సినిమా అంటేనే గ్లామర్.. ఈ గ్లామర్ ఎక్కడి నుంచి వస్తుంది. పుట్టుకతో ఉంచే అందానికి మనం మెరుగులు దిద్దితేనే అది తళుకులీనుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తారల ‘యోగా’క్షేమాల గురించి తెలుసుకుందాం.
సినిమా తారలు గ్లామర్ ను ఇనుమడింపజేసుకోవాలంటే యోగా తప్ప మరో మార్గం లేదన్న సంగతి తారలకు ఎప్పుడో అర్థమైంది. ఒకప్పుడు తారలు ముద్దుగా బొద్దుగా ఉన్నా స్టార్ డమ్ ను చూశారు. నాడు భానుమతి, సావిత్ర.. లాంటి తారామణులు ఎందరో ఎలాంటి యోగా అవసరం లేకుండానే రాణించారు. పైగా వారి నటనా జీవితం సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. నేడలా కాదు ఏ మాత్రం గ్లామర్ తగ్గినా దర్శకనిర్మాతలు పక్కన పెట్టేస్తున్నారు.
దీంతో హీరోయిన్ల లాంగ్విటీ తగ్గిపోయింది. పట్టుమని ఐదేళ్లు కూడా సినిమా రంగంలో కొనసాగలేకపోతున్న హీరోయిన్లు ఉన్నారు. పైగా సన్నగా రివటలా ఉంటేనే జనం ఆదరిస్తున్నారు. అమ్మాయి మంచి వయసులో ఉంది అని తెలియాలంటే సన్నగా ఉండాల్సిందేనన్న సత్యం హీరోయిన్లకు సైతం అర్థమైపోయింది. ఇక్కడే వారికి యోగా అవసరం ఏమిటో తెలియవచ్చింది.
తారలకు యోగా గురువు శిల్పాశెట్టి
సినిమా రంగంలో యోగా ప్రాధాన్యం తెలియవచ్చిందంటే అది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి వల్లే వచ్చిందని చెప్పవచ్చు. కేవలం యోగాతోనే ఆమె తన గ్లామర్ ను కాపాడుకుంటూ వస్తోంది. ఎంతో మందికి యోగా సలహాలను కూడా శిల్పాశెట్టే ఇస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసిందామె. ప్రాణాయామం ప్రాధాన్యం ఎలాంటిదో వివరించింది. శ్వాస లేకుండా జీవితం లేదని ఆమె ఇందులో పేర్కొంది. ప్రాణ అంటే జీవితం, అయామం అంటే సాధన లేదా నియంత్రణ.
Also Read ;- వళ్ళును విల్లులా వెనక్కి వంచిన టాలీవుడ్ సీనియర్ నటి
శ్వాసపై నియంత్రణ సాధిస్తే మీ జీవితంపైనా, మీ మనస్సుపైనా నియంత్రణ ఉంటుందంటూ శిల్పాశెట్టి పేర్కొంది. మనిషి శరీరంలో ఉండే 72వేల నాడులను చైతన్యవంతం చేయడానికి యోగా ఎంతో ఉపకరిస్తుందని ఆమె వెల్లడించింది. సినిమా రంగంలో ఫిట్ నెస్ యోగా ప్రాధాన్యం అంతకంతకూ పెరుగుతోంది. ఇదో కాస్ట్ లీ ప్రక్రియగానూ తయారైంది. భోగవంతమైన జీవితం కావాలంటే యోగం ఉండాల్సిందేనని శిల్ప లాంటి యోగా గురువులు నిర్దేశిస్తున్నారు. నటి భూమిక భర్త భరత్ ఠకూర్ కూడా యోగా గురువే.
హీరోయిన్ అనుష్కకు యోగా పాఠాలు నేర్పింది కూడా ఆయనే. ఈ ఫిట్ నెస్ యోగా అనేది లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. తాము నాజూకుగా కనిపించేందుకు ఎంత డబ్బు వెచ్చించడానికైనా హీరోయిన్లు వెనుకాడటం లేదు. దాంతో ఫిట్ నెస్ సెంటర్ల పంట పండుతోంది. యోగాలో సమంత స్టయిలే వేరు. ఆమె యోగా చేసే ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. తమన్నా కూడా అంతే.
Must Read ;- ఇనస్టాగ్రామ్ మహారాణులు
మలైకా అరోరా, నిమ్రత్‌కౌర్, కంగనారనౌత్, కరీనాకపూర్, సోనమ్ కపూర్, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సంజనా గర్లానీ, సోనీ ఛరిష్టా తదితరుల యోగా ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీరు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఈ ఫొటోలను వైరల్ చేస్తుంటారు. సినీ పరిశ్రమకు చెందిన తారలంతా బి ఫిట్ విత్ యోగా నినాదంతో యోగాసనాలు వేస్తూ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున సందడి చేస్తున్నారు.