విక్టరీ వెంకటేశ్ ఈ ఏడాది ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఎప్పుడూ లేనిది ఏకంగా మూడు సినిమాల్ని ఒకేసారి పట్టాలెక్కించి అందరికీ షాకిచ్చారు. వాటిలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘నారప్ప’ రీమేక్ అయితే.. అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’, జీతు జోసెఫ్ ‘దృశ్యం 2’ సీక్వెల్స్ అవడం విశేషం. వాస్తవానికి ‘నారప్ప’, ‘ఎఫ్ 3’ చిత్రాలు ముందుగా షూటింగ్ స్టార్ట్ చేయగా.. ‘దృశ్యం 2’ మాత్రం కేవలం 44 రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టింది. అంటే సరిగ్గా మార్చ్ 1 న ‘దృశ్యం 2’ పూజా కార్యక్రమాలతో షూటింగ్ ను ప్రారంభించింది.
ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ లో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ మూవీ స్ట్రీమ్ అయింది . సినిమా అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్టవడంతో .. వెంటనే ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నారు సురేష్ ప్రొడక్షన్స్ వారు. అప్పటికి చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూసేశారు. దాంతో తెలుగు వెర్షన్ ను ఏ మాత్రం లేట్ చేయకుండా.. వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ ను కేవలం 46రోజుల్లోనే కంప్లీట్ చేసిన అదే దర్శకుడు జీతు జోసఫ్ ను తెలుగు వెర్షన్ కు కూడా దర్శకుడిగా ఎంపిక చేశారు.
దర్శకుడు జీతు జోసెఫ్ ‘దృశ్యం 2’ తెలుగు వెర్షన్ షూట్ ను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేశారు. ఆయన తన ఫేస్ బుక్ పేజ్ లో దృశ్యం 2 లో వెంకీ పార్ట్ పూర్తయిందని, ఆయనిచ్చిన సహకారానికి ధన్యవాదాలు అంటూ ఓ ఫోటో ను పోస్ట్ చేసి మరీ చెప్పారు. మీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్తేర్ అనిల్, కృతిక, సంపత్ రాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ‘నారప్ప, ఎఫ్ 3’ మూవీస్ రిలీజెస్ కు మధ్యలో విడుదల కాబోతోందని తెలుస్తోంది. అంటే జూన్ లో కానీ..జూలైలో కానీ.. సినిమా విడుదల కానుందని సమాచారం. మరి ఈ ‘దృశ్యం 2’ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందేమో చూడాలి.
Must Read ;- రేచీకటితో వినోదం పంచనున్న వెంకీ ?











