YS Sharmila Is Paying Money To The People Who Attending To Her Agitation :
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ అభిమానులు ఉన్నారన్న విషయంపై ఇప్పటికే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా వ్యతిరేకించిన వైఎస్సార్.. తెలుగు నేల ఉమ్మడిగా ఉన్న సమయంలోనే అకాల మరణం చెందారు. ఆ తర్వాతే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. వైఎస్సార్ కుమారుడు తన పప్పులు తెలంగాణలో ఉడకవని తెలుసుకుని ఏపీకి మాత్రమే పరిమితమైపోయారు. అన్న పార్టీలో తనకు సముచిత స్థానం కాదు కదా.. కనీస స్థానం కూడా దొరకని నేపథ్యంలో వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణ వేదికగా వైఎస్సార్టీపీ పేరిట కొత్త రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. అయితే ఈ పార్టీకి ఆదిలోనే లెక్కలేనన్ని అవాంతరాలు ఏర్పడ్దాయి. అయినా కూడా వెనక్కు తగ్గని షర్మిల.. నిరుద్యోగ దీక్షల పేరిట తెలంగాణను చుట్టేస్తున్నారు. ఈ దీక్షల్లోనే షర్మిలకు ఊహించని పరిణామాలే ఎదురవుతున్నాయి. అయినా ఆమె మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఆమె దీక్షలకు జనం వస్తూనే ఉన్నారు. ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా.. షర్మిల దీక్షలకు జనం ఎలా వస్తున్నారన్న విషయం ఇప్పుడు తేలిపోయింది. డబ్బిచ్చి మరీ జనాన్ని షర్మిల తన సభలకు తరలిస్తున్న వైనం కలకలమే రేపుతోంది.
ఒక్కొక్కరికి రూ.400
నిరుద్యోగ దీక్షల్లో భాగంగా మంగళవారం నాడు వైఎస్ షర్మిల మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో నిరుద్యోగ దీక్ష చేపట్టాలని భావించారు. అయితే, పీర్జాదిగూడలో షర్మిల చేపట్టబోయే నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్షలో పాల్గొనడానికి వైఎస్సార్‌టీపీ నేతలు జనాన్ని అప్పటికే తీసుకొచ్చారు. అయితే, దీక్షకు తమను తీసుకొచ్చి డబ్బులు ఇవ్వట్లేదని అడ్డాకూలీలు నిరసనకు దిగారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని వారు తెలిపారు. తమ కూలీ తమకు ఇవ్వాలని కోరారు. షర్మిల దీక్ష ప్రారంభం కావడానికి ముందే ఇలా ఓ వైపు పోలీసుల అనుమతి నిరాకరణ, మరోవైపు డబ్బులిస్తామని చెప్పి తమను దీక్షలకు తీసుకొచ్చారని అడ్డాకూలీల ఆరోపణలు వైఎస్సార్టీపీ నేతలను తీవ్రంగానే ఇబ్బందుల్లోకి నెట్టేశాయని చెప్పక తప్పదు. మరి పోలీసుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో షర్మిల ఈ దీక్షను ఎలా చేపడతారోనన్న అంశం ఆసక్తికరంగా మారింది.
పార్టీ నిర్మాణం లేకుంటే అంతే మరి
ఇప్పటికాలం నేతలకు రాజకీయాలంటేనే డబ్బు వెదజల్లడమన్న అభిప్రాయం ఉంది. సరిపడినంత మేర డబ్బు చేతిలో ఉంటే.. రాజకీయాల్లో క్లిక్ కావచ్చని కూడా చాలా మంది యువ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు కొత్తగా వచ్చే పార్టీలు తమ పార్టీ నిర్మాణంపై అసలు దృష్టే సారించడం లేదు. వైఎస్ షర్మిల కూడా ఈ కోవకు చెందిన వారేనని తాజా ఘటనతో తేలిపోయింది. తెలంగాణలో పార్టీ పెట్టాలంటే.. ముందుగా పార్టీ వెంట నడిచేదెవరు? పార్టీని ముందుండి నడిపించేదెవరు? అలా నడిపించే నేతలకు తమ సొంత ప్రాంతాల్లో ఉన్న బలమెంత?.. తదితర విషయాలను షర్మిల మరిచారనే చెప్పాలి. కేవలం తన తండ్రి అంటే అభిమానం ఉన్న నేతలంతా తన వెంట నడుస్తారని షర్మిల భావించారు. అంతేకాకుండా తన వద్ద ఉన్న డబ్బుతో జనాన్ని కొనేయొచ్చని కూడా ఆమె భావించారని కూడా చెప్పక తప్పదు. అందుకే కాబోలు.. షర్మిల ఆదిలోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న వాదనలు ఇప్పుడు బలంగానే వినిపిస్తున్నాయి.
Must Read ;- ముగ్గురు వస్తే.. ఒక్కొక్కరూ ఒక్కో వెరైటీ











