సాధారణ ఎన్నికల్లో మెజారీటీ ఓట్లు సాధించిన వారే విజేతలు కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో 50 శాతం పైగా రావాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 14న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న జరుగనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గ్రాడ్యూయేట్ల స్థానాల బరిలో ఎంతో మంది
ఏపీలోని తూర్పు–పశ్చిమ గోదావరి, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు, తెలంగాణలో నల్లగొండ-ఖమ్మం-వరంగల్(నల్లగొండ), హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్(హైదరాబాద్) నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరిగాయి. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులు, స్వతంత్రులు హోరాహోరీగా తలపడ్డారని చెప్పవచ్చు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలో 76.41 శాతం.. హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో 67.26శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ నుంచి 93 మంది, నల్లగొండ నుంచి 71 మంది పోటీ చేస్తుండడంతో పోలింగ్‌కు భారీ బ్యాలెట్లను వినియోగించారు. దాదాపు 3.5లక్షల ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది. 17వ తేదీ అర్ధరాత్రికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రాధాన్యత ముఖ్యం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ సాధారణ ఎన్నికలతో పోల్చితే ప్రత్యేకంగా ఉంటుంది. అభ్యర్థులందరికీ ప్రాధాన్యత ప్రకారం ఓటు వేయవచ్చు. ఒక అభ్యర్థికి ఒక నెంబరు మాత్రమే – ఒక నెంబరు ఒక్కరికి మాత్రమే వేయాలి. రెండు నెంబర్లు ఒకే అభ్యర్థికి వేసినా, ఒకే నెంబరు ఇద్దరు అభ్యర్థులకు వేసినా, నెంబరు కాకుండా టిక్ మార్కులు పెట్టినా లేదా ఇతర రాతలు, అక్షరాలు ఉన్నా ఆ ఓటు పరిగణలోకి తీసుకోరు. చెల్లనిదిగా పరిగణిస్తారు. అంతేకాదు.. ప్రాధాన్యతల నెంబరుకూడా మొత్తం ఉండాలి. మధ్యలో నెంబరు మిస్ అయితే..అక్కడి వరకే ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారు. ఉదాహరణకు 1,2,3,4,5,6, 8, 9,10 ప్రాధాన్యతల ప్రకారం ఓటు వేస్తే.. మధ్యలో 7నెంబరు ఎవరికీ ఇవ్వలేదు కాబట్టి.. 6 వ ప్రాధాన్యత ఓటు వరకే పరిగణలోకి తీసుకుంటారు.
Must Read ;- పెద్ద సంఖ్యలో ఓటేసిన పట్టభద్రులు.. పట్టం కట్టింది ఎవరికో..?
50శాతం ఫార్ములా..
కాగా సాధారణ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించిన వారు విజేత కాగా..ఎమ్మెల్సీ ఎన్నికల్లో సగానికి పైగా మొత్తం ఓట్లు (ప్రాధాన్యతలు అన్నీ కలిపి) రావాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు మొత్తం పోలైన ఓట్లు 50వేలు అనుకుంటే.. 25001ఓట్లు రావాలి. అందుకు అంటే 50%+1 ఫార్ములా అమలవుతుంది. ఓవైపు ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి- తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి పోలైన ఓట్లలోని ప్రాధాన్యత ఓట్లను కలుపుతూ వెళ్తారు. ఎక్కడైతే ఏదేని అభ్యర్థి 50%+1 సాధిస్తారో అక్కడ కౌంటింగ్ ఆపేస్తారు.
ఉదాహరణ చూస్తే..
మొత్తం పోలైన ఓట్లు 15000. గెలిచేందుకు 7,501 రావాల్సి ఉంటుంది. తొలుత మొదటి ప్రాధాన్య ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్య ఓట్లు 7501వస్తే అలా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అయితే 90శాతం అది జరిగే అవకాశం ఉండదు. గతంలో చాలా తక్కువ సార్లు మొదటి ప్రాధాన్యత ఓటు గెలుపును నిర్ణయిచింది. తొలిరౌండ్‌లో ఆ ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తారు. అక్కడి నుంచి అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఆ లెక్కింపు ఎలా ఉంటుందో ఇక్కడ A,B,C,D,E,F అభ్యర్థులుగా చూద్దాం.
మొదటి ప్రాధాన్యత ఓట్లు
- A అభ్యర్థికి – 4,000
- B అభ్యర్థికి – 5,000
- C అభ్యర్థికి – 3,000
- D అభ్యర్థికి – 1,000
- E అభ్యర్థికి – 800
- F అభ్యర్థికి – 1200
ఇందులో ఎవరికీ7501 ఓట్లు రాలేదు కాబట్టి ఎవరూ గెలవలేదు. దీంతో ప్రాధాన్యత ఓటింగ్‌లో ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కిస్తారు.అంటే ఇందులో E అభ్యర్థికి అందరి కన్నా తక్కువ ఓట్లు వచ్చినందున అతడిని పోటీ నుంచి తొలగిస్తారు. అదే అదే సమయంలో Eకి వచ్చిన 800ఓట్లలో రెండో ప్రాధాన్యత ఉన్న ఓట్ల ప్రకారం మిలిగిన అభ్యర్థులకు పంచుతారు. అంటే 800 ఓట్లలో A అభ్యర్థికి 300, B అభ్యర్థికి 200, C అభ్యర్థికి 100, D కి 50, F అభ్యర్థికి 150 రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి అనుకుందాము. అప్పుడు మళ్లీ లెక్కిస్తారు.
రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు..
- A అభ్యర్థికి 4000+300=4300
- B అభ్యర్థికి 5000+200=5200
- C అభ్యర్థికి 3000+100=3100
- D అభ్యర్థికి 1000+50=1,050
- F అభ్యర్థికి 1200+150=1350
ఈ ప్రకారం చూస్తే అందరికంటే B అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినా గెలిచేందుకు అవసరమైన ఓట్లు రాలేదు. కాబట్టి ఇక్కడా మూడో ప్రాధాన్యత ఓటు లెక్కింపు అవసరం అవుతుంది. అందుకు గాను రెండో ప్రాధాన్యత ఓటు పరిగణనలోకి తీసుకున్న తరువాత ఎవరికైతే తక్కువ ఓట్ల వచ్చాయో వారిని తొలగిస్తారు. అప్పుడు D అభ్యర్థిని పోటీ నుంచి తొలగిస్తారు. అతడికి వచ్చిన 1000+50 ఓట్లలో మూడో ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చిందో ఆ ప్రకారం మిగతా అభ్యర్థులకు పంపిణీ చేస్తారు. అంటే Dని తొలగించిన తరువాత రేసులో ఉండేది నలుగురే.
మూడో ప్రాధాన్యత లెక్కింపు..
అలా D అభ్యర్థికి వచ్చిన (1000+50) మూడో ప్రాధాన్య ఓట్లను అభ్యర్థులకు పంపిణీ చేస్తారు. మొదటి 1000 ప్రాధాన్యత ఓట్లలో A అభ్యర్థికి 200, B అభ్యర్థికి 550, C అభ్యర్థికి 100, F అభ్యర్థికి 150 ఓట్లు చొప్పున, రెండో ప్రాధాన్య ఓట్ల దక్కిన బ్యాలెట్లలో మూడో ప్రాధాన్య ఓట్లు A 10 ఓట్లు, Bకు 30, Cకు 3, Fకు7 వచ్చాయనుకుందాం. అప్పుడు మళ్లీ లెక్క చూస్తారు.
- A అభ్యర్థికి 4300+200+10=4510
- B అభ్యర్థికి 5200+550+30=5780
- C అభ్యర్థికి 3100+100+3=3203
- F అభ్యర్థికి 1350+150+7=1507
ఇప్పుడు కూడా ఎవరికి 7,501 ఓట్లు ఎవరికి రాలేదు. దీంతో ఈ నలుగురిలో తక్కువ ఓట్లు వచ్చినవారిని పోటీ నుంచి తప్పిస్తారు. ఆ ప్రకారం చూస్తే.. Fని తప్పిస్తారు. అతడికి వచ్చిన ఓట్లను, నాలుగో ప్రాధాన్యత ప్రకారం మిలిగిన అభ్యర్థులకు పంపిణీ చేస్తారు. నాలుగో ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారు. అయినా ఎవరూ 7501వరకు రాని పక్షంలో ప్రాధాన్యత ప్రకారం ఓట్ల లెక్కింపు చేస్తూ వెళతారు. ఎక్కడైతే నిర్ణీత ఓట్ల సంఖ్యను అభ్యర్థి అధిగమిస్తారో వారు విజేత అవుతారు. అందుకే అభ్యర్థులు మొదటి ప్రాధాన్య ఓటు, రెండో ప్రాధాన్య ఓటు, మూడో ప్రాధాన్య ఓటుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ పరిస్థితుల్లో నాలుగో ప్రాధాన్య ఓటు లోపే విజేతలు ఎవరో తేలిపోతుంది.
Also Read ;- పైసలు పంచండి,ఓట్లు కొనండి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు











