సినిమాల్లో ప్రేక్షకులకూ, ఫిలిం నగర్ లో రోడ్ల మీద కనిపించే నాగయ్య కన్నుమూశారు. అందరూ ఆయన్ని వేదం నాగయ్య అంటారు. సినిమాల్లో ముసలి పాత్రలకు ఎవరైనా అవసరమైతే అందరూ నాగయ్యను సంప్రదించేవారు. ‘వేదం’ సినిమాలో ఆయన నటించిన పాత్ర ఆయనను వేదం నాగయ్యను చేసింది. 30కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా నర్సరావు పేట సమీపంలోని దేచవరంపేట. ఊళ్లో రెండెకరాల భూమి ఉన్నా బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు.
ఏదైనా డైలాగ్ ఇస్తే తన దైన శైలిలో చెప్పడంతో దర్శకులు కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చారు. బతుకు భారమయ్యే పాత్రలు, రైతు పాత్రలు అవసరమైతే దర్శకులు నాగయ్యను సంప్రదించేవారు. ‘నేసేవాడినంటున్నావు కాస్త మంచి బట్టలు కట్టుకుని రావచ్చు కదా అంటే ఇళ్లు కట్టేవాడికి ఇళ్లుండవు, చెప్పులు కుట్టేవాడికి చెప్పులుండవు.. మా పరిస్థితి కూడా అంతే` అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌తో ఆయన వేదం నాగయ్య అయ్యారు.
నాగయ్యకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఆయన భార్య ఇటీవలే కన్నుమూసింది. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆయనకు పూట గడవడమే కష్టమైంది. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన నానా కష్టాలు పడ్డారు. తనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎవరినీ డబ్బులు అడిగేవాడు కాదు. ఏమాయ చేశావే, నాగవల్లి, ఒక్కడినే, రామయ్యావస్తావయ్యా, స్పైడర్.. ఇలా అనేక సినిమాల్లో నాగయ్య నటించారు.