సినిమా తీద్దామనుకుంటే సినిమా చూపించాడు మామా. అదెలాగో చూద్దాం. SR రియల్ ఎస్టేట్స్ ఛైర్మన్ కోదండం కళ్ల ముందు సినిమా రీలు గిర్రున తిరుగుతోంది. వయసు అరవై దాటుతోంది.. మనసు ఇరవైలా పరుగెడుతోంది. ఇన్నాళ్లూ ఫ్లాట్లూ, ప్లాట్ల అమ్మకాలే రియల్ ప్రపంచం అనుకుని ఈ వ్యాపారంలోకి దిగిపోయాడు.
రియల్ ఎస్టేట్ లో పాతిక కోట్లు వెనకేసుకోగలిగాడు.. మొహం మొత్తేసింది.. మనసు కూడా ఇంకేదో కావాలని కోరుకుంటోంది. చక్రంగాడు సినిమా తీద్దామని చెవిలో జోరీగలా పోరు పెడుతున్నా పెడచెవిన పెట్టానే అన్న కించిత్ బాధ కూడా కలిగింది. రియల్ ఎస్టేట్ ను కొన్నాళ్లు పక్కన పెట్టి రీల్ ఎస్టేట్ లోకి దిగిపోవల్సిందే. కోదండానికి అతను క్లోజ్ ఫ్రెండ్. సినిమా తియ్ రా బాబూ .. బాహుబలి చూశావా.. రెండు వేల కోట్లు సంపాదించింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనేవాడు. ఇప్పుడతని అతని కళ్ల ముందు సినిమా రీలు తిరగడానికి కారణం అదే. సినిమా రీలు అనే పదాన్ని సినిమానే మరచిపోయిందన్న సంగతి కూడా అతనికి తెలియదు పాపం.
సినిమా ఎలా చూపించారంటే..
ఓ ఫైన్ మార్నింగ్ చక్రధర్ ని వెంటేసుకుని గన్నవరంలో ఫ్లైట్ ఎక్కేసి శంషాబాద్ లో దిగేశాడు. సరాసరి ఫైవ్ స్టార్ హోటల్లో మకాం. కట్ చేస్తే.. నైట్ మందు పార్టీ. వీరిద్దరికీ తోడు అక్కడ మరో ఇద్దరు.. ఒకడి పేరు మహేష్.. ఇంకోడి పేరు దినేష్. వాళ్లు చక్రంగాడి ఫ్రెండ్స్ అట. ఒకడు మాస్ హీరోకి లెఫ్ట్ హ్యాండ్.. ఇంకొకడు బాస్ హీరోకి రైట్ హ్యాండ్ అట. ఇదంతా చక్రం గాడి సెటప్ అనే సంగతి కోదండానికి ఏం తెలుసు. మందు కొడుతూ మహేష్ ఓపెన్ అయ్యాడు ‘అన్నా దిల్ రాజు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గైడ్ చేసింది నేనే. అసలతనికి అంత దిల్ ఎక్కడుంది. సినిమా సంగతి మాకొదిలెయ్.. నువ్వు గమ్మునుండు’ అంటూ భరోసా ఇచ్చాడు.
ఇంతలో దినేష్ ఫోన్ మోగింది..‘రేయ్ మాట్లాడకండి.. బాస్ ఫోన్ చేశాడు’ అంటూ ఫోన్ ఆన్ చేసి మాట్లాడుతూ దూరంగా వెళ్లిపోయాడు. కాసేపటికి తిరిగొచ్చి ‘బాస్ చంపేస్తున్నాడ్రా బాబూ.. కేరళ వెళ్లాలంట.. ఆ మలయాళ సినిమా రైట్స్ మాట్లాడి రమ్మంటున్నాడు’ అన్నాడు. ‘ఎవరా బాస్?’ అడిగాడు కోదండం అమాయకంగా. ‘బాస్ ఎవరేంటండీ బాబూ.. స్టార్ ఆఫ్ ది స్టార్.. మన సినిమాకి ఆయన డేట్స్ మాట్లాడనా?’ అడిగాడు దినేష్. ‘వద్దొద్దు.. ముందు నన్ను రేపు ఫిలింనగర్ తీసుకెళ్లి అంతా చూపించు.. ఆ తర్వాత హీరోని డిసైడ్ చేద్దాం’ అన్నాడు కోదండం. ఎవరినీ గుడ్డిగా నమ్మే తత్వం కాదతనిది. తన నీడను కూడా నమ్మడు.
Must Read ;- సినిమా రంగంలో నెపోటిజం.. అందులో ఎంత నిజం?
ఫిలింనగర్ లో ఏంచూపించాలో..
తన నెవరూ మోసం చేయలేరనేది అతని ప్రగాఢ నమ్మకం. పార్టీ ముగిసింది. వాళ్లను పంపించి వస్తానంటూ చక్రం మిగిలిన ఇద్దరినీ తీసుకుని వెళ్లాడు. ‘మనం సినిమా చేసేస్తున్నాం ఫిక్స్.. రేపు మావాడిని ఫిల్మ్ నగర్ కి తీసుకెళదాం.’ అన్నాడు చక్రం. ‘స్టూడియోలు చూపిద్దాం.. ఆ తర్వాత హీరోల ఇళ్లు చూపిద్దాం.. నిర్మాతల ఇళ్లు మాత్రం చూపించకు?’ అన్నాడు మహేష్ ‘అదేంటి ఎందుకు?’ అమాయకంగా అడిగాడు చక్రం. ‘ఇళ్లున్న నిర్మాతలు ఇద్దరు ముగ్గురే కదా.. అతను భయపడి సినిమా తీయకపోతే మన సంగతేంటి?’ దినేష్ ప్రశ్న. ఎంత పల్లె టూరి వాడినైతే మాత్రం ఇంత చిల్లు పడిన రికార్డు ఇస్తావా అన్నాడట వెనకటి కెవడో.. అప్పట్లో గ్రామఫోన్లో రికార్డులకు బొక్కలు ఉండేవి లెండి. ఈ కోదండం అలాంటి వాడే.
తానే పెద్ద తెలివైన వాడినని అతని నమ్మకం. తనను ఎవరూ మోసం చేయలేరన్న అతి విశ్వాసం. సాధారణంగా ఇలాంటి అతి విశ్వాసం ఉన్నవారే త్వరగా మోసపోతుంటారు. కోదండం విషయంలోనూ అలాగే జరిగింది. అతను ఎవర్నయితే నమ్మి సినిమా రంగంలో అడుగుపెట్టాడో ఆ చక్రమే అతన్ని ముంచేశాడు. రియల్ ఎస్టేట్ ను నమ్ముకున్నంత కాలం అతనికి తిరుగే లేకుండా పోయింది. రీల్ ఎస్టేట్ లోకి అడుగుపెట్టాడో లేదో అతని తిరోగమనం మొదలైంది.
అప్పులివ్వగలిగే స్థాయి నుంచి అప్పులు తీసుకునేలా మారిపోయాడు. ఒకరో ఇద్దరో కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లను పెట్టి సినిమా తీశాడు. అందరూ అతన్ని నాకేసినవారే. ఫ్లాట్లు, ప్లాట్లు వదిలిపెట్టి సినిమా రంగంలోకి అడుగు పెట్టిన అతనికి చివరికి పాట్లే మిగిలాయి. కరోనా కారణంగా కోదండానికి చుక్కలు కనిపించాయి. రంగుల రాట్నం తిరగడం ఆగిపోయింది. అందుకే అతను సినిమాకి ఓ దండం పెట్టేసి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చెక్కేశాడు.
Also Read ;- ‘తారా’స్థాయిలో సినిమాలు చేయబోతున్న రాజకీయం?
చివరిగా నాలుగు మాటలు..
సినిమా రంగంలోకి రావడం తప్పుకాదు. అవగాహన లేకుండా వస్తే మోసపోవడం ఖాయం. అన్న లుక్కేస్తే మాస్.. అన్న మడతెడితే మాస్.. ఫ్యాంట్ ఏస్తే మాస్.. లాంటి మాటలు చెప్ప గలిగే వారు ఈ రంగంలో ఎక్కువ. ఈ మాస్, బాస్ లాంటి పదాలు, బాబు నుంచి ఫోన్ వచ్చింది లాంటి మాటలు తరచూ వినిపిస్తుంటాయి. అందరూ బిగ్ అయితే మరి స్మాల్ ఎవరు బాసూ అన్న సందేహం కూడా మీకు వచ్చి ఉండవచ్చు. హిట్ రానంత వరకూ అందరూ స్మాల్ గాళ్లే. ఈ స్మాల్ గాడు ఎప్పుడు బిగ్ బాస్ గా ఎదుగుతాడో చెప్పడం మన చేతుల్లో ఉండదు. ఈ బాస్ కరుణా కటాక్షాల కోసం డైరెక్టర్లు పడిగాపుల పడుతుంటారు.
ఒకడు తంతే బూరెల బుట్టలో పడతాడు.. ఇంకోడు బాషా సినిమాలోలా పైకెళ్లి స్తంభానికి కొట్టుకుంటాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అదే కథ.. నిజం అవునో కాదో కనుక్కుని చెప్పండి. ఫలానా హీరో కాల్షీట్ ఇప్పించావనుకో నీకు 25 లక్షలు ఇచ్చేస్తా.. అనే బ్యాచ్ ఇంకోటి. ఎవరీ స్టారు అని ఆలోచించడం నుంచి ‘ఇంకెంత కాలం మాస్టారూ..’ అనే దాకా ప్రయాణం సాగిపోతుంది. ఆ బాస్ లకు భజన పరులు కూడా ఎక్కువే. ఇందులో సినీ జనాలే కాదు మీడియా వాళ్లూ ఉంటారు. నగరంలో అడుగుపెట్టిన కోదండానికి ఫిలిం నగర్ లో నరకం కనిపించి అజ్ఞాతవాసిగా మారిపోయాడు.
– హేమసుందర్ పామర్తి