పాటలను ఏ సినిమాకైనా ఆయువు పట్టుగా భావిస్తారు. పాటలు బావుంటే సగం సినిమా సక్సెస్ అయినట్లుగా పరిగణిస్తారు. సినిమా విడుదలకు ముందుగానే పాటల ఆవిష్కరణ జరుగుతుండటంతో సహజంగానే ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు నెలకొనడం చూస్తున్నదే. మెగాస్టార్ చిరంజీవి రెండో మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్,హీరోగా పరిచయం కానున్న `ఉప్పెన` చిత్రం పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మెగా కుటుంబానికి చెందిన కుర్రాడు కావడంతో పాటు ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకులను అలరించడం కూడా మరో కారణం అని చిత్రపరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’ మ్యూజిక్ చార్టుల్లో టాప్‌లో ఉండగా, ‘ధక్ ధక్ ధక్’ పాట కూడా ఎంతగానో ఆకట్టుకుందని అంటున్నారు. తాజాగా ‘రంగులద్దుకున్న’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను సూపర్ స్టార్ మహేష్‌బాబు బుధవారం విడుదల చేసారు. హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లపై చిత్రీకరించిన ఈ పాటకు ఇప్పటికే ఒక మిల్లియన్ వ్యూస్ రావడం ఓ విశేషమని చిత్ర బృందం చెబుతోంది.
శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్నఈ చిత్రం నిర్మాణాంతర పనులన్నీ పూర్తయ్యాయి. థియేటర్లు ఓపెన్ కాగానే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.











