(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖలో కొత్త సంస్కృతి వేళ్ళు నూరుకుంటోంది. ప్రభుత్వ శాఖలకు వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు రాస్తే పరోక్ష హెచ్చరికలు జారీ చేసే స్థితికి ఇక్కడ వ్యవస్థలు సిద్ధ పడుతున్నాయి.బాధితుల తరపున వార్తలు రాస్తే, వాస్తవాలు తెలుసుకుని రాయాలి అంటూ.. పరోక్షంగా బెదిరిస్తున్నారు.ఈ మేరకు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. విశాఖలో వరుసగా ఇటువంటి అనుభవాలే స్థానిక మీడియాకు రెండు రోజులు ఎదురయ్యాయి. ఒకటి పోలీసు శాఖ నుంచి కాగా,మరొకటి జీవీఎంసీ నుంచి అటువంటి ఖండనలు విడుదలయ్యాయి.
నడిరోడ్డుపై ఓ ఫ్రంట్ లైన్ వర్కర్ పట్ల..
విశాఖలో నడిరోడ్డుపై ఓ ఫ్రంట్ లైన్ వర్కర్ పట్ల విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కర్ఫ్యూ వేళల్లో తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి పోలీసులు ఈ చలాన్ విధించారు. దీనిపై ఆ యువతి పోలీసులను నిలదీసింది. ఈ క్రమంలో పోలీసుల ఈగో హర్ట్ కాగా, యువతి హద్దులు మీరి దూషణకు పాల్పడింది. ఆమెను అరెస్టు చేసే క్రమంలో ఆ యువతి ఎదురుతిరిగి రోడ్డుపై బైఠాయించింది. ఈ పెనుగులాటలో ఓ హోంగార్డు కు స్వల్ప గాయాలు అయ్యాయి.ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో దుమారం రేపాయి. సంయమనం పాటించాల్సిన పోలీసులు యువతి పట్ల ప్రవర్తించిన తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. దాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో పోలీసులు ఇరువురుపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఈ వ్యవహారం కూడా పోలీసు శాఖ పై ఉన్న ప్రతిష్టను దిగ జార్చాయి.దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు అంటూ వారికి అనుకూలమైన రీతిలో చెప్పే ప్రయత్నం చేశారు.గతంలో ఇదే విశాఖ నగరం బీచ్ రోడ్‌లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అనుచరులు పోలీసులపై విరుచుకుపడ్డారు.“నువ్వెంత.. నీ బతుకెంత.. నీ జీతం ఎంత? అంటూ కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి దిగారు.అర్ధరాత్రి రాష్‌గా నడుపుతున్న వాహనాన్ని అడ్డుకున్న కానిస్టేబుల్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది.ఇక్కడ పోలీసుల ఈగో హర్ట్ అయినా వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. అదే సామాన్య యువతి విషయానికి వచ్చే సరికి స్పాట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. పోలీసు విధులకు ఆమె ఆటంకం కలిగించిందని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంత్రి అనుచరులు విషయంలో మరోలా వ్యవహరించారు.
విలేకర్ల వ్యాఖ్యలు రికార్డింగ్..
అయితే అంతకు ముందు వివిధ గ్రూపుల్లో పోలీసుల తీరుపై తీవ్రమైన చర్చ జరిగింది. నూటికి 99 శాతం మంది ఆ యువతికే మద్దతు తెలిపారు.దీంతో పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో యువతికి మద్దతుగా ప్రశ్నలు అడుగుతున్నవిలేకరుల వీడియోలు పోలీసు సిబ్బంది చిత్రీకరించారు.విశాఖ చరిత్రలో ఇలా చిత్రీకరించడం బహుశా ఇదే తొలిసారి. ప్రభుత్వ శాఖకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారో అటువంటి విలేకర్ల మాటలను వీడియో రికార్డు చేయడంపై మీడియా వర్గంలో కలకలం రేపింది.
Must Read ;- అప్పుడు డాక్టర్ సుధాకర్.. ఇప్పుడు లక్ష్మీ అపర్ణ : మాజీ ఎంపీ హర్షకుమార్
హిడెన్ స్పౌట్స్ నిర్మాణాల తొలగింపుపై..
ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే జీవీఎంసీ సిబ్బంది విశాఖ ఎంవీపీ కాలనీలోని హిడెన్ స్పౌట్స్ స్వచ్ఛంద సంస్థలోని తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు.సంస్థకు చెందిన షెడ్డును జీవీఎంసీ అధికారులు కూల్చివేయడం దురదుష్టకరం అని పేర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి,రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయినీ ఉద్దేశిస్తూ బిసిసిఐ మాజీ చీఫ్ కోచ్ ఎంఎస్‌కె ప్రసాద్ వీడియోను కూడా విడుదల చేశారు.బుద్ధిమాంద్యం ఉన్న సుమారు 150 మంది పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిస్వార్థ సేవ చేస్తున్న సంస్థ పట్ల తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.మరుసటి రోజు ఆ పిల్లలు,వారి తల్లిదండ్రులు నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. అన్ని పత్రికల్లోనూ పిల్లలకు మద్దతుగానే కథనాలు వెలువడ్డాయి.దీనిపైనా జీవీఎంసీ అధికారులు ఘాటుగా స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు రాయవద్దు అంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.ఆ కథనాలను ఏకపక్షంగా రాసిన పత్రికలన్నీ ఖండన రాయాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ ధోరణి చూస్తుంటే రానున్న రోజుల్లో ప్రజల పక్షాన పత్రికలు నిలిచే పరిస్థితులు కనిపించడం లేదు.ప్రభుత్వ శాఖలకు వ్యతిరేకంగా ఎటువంటి వార్తలు ప్రచురించినా, చేసిన తప్పులను బహిర్గతం చేసినా వాటిని సరిదిద్దుకునే పరిస్థితి ప్రభుత్వ యంత్రాంగానికి కొరవడింది. దీంతో మీడియాపై ఎదురు దాడికి దిగే ఆనవాయితీ పెరుగుతోంది. సుప్రీం కోర్టు, హైకోర్టులు ఎన్ని విధాలుగా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేందుకు వీల్లేదని తీర్పులు ఇస్తున్నా అధికారుల్లో మాత్రం ఇసుమంతైనా మార్పు రావడం లేదు. మరి రానున్న రోజులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే..!
Also Read ;- వాళ్లు మనుషులా? పశువులా? : విష్ణుకుమార్ రాజు