ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు .. పేరుకు తగినట్టుగానే మనిషి చాలా సింపుల్ గా కనిపిస్తాడు. ఎలాంటి హడావిడి లేకుండా అంతే సింపుల్ గా ‘ఉప్పెన’ సినిమా తీశాడు. అయితే ఆ సినిమా థియేటర్లకు మాత్రం సింపుల్ గా వచ్చి వెళ్లలేదు. కొత్త హీరో .. కొత్త హీరోయిన్ అనుకుని జనాలు ఆగలేదు. ఈ ఇద్దరూ కలిసి కొత్తగా ఏం చేశారో చూద్దామనే థియేటర్లకు వచ్చారు. వాళ్ల ఆటపాటలు నచ్చేసి మంచి మార్కులు ఇచ్చేశారు. అంతేకాదు .. వీళ్లతో వరుస సినిమాలు చేసుకోవచ్చుననే ధైర్యాన్ని నిర్మాతలకు కలిగించారు.
దాంతో కథానాయికగా ఒక వైపున కృతి శెట్టికి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. అలాగే వైష్ణవ్ తేజ్ ని సంప్రదిస్తున్న దర్శక నిర్మాతల సంఖ్య కూడా పెరుగుతోందట. అంతేకాదు .. ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబుకు ఒక రేంజ్ లో డిమాండ్ పెరుగుతోందట. యువ హీరోలంతా ఆయన దర్శకత్వంలో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందన్నట్టుగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ‘ఉప్పెన’ నిర్మాతలే ఈ సినిమాను కూడా నిర్మించనున్నట్టు చెబుతున్నారు.
ఒకవేళ ఈ వార్త నిజమే అయినా, ఎన్టీఆర్ తో ఇప్పటికిప్పుడు బుచ్చిబాబు సెట్స్ పైకి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ముందుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ సినిమా చేయవలసి ఉంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయవలసి ఉంది. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎన్టీఆర్ – బుచ్చిబాబు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈలోగా ‘ఉప్పెన’ వంటి సినిమాలు ఒకటో రెండో దర్శకుడు బుచ్చిబాబు చేసేసుకోవచ్చన్న మాట.
Must Read ;- లెక్కల మాస్టారుకు ‘ఉప్పెన’ లాంటి కిక్కు