విభజన హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజధాని అభివృద్ధి, లోటు భర్తీ, పోలవరం పూర్తి నిధుల జాడ కనిపించలేదు. కనీసం వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.350 కోట్లు కూడా బడ్జెట్లో కేటాయించిన దాఖలాలు కనిపించలేదు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు, వారితో జట్టుకట్టిన జనసేన నాయకులు నోరుమెదపడం లేదు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరవాత ఆ రెండు పార్టీల నేతలు మీడియా ముందుకు రాలేకపోయారు. ఏపీకి కేంద్రం ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకపోగా, ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని తమిళనాడుకు రూ.70 వేల కోట్లు, కేరళకు రూ.60 వేల కోట్లు, అస్సాంకు రూ.19 వేల కోట్లు కేటాయించి వివక్ష చాటుకున్నారు.
సోము వీర్రాజు ఏరీ? ఎక్కడ?
కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరవాత ఏపీ బీజేపీ అధినేత సోము వీర్రాజు మొహం చాటేశారు. ఏపీ ప్రజలకు ఆయన ఏం సమాధానం చెప్పుకుంటారు. విభజన హామీల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడానికి కూడా ఇవ్వడానికి కేంద్ర బీజేపీ నేతలకు చేతులు రావడం లేదు. అయినా ఏపీలో బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి తీసుకువస్తామంటూ ఆ పార్టీల నేతలు రాష్ట్రంలోొ గప్పాలు కొడుతున్నారని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు ఏపీ బీజేపీ నేతలు కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ నేతలను కలసి ఏపీకి రావాల్సిన నిధుల గురించి ఒక్కమాట చెప్పిన దాఖలాలు లేవు. ఎంతసేపటికీ దేవాలయాల ధ్వంసం ఘటనలను రాజకీయం చేసి ఓట్లు దండుకోవాలన్న యావతప్ప, విభజిత ఏపీకి న్యాయం చేయాలన్న వాంఛ వారిలో మచ్చుకైనా కనిపించడం లేదని సాధారణ పౌరులు విమర్శిస్తున్నారు. వారికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఏపీ బీజేపీ నేతలపై ఉంది.
Must Read ;- బీజేపీకి బీపీ తెప్పిస్తున్న సోము వీర్రాజు వైఖరి
జనసేనాని నోరు తెరవరా?
కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా కనీసం ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను కూడా ఆపివేసినా ఈ నేతలకు కనిపించడం లేదని తెలుగు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలని ప్రయత్నించడం తప్పుకాదు.
కానీ ప్రజలకు జరిగిన అన్యాయంపై నోరుమెదపకుండా ఓట్లు దండుకోవాలని చూడటం మాత్రం అన్యాయమే. ప్రత్యేక హోదా ఊసేలేదు, రైల్వేజోన్ మరచిపోయారు, విభజన హామీల మేరకు రాజధాని అభివృద్ధికి నిధులు విడుదల చేయలేదు… అయినా ప్రతిపక్ష పార్టీగా ఉన్న జనసేన కనీసం స్పందించలేదంటే వారు ఏ మొహం పెట్టుకుని జనం ముందు రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడుగుతారనే ప్రశ్న ఉదయించకమానదు.
చేతులెత్తేసిన అధికారపార్టీ
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే నెల రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వాలు వారి డిమాండ్లను కేంద్ర ఆర్థిక మంత్రి ముందు ఉంచడం జరుగుతూ ఉంటుంది. అడగందే అమ్మైనా పెట్టదు అంటారు. ముందు మనకు ఏం కావాలో కనీసం కేంద్ర మంత్రులను అడక్కుండా, వారికి తెలిసే అవకాశం లేదు. కానీ ఏపీలో అధికారపార్టీ బీజేపీతో అంటకాగుతోంది. ఏపీ ప్రయోజనాలు వారికి పట్టడం లేదు. కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న నేతలే వారిపై ఉన్న సీబీఐ కేసులు కొట్టివేయించుకునేందుకు ప్రధాని కాళ్లపై పడ్డంతపని చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.
ఇక కేంద్రం మెడలు వంచుతాం… అనేది పెద్ద బూతు కిందే లెక్క. ఏపీకి ఏమీ ఇవ్వకపోయినా పవరాలేదు, మాపై ఉన్న సీబీఐ కేసులు కొట్టివేస్తే చాలని అధికార పార్టీ అగ్రనేతలు, కేంద్ర బీజేపీతో జట్టుకట్టిన పార్టీల నేతలకు ఏపీ ప్రయోజనాలు గుర్తుకు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయినా ఆ మూడు పార్టీలు అంటే వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు స్పందించే పరిస్థితుల్లో లేరనే చెప్పవచ్చు. రాష్ట్ర ప్రయోజనాలకన్నా ఎవరి సొంత ఎజెండాలు వారికున్నాయని జనానికి తెలిసిన విషయమే కదా… అని ప్రజలు అనుకుంటున్నారు.
Must Read ;- తెలుగు రాష్ట్రాలకు నిల్.. ఎన్నికలున్నోళ్లకు ఫుల్