(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు… విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో వెయ్యి పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి సుమారు 20 రోజులు కావస్తున్నా,జిల్లా అధికారులకు అనుమతి ఇచ్చే తీరిక లేకుండా పోయింది.దేశవ్యాప్తంగా ఆక్సిజన్ పడకల కోసం రోగులు అష్టకష్టాలు పడుతూ ఉంటే,అన్ని సిద్ధంగా ఉన్న స్టీల్ ప్లాంట్‌లో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పడకలు దుమ్ము పట్టి పోతున్నాయి.
200 ఆక్సిజన్ పడకలు..
సుమారు రెండు వందల పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు కావాల్సిన పైప్ లైన్ పనులు,సిలిండర్లు ఏర్పాటు చేశారు.అదే విధంగా అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ నిలిచిపోతే ప్రత్యామ్న్యాయం ద్వారా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు మరో వ్యవస్థను ఏర్పాటు చేశారు.స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ గురజాడ కళాక్షేత్రంలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వెయ్యి పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు.ఇందులో 200 పడకల కు ఆక్సిజన్ సదుపాయం కల్పించారు.
అధికారులు ఇచ్చిన హామీ మేరకు..
స్టీల్ ప్లాంట్‌లో సుమారు పదిహేడు వేల మంది శాశ్వత ఉద్యోగులు,ఔట్సోర్సింగ్,కాంట్రాక్టు ఉద్యోగులు కలిపి 70 వేలకు పైనే ఉన్నారు.వీరిపై ఆధారపడిపై కుటుంబ సభ్యులు ఉన్నారు. సెకండ్ వేవ్ తాకిడికి స్టీల్ ప్లాంట్‌లో అనేక మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు.గత ఏడాది,ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 80 మంది శాశ్వత ఉద్యోగులు కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు.ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉక్కు మంత్రిత్వ శాఖ వైద్య సదుపాయాలను కల్పించాలని ఆదేశించింది.అందులో భాగంగా జిల్లా యంత్రాంగం మౌలిక సదుపాయాలు సమకూర్చుకుంటే వైద్య సిబ్బంది,మందులు అందజేస్తామని హామీ ఇచ్చింది.ఈ మేరకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం,యూనియన్లు యుద్ధ ప్రాతిపదికన పడకలు తయారుచేసి,ఆక్సిజన్ సరఫరాకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
అనుమతి కోసం అధికారుల చుట్టూ..
ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు రెండు వారాలుగా జిల్లా అధికారుల చుట్టూ యూనియన్ నాయకులు తిరుగుతూనే ఉన్నారు.ప్రధానంగా గ్యాస్ పైప్ లైన్,సిలిండర్ నుంచి రోగికి ఆక్సిజన్ అందించేందుకు కావలసిన నెబులైజర్లు,ఫ్లో మీటర్లు జిల్లా యంత్రాంగం అందించాల్సి ఉంది.అధికారుల నుంచి ఉలుకు.. పలుకు లేకపోవడంతో యూనియన్ నాయకులే ఇతర రాష్ట్రాల నుంచి వాటిని సేకరించి,సుమారు 50 పడకలకు అవసరమైన మెటీరియల్ కొనుగోలు చేశారు.50 పడకలతో ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు.దానిని ప్రారంభించేందుకైనా అనుమతులు ఇవ్వండి,అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమైన మెడిసిన్ సరఫరా చేయండి.. అని వేడుకుంటున్నా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నగర పరిధిలో ఒక ఎంపీ ట్రస్ట్ పేరిట ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌కు సకల సౌకర్యాలు ఆగమేఘాల మీద సమకూర్చిన అధికారులు,పరిశ్రమల పట్ల ఈ విధంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు విశాఖ ఉక్కు జనరల్ ఆస్పత్రిలో రోగులకు అవసరమైన పడకలు లేక, కుర్చీలు బల్లలు మీద కూర్చోబెట్టి ఆక్సిజన్ అందిస్తున్నారు.అన్ని సౌకర్యాలు ఉన్న పడకలకు అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న అధికారుల తీరుపై కార్మికులు భగ్గుమంటున్నారు.
Must Read ;- మే డే స్ఫూర్తితో విశాఖ ఉక్కును కాపాడుకోవాలి : నారా లోకేశ్











