్‌లో ఎవరికి గెలుపు వరించేను?.. ఆందోళనలో పార్టీ నేతలు!