మనం కొన్ని రంగులకు అలవాటు పడిపోయాం. పోలీసుస్టేషన్లకు ఎరుపు రంగు, అంబులెన్సులకు తెలుపు, న్యాయవాదులకు నలుపు, పోలీసులకు ఖాకీ, స్కూలు వాహనాలకు పసుపు.. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో రంగును అన్వయించేసుకున్నాం. మరి ఆ రంగులు రూపు మారితే..! ఓ రాజకీయ పార్టీకి గుర్తుగా మారిపోతే..! ఇప్పుడదే జరుగుతోంది ఏపీలో. మన జగనోరి జమానాలో.. ఒక్కొక్కటిగా అన్నీ కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సరికొత్తగా వెలిగిపోతున్నాయి.
దేనికైనా రంగు పడాల్సిందే..!
మొన్నటికి మొన్న.. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజాధనంతో పార్టీ రంగులు అద్దుకున్నారు. సరే..! కొత్తకదా.. పోనీలే అనుకున్నాం. కానీ.. కోర్టు వదల్లేదనుకోండి. పీక మీద కత్తిపెట్టి మరీ రంగులు మార్పించింది. ఆటో వాలాలకు 10 వేలు ఇచ్చామని వాటి మీదా పార్టీ స్టిక్కర్లు అంటించేసింది. అది కూడా పోలీసులతో..! సరేలే.. నెమ్మదిగా మారతారు అనుకున్నాం. తర్వాత ఇంకో అడుగు ముందుకేసి.. అంబులెన్సులకూ తన పార్టీ జెండా రంగులు వేయించేశారు మన జగనన్న. దీంతో.. వెలుతోంది అంబులెన్సా..! లేక అధికార పార్టీ వాహనమా అనేది తేల్చుకోలేక కంగారుపడడం జనం వంతైంది.
Must Read ;- ప్రతిష్ఠను కాపాడుకోవడానికి వాయిదా వేస్తున్నా: జస్టిస్ రాకేశ్ కుమార్
ఇప్పుడు తాజాగా పోలీసు వాహనాలకు అధికార పార్టీ రంగు పడింది. వెలుతోంది పోలీసా? లేక అధికార పార్టీ కార్యకర్తా అనేది అర్థం కాని స్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీళ్లిద్దరికీ పెద్ద తేడా ఏం కనిపించడం లేదనుకోండి. అది వేరే విషయం. మారతారులే.. మారతారులే.. అని అనుకుంటూ పోతున్నాం. ఆయన మారే విషయం అటుంచితే.. మనం మారిపోతున్నాం. ఈ రంగులద్దే వ్యవహారాలకు అలవాటు పడిపోతున్నాం. ఆయనకు కావలసిందీ అదే అనుకోండి..! అసలే ఆయన జగనన్న. ఎవరు చెప్పినా వినరు.
ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసినా.. దులిపేసుకుంటారు. పైగా తిరిగి వారిపైనే బురద జల్లుతారు. కోర్టులనీ లెక్కచేయరు. గట్టిగా మాట్లాడితే జడ్జిలపైనే బురద జల్లుతారు. తాజాగా ఈ రంగుల వ్యవహారంలో హైకోర్టు జడ్జి రాకేష్ కుమార్ వ్యాఖ్యలు చూడండి. ఆ కేసును విచారించేందుకు కూడా ఆయన వెనకడుగు వేశారు. జనవరిలో రిటైర్ కాబోతున్న ఆయన.. ఆ తర్వాతకు కేసును వాయిదా వేసేశారు. విచారణకు తీసుకుంటే.. మళ్లీ ఈ కేసు నుంచి కూడా తనను తప్పించాల్సిందిగా పిటిషన్ వేస్తారేమో అనే భయం. రిటైర్ కాబోయే ముందు బురద అంటించుకోవడం ఇష్టం లేని ఆయన.. ఓ రకంగా తెలివైన నిర్ణయమే తీసుకున్నారు. ఇలా.. జడ్జిలనే భయపెట్టిన ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైనా చూశామా? అది మన జగనోరి జమానాలోనే సాధ్యం.
చివరికి కోర్టులకీ ఆయన తన పార్టీ రంగులు వేసేస్తారేమో! ఒక్కసారి ఆలోచించండి.. కోర్టులు, పోలీసుస్టేషన్లు, స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ జగనన్న రంగులతో నిండిపోతే ఎలా ఉంటుందో..! ఇంకా మూడున్నరేళ్లు ఉంది కాబట్టి.. ఏమైనా జరగొచ్చు. జగనోరి జమానాలో ఎప్పుడు దేనికైనా రంగు పడొచ్చు.
Must Read ;- టూ లేట్ : జగనన్న హామీకి రెండేళ్లు.. నిలిచిన ‘వెలిగొండ’ సొరంగం పనులు