What Were The Reasons Behind The Cancellation Of AP CM Jagan’s Delhi Tour :
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు పది రాష్ట్రాల సీఎంలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మావోయిస్టుల ప్రభావంతో సతమతమవుతున్న రాష్ట్రాల సమస్యలు, వాటి పరిష్కారం, అంతిమంగా దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ భేటీకి రెండు తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావాల్సి ఉంది. అమిత్ షా దర్శనమే గగనమైన వేళ.. కనీసం ఈ సమావేశం ద్వారా అయినా ఆయన దృష్టిలో పడటంతో పాటు తమ రాష్ట్రాల సమస్యలు చెప్పుకునేందుకు కూడా అవకాశమివ్వాలని ఆయా రాష్ట్రాల సీఎంలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ భేటీని తమకు దక్కిన సదవకాశంగా ఆ పది రాష్ట్రాల సీఎంలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ సీఎం జగన్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని శనివారం నాడు వార్తలు వినిపించినా.. చివరి నిమిషంలో జగన్ తన ఢిల్లీ టూర్‌ను రద్దు చేసుకున్నారు. తన బదులుగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితను ఢిల్లీకి పంపుతున్నారు. ఇలా తన ఢిల్లీ టూర్‌ను జగన్ రద్దు చేసుకోవడానికి గల కారణాలపై ఇప్పుడు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కాలు బెణికిందా?
శనివారం ఉదయం వ్యాయామం చేస్తుండగా ఆయన కాలు బెణికిందట. అయితే అప్పటికప్పుడు ప్రాథమిక చికిత్స తీసుకున్నా.. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గలేదట. అంతేకాకుండా నొప్పి నివారణ కోసం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారట. కాలు నొప్పి నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సీఎంకు బదులు హోంమంత్రి మేకతోటి సుచరిత ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం కాక ముందు నుంచే జగన్ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్న సంగతి తెలిసిందే. తన సుధీర్ఘ పాదయాత్ర సందర్భంగా జగన్ దినచర్య గురించి జనానికి పూర్తిగా తెలిసిపోయింది. ఈ క్రమంలో ఎంత బిజీగా ఉన్నా కూడా జగన్ తన దినచర్యను మాత్రం ఏమాత్రం మార్చుకోరట. క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తున్న కారణంగానే జగన్ ఇప్పటికీ ఫిట్ గా కనిపిస్తారని కూడా చెబుతారు. అయితే వ్యాయామంలో చిన్నపాటి బెణుకుకే ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకునేంతగా జగన్ ఇబ్బంది పడుతున్నారా? అన్న దిశగానూ సరికొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
స్పెషల్ అపాయింట్ మెంట్ లేదట
సాధారణంగా జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తప్పనిసరిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాలని బలంగా కోరుకుంటారు. అసలు తన ఢిల్లీ టూర్లన్నీ అమిత్ షా అపాయింట్లమెంట్ల ఆధారంగానే ఖరారు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం నాడు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల భేటీకి హాజరైనా.. ఆ భేటీకి ముందుగానీ, తర్వాత గానీ అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కావాలని జగన్ భావించారట. ఇదే విషయాన్ని అమిత్ షా కార్యాలయంతో సంప్రదించగా.. అమిత్ షాతో స్పెషల్ అపాయింట్ మెంట్ ఇవ్వడానికి సాధ్యపడదని అక్కడి నుంచి సమాచారం వచ్చిందట. దీంతో అమిత్ షాతో స్పెషల్ భేటీ లేకుండా ఢిల్లీ వెళ్లి చేసేదేం లేదని కూడా జగన్ భావించారట. రాష్ట్రాలతో కేంద్రం సమావేశానికి రాష్ట్ర హోం మంత్రిని పంపితే సరిపోతుందని, ఈ మాత్రం సమావేశానికి తానెందుకు వెళ్లాలని కూడా జగన్ భావించారట. ఒకవేళ అమిత్ షా స్పెషల్ అపాయింట్ మెంట్ ఇచ్చి ఉంటే.. తానే ఈ సమావేశానికి హాజరయ్యేవాడినని. పనిలో పనిగా అమిత్ షాతోనూ కలిసి చాలా సమస్యలు చర్చించేవాడినని, అయితే ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో తాను ఢిల్లీ వెళ్లి ప్రయోజనమేమిటని జగన్ భావించారట. దీంతోనే ఆయన తన ఢిల్లీ టూర్‌ను రద్దు చేసుకుని తన బదులుగా సుచరితను పంపిస్తున్నారన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- భరోసా లేదు.. వాతలూ తప్పలేదు










