ప్రకాశం జిల్లా కొండపి వైసీపీ నేతల మధ్య వివాదాలు రచ్చకెక్కాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన డాక్టర్ వెంకయ్య నియోజకవర్గ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, మండలంలో వైసీపీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారు. దీంతో ఇప్పటికే వైసీపీ పెద్దలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి వెంకయ్య పని తీరుపై ఫిర్యాదు చేశారు. వైసీపీ అధిష్ఠానం కొండపి వైసీపీ నేతల పంచాయితీని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అప్పగించింది.
మేం ఎవరి మాటా వినం
కొండపి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో గ్రామాల్లో వైసీపీలో కొన్ని సామాజికవర్గాల నేతలు చెలరేగిపోతున్నారు. దీంతో కొండపి వైసీపీ ఇంఛార్జి వెంకయ్యకు వ్యతిరేకంగా అనేక మంది వైసీపీ నేతలు నిరసన గళం విప్పుతున్నారు. పార్టీలో మొదటి నుంచి జెండాలు మోసిన వారిని వదిలేసి కొత్తగా వచ్చిన వారికి వెంకయ్య పెద్ద పీట వేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. వెంకయ్యను ఇంఛార్జిగా కొనసాగిస్తే కొండపిలో వైసీపీకి భారీ నష్టం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రతి మండలం నుంచి ఏడుగురు వైసీపీ నేతలను తాడేపల్లి పిలిపించి పంచాయితీ చేశారు.
Also Read ;- కొవిడ్ నిబంధనలు అటకెక్కాయా.. మాస్క్‌ల నుంచి వైసీపీకి మినహాయింపా..?
ఏమిటి వెంకయ్యా? ఇలాగైతే ఎలా?
కొండపి వైసీపీ ఇంఛార్జి వెంకయ్యపై, మద్య నిషేధ పోరాట సమితి అధ్యక్షుడు లక్షణ్‌రెడ్డి నేరుగా ఆరోపణలు చేశారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొండపి వైసీపీ నేతల పంచాయితీ జరిగింది. అయితే వెంకయ్యను వెంటనే ఇంఛార్జి పదవి నుంచి తప్పించాలని లక్షణ్‌రెడ్డి నేరుగా ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంకయ్యను తప్పిస్తారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికి అందరూ కలసి పని చేసుకోవాలని, పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభాకర్‌రెడ్డి సూచించారు. అయితే ప్రతి గ్రామంలో వెంకయ్య వ్యతిరేక వర్గం ఏర్పడటంతో ఇక ఆయన్ని ఎక్కవ కాలం కొనసాగించే అవకాశాలు కష్టమేనని తెలుస్తోంది.
కొండపిపై జూపూడి కన్ను..
కొండపి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ప్రతి గ్రామంలో అనుకూల వర్గాలను ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. వెంకయ్యను ఇంఛార్జి పదవి నుంచి తప్పిస్తే జూపూడికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అందుకే వెంకయ్య వ్యతిరేక వర్గాలను జూపూడి ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా కొండపి వైసీపీ ఇంఛార్జి పదవి నుంచి వెంకయ్యను పీకడం గ్యారంటీగా కనిపిస్తోంది.
Must Read ;- పంటల బీమాపై దిగొచ్చిన ప్రభుత్వం.. టీడీపీ వ్యూహంతో వైసీపీ కలవరం