క్లుప్తంగా కథలోకి వెళ్తే ప్రకృతిని తనలో నింపేసుకున్న అరకులో తన తండ్రి ద్వారా సంక్రమించిన చిన్నపాటి ఫోటో స్టూడియో యజమాని హీరో మహేష్ (సత్యదేవ్ కంచరణ). తన తండ్రి మనోహర్ రావు (రాఘవన్)తో ఉంటూ, చిన్ననాటి నేస్తం స్వాతి (హరిచందన కొప్పిశెట్టి)ని ప్రేమిస్తూ పెళ్లి చేసుకోవాలని కళ్ళలో కలలు పోగేసి, పాస్పోర్ట్ ఫొటోస్, పెళ్లిళ్లకు పుట్టిన రోజులకు వీడియోస్ తీసుకుంటూ సాదా సీదాగా జీవితం గడుపుతూ ఉంటాడు. స్టూడియో కిందే విరిగిన ఎముకలకు కట్లు కట్టే వైద్యుడు బాబ్జి (నరేష్) మన మహేష్ కు శ్రేయోభిలాషి. అతని కూతురు మిథిల (కుశాలిని పులప). కొర్ర సుహాస్ (సుహాస్) బాబ్జి దగ్గర కట్లు కట్టే విద్యను నేర్చుకోవటానికి వచ్చి మిథిలతో ప్రేమలో పడతాడు.
టీ కప్పులో తుఫాను లాగా ఓ చిన్న అరటి పండు కథను ముందుకు నడిపిస్తుంది. నాంచారయ్య (TNR ) ఊరి పెద్ద గా వూళ్ళో ఓ ఇంటి పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. చంద్రు (జబర్దస్త్ రామ్ ప్రసాద్) ఆ పెళ్ళిలో అరటి గెలలు తెప్పించి పెద్ద గొడవకు కారణమౌతాడు. ఆ అరటి తోట తాలూకు యజమాని కరుణ (కరుణ కుమార్) కి బాబాయ్ కి కాకుండా చంద్రు కి అరటి తోట బాధ్యత అప్పగించటం తో గొడవ మొదలౌతుంది. నాంచారయ్య మధ్యవర్తిగా కరుణ తో మాట్లాడి సర్ది చెప్తాడు. అమెరికా లో ఉన్న కరుణ, అరటి తోటను చంద్రుకు ఇవ్వటం ఇష్టం లేని అతని భార్య బృంద (విజయ ప్రవీణ పరుచూరి) ను సముదాయించటానికి ఆ బాధ్యతను తిరిగి తన బాబాయ్ కే అప్పగించామని నాంచారయ్యకు చెపుతాడు.
రెండు వైపులా చెప్పలేక విసిగిపోయిన నాంచారయ్య కరుణ మీద కోప్పడి ఇంటి ముఖం పడతాడు. సైకిల్ మీద . దారిలో ఎదురయిన ఇంకో సైకిల్ మీద వచ్చే కుర్రాడిని ఢీ కొట్టబోతాడు. ఆ కుర్రాడు బెదిరి పండ్ల బుట్ట వాడి మీద పడతారు. కింద పడ్డ పండ్లను స్కూల్ పిల్లలు ఏరుకుని తీసుకు వెళ్ళిపోతారు. ఆ పండ్ల వాడు తీరా ఎవరో కాదు మన బాబ్జి చెల్లెలి భర్తే. ఆ విసుగు ఇంటికెళ్లి భార్య టీవీ సీరియల్ చూడ్డంలో మునిగి ఉండటం చూసి అరుస్తాడు. ఇంతలో పక్కింటావిడ అది చూసి బాబ్జి కి ఫోన్ లో విషయం చెప్పడం సరిగా వినకముందే ఫోన్ కట్ అవటంతో బాబ్జి పక్కనే ఉన్న చిన్న అంగడి లో ఫోన్ చేయటానికి ప్రయత్నిస్తాడు.
కథకు అసలు సూత్ర దారి ఇక్కడ ఆటో డ్రైవర్ రూపంలో వచ్చి బాబ్జి తో గొడవపడి కొట్టటం అంతవరకూ ఆటోలో కూర్చొని ఉన్న జోగినాధ్ (రవీంద్ర విజయ్), అతనిని ఆపటానికి వెళ్లిన సుహాస్ ని చెంప పగల కొడతాడు. ఇక మహేష్ రంగం లో కి దూకి బాగా దెబ్బలు తిని జోగినాథ్ చేత అవమానింపబడతాడు. మహేష్ ఊరి వాళ్ళ ముందు పరువు పోయిందని బాధపడి జోగినాధానికి బుద్ధి చెప్పే వరకు చెప్పులు వేసుకోనని తనకు తానే ప్రమాణం చేసుకుంటాడు.
ఇక కథ నెమ్మదిగా పాకాన పడుతుంది స్వాతి వాళ్ళ నాన్న తెచ్చిన అమెరికా సంబంధం వైపు మొగ్గు చూపటం, స్వాతి ని ఒప్పించాల్సిందిగా ఆమె తండ్రి మహేష్‌నే కోరటం, తరువాత స్వాతి పెళ్లి, చివరి సారిగా స్వాతిని ఆమె భర్తని చూడటం జరుగుతాయి. ఇక మహేష్ జోగినాధంని వెతుక్కుంటూ వెళ్లి ఆతను బ్రతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లాడని తెలుసుకుంటాడు. దుబాయ్ నుండి పనులు లేక అందరినీ పంపేస్తున్నారన్న వార్త విని జోగినాధం ఇంటికెళ్లి అతని తల్లిని పరిచయం చేస్తుకుంటాడు.
ఇక్కడే జ్యోతి (రూప కొడువాయుర్) చెల్లెలుగా పరిచయం. ఆ అమ్మాయికి అందాల పోటీకి ఫోటో తీయటం ఓ సవాల్‌గా తీసుకుని తనతో ప్రేమలో పడతాడు. జ్యోతి తనను జోగినాధం చెల్లెలుగా పరిచయం చేసుకుంటుంది మహేష్ కి. దుబాయ్ నుండి తిరిగి వచ్చిన జోగినాధానికి తాను కుంగ్ ఫు మాస్టర్ (శ్రీధర్ రెడ్డి) దగ్గర నేర్చుకున్న విద్యతో జోగినాధాన్ని ఒక మోస్తరు ఉగ్రరూపంతో ఓడించి జ్యోతిని పెళ్లి చేసుకుంటాననటంతో సినిమా పూర్తవుతుంది.
ఎక్కడా కృత్రిమత్వం లేకుండా సహజంగా ప్రకృతి ఒడిలో తీసిన సినిమా. డైరెక్టర్ వెంకటేష్ మహా ఒక మలయాళం సినిమాను తెలుగు లో తీసే ప్రయత్నం లో నూటికి నూరు మార్కులు కొట్టేసి ఈ సినిమాను తెలుగు వారి సొంతం చేసారు. డైరెక్టర్ చిన్న చిన్న మాటలు పాత్రలు పూలదండలు చుట్టీ చమ్కీ దారాల్లాగా కనిపించి మెరిపించాయి అంతంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పనిలో పని టీ స్టాల్ ఓనర్ గా కూడా మాటల గారడీ చేశారు.
తెర మీద ముఖ్యమైన వారు కాకుండా మనకు కనిపించే ప్రతి చిన్న పాత్ర కూడా మనం రోజు చూసే వారేమో అనేంత సహజంగా ఉంటాయి ఉదాహరణకు మనోహర రావు జోగినాధం తో “అతను ఓడిపోయాడు విడిచిపెట్టు అని చెప్పటం”, షాప్ ఓనర్ ( అజయ్ వెగ్సేనా ). “చెప్పులు వేసుకున్నాడో లేదో గమనిస్తూ ఉండటం” తరువాత జోగినాథాన్ని ఓడించి చెప్పులు కొనటానికి వచ్చిన మహేష్ కి చెప్పులు ఇవ్వటం అతని హావ భావాలు
ఇంకో పాత్ర టీ స్టాల్ ఓనర్ (వెంకటేష్ మహా) జోగినాథాన్ని చూట్టానికి వెళ్ళినపుడు మహేష్ కి ఎదురైన పాత్ర. నిమ్మకాయ సోడా లేదు లిమ్కా ఉంది అని చెప్పటం చిన్న చిన్న పల్లెటూరు లలో కూడా కూల్ డ్రింక్స్ రెవల్యూషన్ వేళ్ళూనింది అని చెప్పటానికి చేసిన ప్రయత్నం ఫలించింది. ఇది మహ్మద్ ఖదీర్ బాబు కథల్లో ప్రసిద్ధమైన పెండెం సోడాసెంటర్ ను గుర్తుకు తెస్తుంది.
స్వాతి తన పెళ్ళిలో అమెరికా భర్తతో బిరియానీ అక్కడ దొరుకుతుందా అని అడగటం అందుకు అతని జవాబు అమెరికా లైఫ్ స్టైల్‌ని కళ్లముందుంచుతుంది. కరుణ అమెరికా నుండి వచ్చినపుడు పాస్ పోర్ట్ ఫోటో మహేష్ తీయటం, అన్నట్లు కరుణ గా నటించిన మరో మంచి సినిమా పలాస 1978 డైరెక్టర్ కరుణ రావు. పండించాడు తన పాత్రని. ఫోటో తీయించుకునేపుడు గడ్డం పైకెత్తటం కళ్ళు పెద్దవి చేయటం లాంటివి ఓహో అనిపించేసాయి జ్యోతి స్టూడియో కి వచ్చినపుడు ఎలా తీయాలో తెలీక ఇబ్బంది పడటం, ఎమోషన్స్ ని పట్టుకోగలిగితేనే మంచి ఫోటోగ్రాఫర్ అవుతావని మనోహర రావు చేత చెప్పించటం. చెప్పులు లేని కాళ్ళను టేబుల్ కిందకు లాక్కోవటం, బాబ్జి కి గుండెనొప్పి వచ్చినట్లు నటించటం, సుహాస్ బొంగులో చికెన్ వ్యాపారం సరిగా నడవకపోవటం, అతని పేను కొరుకుడు, బాబ్జి వేషం, భాష, మిథిలతో సుహాస్ ప్రేమ కథ, జోగినాధం తల్లి మాటలు, ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా చాల చాలా చాల చాలా.
విపరీతమైన కోపాన్ని మనసులో అనుభవిస్తూ ప్రతీకారం తీర్చుకోవటం లో మాత్రం తన స్థాయిని శారీరక బలాన్ని తెలుసుకొని ఆ సమయం వచ్చినపుడు విజృంభించటం అనే అంశం చాలా కొత్తగా కధకు తగినట్లుగా ఉంది .. బలమైన స్క్రీన్‌ప్లే.
తారాగణం విషయానికొస్తే
నరేష్ఈ సినిమాలో నటించాడని అనటం కన్నా జీవించేసాడు అనేస్తే మహా గొప్పగా ఉంటుంది. నాలుగు స్తంభాలాట లో చూసిన నరేష్ ఎన్ని మెట్లెక్కి ఇంతగా తనను తాను ఒక మంచి నటుడిగా మలుచుకున్నాడో . మాటల్లేవ్ మాట్లాడుకోవటాల్లేవ్ అన్నట్లుగా ఉంది నరేష్ నటన. ఇక కొత్తగా పరిచయం చేయబడ్డ రూప కొడువాయుర్ జ్యోతి పాత్ర లో ఒదిగింది. మంచి భావాలు పలికాయి ముఖంలో తెలుగు తెరకు ఇంకో మంచి డాన్సర్ గా కూడా ఓకే అయింది. హరిచందన కొప్పిశెట్టి స్వాతి గా మెప్పించింది మాములు అమ్మాయి అమెరికా సంబంధం అనగానే కన్ఫ్యూషన్ లో ఉన్నాను అంటూనే మహేష్ ని వద్దని చెప్పటం బాగుంది, రవీంద్ర విజయ్ వెండి తెర మాకేం కొత్త కాదన్నట్లు గా ఉన్నారు. విజయ ప్రవీణ పరుచూరి కూడా కేరాఫ్ కంచరపాలెం చిత్రం ద్వారా మనకు పరిచయమే. TNR కూడా పరిచయస్తుడే.
సాంకేతిక పరంగా
అప్పు ప్రభాకర్ సినిమాటోగ్రఫీ ఇంకా బాగా లొకేషన్స్ ని ఒడిసి పట్టుంటే బాగుండేది. మనోహర్ రావు నైట్ సీన్స్ చిత్రిక పట్టాల్సింది. ఎమోషన్స్ తో ఫొటోస్ తీసే సీన్స్ లో సత్య దేవ్ ఇంకా బాగా చేసుండాల్సింది చాలా లైట్ గా ఉన్నాయి ఆ సీన్స్. ఫీలింగ్ కొంచెం తక్కువయింది. ఫ్లాష్ మాబ్ డాన్స్ కొరియోగ్రఫీ సూపర్. ఎడిటింగ్ బాగుంది. పాటలు, సంగీతం బాగానే ఉన్నాయి. కాస్ట్యూమ్స్ అద్దినట్లున్నాయి. ఇక కొంచెం ఇబ్బంది పెట్టింది సత్య దేవ్ వయసు అంటే మహేష్ పాత్ర వయసు ౩౦ ఏళ్ళు అని చెప్పాడనుకోండి అయినా ఇంకా కొంచెం ఎక్కువే అనిపించింది. ముఖ్యంగా జ్యోతి పక్కనుంటే. మొత్తానికి సినిమాను మనసు కెక్కించేసాడు తెలుగుదనాన్ని అరకు మాట యాసని మళ్ళీ మన ముందుకు తెచ్చారు వెంకటేష్ మహా.
.. జయభారతి











