ఎన్నికల్లో సమయంలో అవి చేస్తాం.. ఇవి చేస్తాం.. అని ఎన్నెన్నో ప్రమాణాలు చేస్తారు. ఎన్నికలు పూర్తైయి గెలుపొందడం ఆలస్యం, ఇక ఆ ప్రమాణాలు ఏవీ గుర్తుండవు. ఓట్ల కోసం ప్రజల చుట్టూ తిరిగే నాయకులు.. ఎన్నికల తర్వాత తాము చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోండి అంటూ ప్రజలు వేడుకున్నా కూడా వినిపించుకోరు. ఎన్ని సార్లు వాళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోరు. అలాంటి సంఘటనే మహారాష్ట్ర యవత్మాల్ జిల్లాలోని పల్సీ గ్రామంలోని ప్రజలకు ఎదురైంది. వారు కూడా ఎన్నో సంవత్సారాలుగా ఊరికి వంతెన కోసం ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. చివరికి విసుగుచెందిన ప్రజలు అందరూ ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్నారు.. అదేంటో చూడండి!
9 రోజుల్లో నిర్మాణం పూర్తిచేశారు
మహారాష్ట్ర యవత్మాల్ జిల్లాలోని పల్సీ గ్రామంలోని ప్రజలు పెన్ గంగా నదిపై వంతెన నిర్మాణం కోసం కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఏళ్లు గడిచిపోతున్నాయి.. ప్రభుత్వం మాత్రం చూద్దాం.. చేద్దాం అనే మాట తప్ప కార్యాచరణ మొదలుపెట్టింది లేదు. ఇక ప్రభుత్వానికి అడిగి వ్యర్ధమనుకున్న ప్రజలు తామే వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. అందుకోసం ప్రభుత్వ నిధులు మీద ఆధారపడకుండా వారే విరాళాలు సేకరించారు. పాల్సీ-మనులాలను కలుపుతూ 70 వంతెనను కట్టారు. ఇది కట్టడానికి ప్రభుత్వం కోటి రూపాయలు అంచనా వేయగా.. గ్రామస్థులు కేవలం 15.80 లక్షల్లో పూర్తిచేయడం గమనార్హం. అలాగని నెలల పాటు కట్టారనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. కేవలం తొమ్మిదంటే.. తొమ్మిది రోజుల్లో వంతెన పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా! నమ్మలేని విషయంగా అనిపిస్తున్నా ఇది నిజమండి.. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే..!
ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఓట్లు వేసి ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలకు మేలు చేస్తారని. వారికి అవసరమైన కట్టడాల నుండి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కానీ సంవత్సరాలుగా ప్రభుత్వ పట్టించుకోలేదంటే ఎంతంటి నిర్లక్ష్య ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారే కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. అంచనా వేసి కూడా వంతెన నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టలేదంటే అవినీతిని ప్రభుత్వం కట్టడి చేయడంలో విఫలమైందనేది స్పష్టంగా తెలుస్తున్న విషయం. కానీ, ప్రజలు తలుచుకుంటే ఎలా ఉంటుందనేది ఇప్పటికే ప్రభుత్వానికి తెలిసివచ్చుంటుంది. మరికనైనా ప్రభుత్వ అధికారులు కళ్లు తెరుస్తారేమో చూద్దాం..
Must Read ;- అరెస్టు ఎఫెక్ట్ : ఇక అన్ని రాష్ట్రాల్లో అర్ణబ్ దూకుడు!
https://www.youtube.com/watch?v=sf_1eJASmWw










