ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో ఆయన నెంబర్ టూ… అంటే జగన్ తర్వాత అంతా ఆయనే. అందుకే కాబోలు పార్టీలోని నేతలతో పాటు కేడర్ కూడా ఆయన వస్తున్నారంటే… వంగి వంగి దండాలు పెడతారు. ఆ దండాలను స్వీకరిస్తూనే ఆయన అలా సాగిపోతుంటారు. ఇప్పటికే పార్టీలో కీలకమైన ప్రధాన కార్యదర్శితో పాటు పార్లమెంటరీ పార్టీ నేత పదవి,… ఉత్తరాంధ్రకు ఓ సామంత రాజులా ఇన్ చార్జీ పదవి… అబ్బో… వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ఠీవి అదిరిపోతోంది. ఇక జగన్ సర్కారు పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలనుకుంటున్న విశాఖలో పెత్తనమంతా సాయిరెడ్డితే. అలాంటి చోట సాయిరెడ్డికి మరింత ప్రాధాన్యం. పార్టీ నేతలే కాదు… అధికారులు కూడా ఆయన అనుమతి లేకుండా కదలడానికి కూడా లేదు. అలాంటి చోట సాయిరెడ్డికి మంగళవారం నాడు ఘోర అవమానం జరిగిపోయింది. విశాఖ సామంత రాజు స్థాయిలో 108 అడుగుల ఎత్తున వెలసిన ఆయన హోర్డింగ్ కొన్ని గంటల వ్యవధిలోనే కూలిపోయింది. కాదు… కాదు… కూల్చివేయబడ్డది. నిజమా? అంటే… నిజమేనండీ బాబూ… ప్రభుత్వ పెద్దల అనుమతితోనే సాయిరెడ్డి కటౌట్ తొలగించబడ్డదట. ఈ కథాకమామీషు ఏమిటో చూద్దాం పదండి.
విశాఖపైనే సాయిరెడ్డి దృష్టి
పార్టీ ఉత్తరాంధ్ర చీఫ్ గా కొనసాగుతున్న సాయిరెడ్డి… టీడీపీకి కంచుకోటగా ఉన్న విశాఖలో ఎలాగైనా తన పార్టీకి గట్టి పునాదులు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో సాగుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీడీపీ టికెట్లపై విశాఖ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఓ ఎమ్మెల్యేను వైసీపీ లాగేసింది. మరో ఎమ్మెల్యేపై దృష్టి పెట్టింది. ఇంకో ఎమ్మెల్యేను ఏకంగా అజ్ఞాతవాసం పట్టేలా వ్యూహం రచించింది. అయినా కూడా అక్కడ టీడీపీ ఎక్కడా తగ్గడం లేదు. విశాఖ జిల్లాలో రూరల్ ప్రాంతాన్ని మినహాయిస్తే… విశాఖ అర్బన్ లో టీడీపీని ఢీకొట్టే దమ్ము ఇప్పటిదాకా ఇంకే పార్టీకి లేదనే చెప్పాలి. అంతేకాకుండా అప్పుడెప్పుడో జగన్ తన తల్లిని విశాఖ ఎంపీగా నిలబెడితే… విశాఖ ఓటర్లు ఆమెను చిత్తుగా ఓడించారు. ఈ కారణంగానేనేమో తెలియదు గానీ… విశాఖను ఎలాగైనా తమ అదుపులోకి తీసుకోవాలన్న దిశగా జగన్ ఆదేశాల మేరకు సాయిరెడ్డి సాగుతున్నారు.
అధిష్ఠానం అదేశాలతోనే తొలగింపు
ఇలాంటి క్రమంలో ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి విశాఖలో సాయిరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ పరంగా అయినా, ప్రభుత్వ పరంగా అయినా సాయిరెడ్డి అనుమతి లేకుండా ఏ పనీ జరగడం లేదు. ఇలాంటి నేపథ్యంలో త్వరలోనే సాయిరెడ్డి జన్మదినం వస్తోందట. విషయం కాస్తంత ముందుగానే తెలుసుకున్న వైసీపీ కేడర్… విశాఖను సాయిరెడ్డి హోర్డింగ్ లతో నింపేయడానికి పూనుకున్నారు. అందులో భాగంగానే విశాఖలోని సర్క్యూట్ హౌస్ వద్ద ఏకంగా 108 అడుగుల ఎత్తున్న సాయిరెడ్డి హోర్డింగ్ ను మంగళవారం ఉదయం ఓ పార్టీ నేత ఏర్పాటు చేశారు. ఆ హోర్డింగ్ లో నిజంగానే సాయిరెడ్డి ఠీవీ అదిరిపోయిందనే చెప్పాలి. అయితే సర్క్యూట్ హౌస్ చారిత్రక ప్రాధాన్యమున్న స్థలం కావడంతో విశాఖ జనం ఇదేం తీరని వైసీపీ తీరుపై మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారట. అదే సమయంలో ఆ హోర్డింగ్ పై పార్టీ అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు వెళ్లిందట. ఇంకేముంది… 108 అడుగుల హోర్డింగ్… అది కూడా సర్క్యూట్ హౌస్ వద్దా? అని ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్ఠానం…దానిని పీకిపారేయాలని ఆదేశాలు జారీ చేసిందట. అంతే… ఉదయం వెలసిన సాయిరెడ్డి భారీ హోర్డింగ్ మధ్యాహ్నం కల్లా నేలకు వాలిపోయిందట.
Must Read ;- పంతం నెగ్గించుకోనున్న జగన్.. విశాఖలో క్యాంప్ ఆఫీస్











