కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండిచెయ్యి చూపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు జనరల్ కేటాయింపులు తప్ప.. ప్రత్యేక కేటాయింపులేమీ లేవు. అదే సమయంలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు దాదాపు లక్షన్నర కోట్లు కేటాయించారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాంలకు కేటాయింపులు భారీగా ఉన్నాయి. ఎన్నికలు జరగనున్నఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టే దిశగా అనూహ్య కేటాయింపులు జరిగాయని చెప్పవచ్చు. అంతే కాకుండా..ఇటీవల జరిగిన సర్వేల్లోనూ బీజేపీకి అస్సాం, పుదుశ్చేరి మినహా మిగతాచోట్ల అధికారం దక్కే ఛాన్స్ లేదని తేలడంతో ఈ కేటాయింపుల వల్ల లబ్ధిపొందే ఆలోచనగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తం రూ.34లక్షల కోట్ల బడ్జెట్ లో రాష్ట్రాలకు జరిగే కేటాయింపుల్లో సింహభాగం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే కేటాయించడం గమనార్హం. కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రసంగంలో నోబెల్ గ్రహీత, బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉటంకించారు. ఇది కాకతాళీయమే అయినా.. పశ్చిమబెంగాల్ విషయంలో బీజేపీ సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇస్తోందని చెప్పవచ్చు.
మూడు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధికి భారీగా కేటాయింపులు
తమిళనాడు, కేరళ: తమిళనాడు రోడ్ల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు జరిపారు.1.35లక్షల కోట్ల నిధులు కేటాయించిన కేంద్రం అందులో చెన్నై మెట్రోకు కూడా రూ.63,246 కోట్లు, తమిళనాడు బస్ ట్రాన్స్‌పోర్టు కోసం రూ.18వేల కోట్లు కేటాయించింది. కేరళకు సైతం నిధులు భాగానే కేటాయించారు. ఈ రాష్ట్రంలోనూ ఈ ఏడాది ఎన్నికలు జరగున్నాయి. కొచ్చి మెట్రో రైలు ఫేజ్-2 అభివృద్ధికి రూ.1957 కోట్ల కేటాయించారు. దాదాపు 65 వేల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేయనున్నారు. వీటితోపాటు బెంగళూరు, నాగ్‌పూర్, కొచ్చి మెట్రో లైన్ల విస్తరణ, బెంగళూరు మెట్రో కోసం రూ.14,788కోట్లు ఇచ్చారు. 1100 కిలోమీటర్ల మేర హైవే విస్తరణ, నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
బెంగాల్‌కు రూ.95వేల కోట్లు..
మమత బెనర్జీ నుంచి ఎలాగైన సరే.. అధికార పీఠాన్ని చేజిక్కించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న బీజేపీ.. బడ్జెట్‌లోనూ తమ అనుకూలతను వాడుకుంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ.95వేల కోట్లు కేటాయించింది. ఇవి కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేక ఆర్థిక మండలికి వచ్చే నిధులు, కోల్‌కతా రైల్వేకు నిధులు అదనం. ఈ బడ్జెట్‌లో 675 కిలోమీటర్ల రహదారి నిర్మాణం, రోడ్ల అభివృద్ధికి రూ.95వేల కోట్లు కేటాయించారు.
Must Read ;- వావ్.. చిప్పచేతికిచ్చారు.. కృతజ్ఞతలు జగన్ గారు..!
అస్సాంకు..
రానున్న ఎన్నికల్లో బీజేపీ ఆశలు పెట్టుకున్న రాష్ట్రం కావడంతో వారికీ భారీగానే నిధులు కేటాయించారు. ఈ రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో రూ.34 వేల కోట్లతో 1,300 కిలోమీటర్ల హైవేలు అభివృద్ధి చేయనున్నారు. కేవలం హైవేల కోసమే రూ.19వేల కోట్లు కేటాయించారు.
ఏపీ, తెలంగాణకు మొండిచేయి..
ఇక ఏపీ, తెలంగాణకు మొండిచేయి చూపించారని చెప్పవచ్చు. ప్రత్యేక కేటాయింపులేవీ లేకపోవడంతో రెండు రాష్ట్రాల్లోనూ విమర్శలు వస్తున్నాయి. ఏపీ కొత్త రాష్ట్రం కావడం, ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత ఉండడంతోపాటు తెలంగాణలోనూ పలు ప్రాజెక్టుల నిర్మాణం, హైదరాబాద్ ప్రగతి లాంటి విషయాల్లో కేటాయింపులేవీ లేకపోవడం గమనార్హం. అదే సమయంలో ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ పుట్టినిల్లైన తమిళనాడుకు భారీగా కేటాయింపులు జరపగా అత్తింటి తెలుగునేలకు మొండిచేయి చూపారని సోషల్ మీడియాలో కామెంట్లూ వినిపిస్తున్నాయి.
Also Read ;- ఆరోగ్యరంగానికి పెద్ద పీట.. కేంద్ర బడ్జెట్