టాలీవుడ్లో ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన డాన్స్ కి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం అభిమానులే అంటే ఎన్టీఆర్ స్పెషాలిటీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ .. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖరారైపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది.
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ .. ఎన్టీఆర్ కి ఒక కథ వినిపించాడనీ, మైత్రీ మూవీ మేకర్స్ వారి బ్యానర్లో ఆ సినిమా రూపొందనుందనే వార్తలు ఆ మధ్య షికారు చేశాయి. ఆ తరువాత ప్రశాంత్ నీల్ .. ప్రభాస్ హీరోగా ‘సలార్’ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. దాంతో ఇక ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ .. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోని సినిమా ఉందనీ, ఆ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని తాజా ఇంటర్వ్యూలో మైత్రీ మూవీ మేకర్స్ వారు స్పష్టం చేశారు. పాన్ ఇండియా మూవీగానే ఈ ప్రాజెక్టు ఉంటుందనే విషయాన్ని వెల్లడించారు.
అయితే ‘ఆర్ ఆర్ ఆర్‘ సినిమా తరువాత ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రివిక్రమ్ తో ఉండనుంది. ఈ సినిమాకి ‘అయిననూ పోయిరావలె హస్తినకు‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను పూర్తి చేసిన తరువాత ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ లోగా ప్రశాంత్ నీల్ కూడా ‘సలార్’ ను పూర్తిచేస్తాడన్న మాట. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ ప్రాజెక్టు లేనట్టేనని అనుకుంటున్న అభిమానులకు ఇది తీపికబురు వంటిదే.
Must Read ;- ఎన్టీఆర్ ను మరిచిపోలేనంటున్న ఉప్పెన హీరో!